‘55వేల ఉద్యోగాలిచ్చిన సీఎంకు భయమెందుకో’

Update: 2025-07-04 09:12 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే 55వేలకు పైగా ఉద్యగాలు ఇచ్చామని జబ్బలు చర్చుకునే సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. ఇందిరమ్మరాజ్యంలో సచివాలయం తలుపు 24 గంటలూ అందరి కోసం తెరిచే ఉంటాయని చెప్పిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు తలుపులు మూసేశారంటూ ఎద్దేవా చేశారు. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి వారి గొంతులు నొక్కారని మందిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. ‘‘ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా ? అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు గద్దెనెక్కిన తరువాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తే లేదా ? చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడమే దారుణమైతే, ఇవాళ సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గం. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60 వేల ఉద్యోగాలకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించరు. ఓవైపు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే, మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం. ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టుచేసి వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కారు మెడలు వంచుతాం.. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం’’ అని అన్నారు.

Tags:    

Similar News