తెలంగాణ రాజకీయాలకు ఎరువై పోయిన యూరియా
యూరియాకు ప్రత్యామ్నయం నానో యూరియా. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు...;
యూరియా..యూరియా గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక వరకు యూరియా(Urea)నే ప్రధాన ముడిసరుకు అయ్యింది. యూరియాలో ఉండే నత్రజని(Nitrogen) వల్ల పంటపొలాలు పచ్చగా ఉన్నట్టే రాజకీయాలు(Politics) కూడా పచ్చగా కళకళాలాడుతున్నాయి.యూరియా ఓవర్ డోస్ అయితే భూసారం తగ్గితే రాజకీయాల్లో అయితే సారం మరీ ఎక్కువైంది. రాష్టం కేంద్రాన్ని నిందిస్తుంటే కేంద్రం రాష్ట్రాన్ని నిందిస్తుంది. బిఆర్ఎస్(Brs) మాత్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ కేంద్రాన్ని వెనకేసుకొస్తుంది.తన చిరకాల దోస్తానాను నిలబెట్టుకుంటుంది.శత్రువు శత్రువు మిత్రుడు అని చాణక్య రాజనీతిని ప్రదర్శిస్తోంది.కాంగ్రెస్(Congress) టార్గెట్ గా రాజకీయాలు నడుపుతుంది.
తెలంగాణలో నిజంగానే యూరియా కొరత ఉందా? మరి కొరత ఉన్నపుడు, చాలినంత యూరియ రైతులకు అందుబాటులో లేనపుడు పరిష్కారం ఏమిటి?
అయితే, యూరియా కొరత ఎదుర్కొనొందుకు ప్రత్యామ్నాయం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు(Agriculture Scientist) చెబుతున్నారు.
ప్రతీ సమస్యకు పరిష్కారం ఉన్నట్టే యూరియా సంక్షోభానికి పరిష్కారం ఉందని వాళ్లు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అరలీటర్ నానో యూరియా(Nano Urea) బాటిల్ బస్తా యూరియా బస్తాతో సమానమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు, ప్రజల్లో ఉన్న అవగాహనా రాహిత్యాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నట్టు అభిప్రాయం వ్యక్తమౌతుంది.
తెలంగాణలో యూరియా కొరత ఇంతా అంతా కాదు. రాత్రంతా క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నా తెల్లారితే మాత్రం రైతుకు బస్తా యూరియా దొరకడం లేదు. క్యూలైన్ లో తన ముందు ఉన్న రైతు బస్తా యూరియా దొరకగానే మీసం తిప్పి భుజాన యూరియా బ్యాగ్ వేసుకునివెళ్లిపోయే పరిస్థితి ఉంది. పంట చేతికి రాకముందే బస్తా బ్యాగులోనే మోక్షం చూసుకుంటున్నాడు. ఆరుగాలం కష్టపడిన రైతు తనకు గిట్టుబాటు ధరవస్తే ఎంత సంతోషంగా ఫీలవుతాడో అంతకంటే ఎక్కువగా ఉప్పొంగిపోతున్నాడు.
బస్తా యూరియాకు వెంపర్లాట
క్యూలైన్లో చెప్పులు పెట్టి మరీ బస్తా యూరియా కోసం రైతు వెంపర్లాడే దుస్థితి ఏర్పడింది. నానో యూరియా ప్రత్యామ్నాయం అయినప్పటికీ అవగాహనా రాహిత్యం వల్ల రైతులు దీన్ని వాడటం లేదు. ఐదుఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు మాత్రమే నానో యూరియా ఎక్కువగా వాడుతున్నారు. డ్రోన్ ల ద్వారా ద్రవరూపంలో ఉన్ననానో యూరియాను తమ పంటపొలాల్లో పిచికారి చేస్తున్నారు. చిన్న రైతులు మాత్రం దీన్ని వినియోగించడం లేదు. ఎందుకంటే అరఎకరం, ఒక్క ఎకరం ఉన్నచిన్న రైతులు డ్రోన్ లు ఉపయోగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియానే వారికి అలవాటైన యూరియా.మత్తు పదార్థాల వలె యూరియా అలవాటయ్యింది.ఇప్పట్లో యూరియా మత్తు దిగే అవకాశం లేదు. తాతాల కాలం నుంచి వినియోగిస్తున్న యూరియాను విడిచి కొత్తగా నానా యూరియాను వినియోగించడం ఊహకు అందని విషయం. తెలంగాణ పల్లెల్లో నానో యూరియా అనగానే అదో టైపు ముఖం పెడుతున్నారు. పిచ్చోడిని చూసినట్లు చూసి వెళ్లిపోతున్నారు.
నానో అలవాటు చేయాలి: పాలఅశోక్
‘‘ నానో యూరియా వర్కవుట్ కాదు.కూలీలను పెట్టి పంట పొలాల్లో ఈ మందు కొట్టించాలి,సాం ప్రదాయ యూరియాను చేతితో పొలంలో అక్కడక్కడ చల్లి తే చాలు. నానో యూరియా అలా కాదు. ప్రతీ మొక్కలేదా పంటలకు దగ్గరుండి పిచి కారి చేయాలి అనే అపోహతో ఎక్కువ మంది రైతులు నానో యూరియా పట్ల ఆసక్తి చూపడం లేదు .నానో యూరియా కొంతవరకు ఉఫశమనం పొందవచ్చు. యూరియా సంక్షోభాన్నిగట్టెక్కించవచ్చు. వ్యవసాయాధికారులు రైతులకు (Farmers)అవగాహన కల్పించాలి. నానో యూరియా వారికి అలవాటు చేయాలి’’ అని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన రైతు పాల అశోక్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు చెబితే మెల్లిగా అలవాటవుతారని ఆయన అన్నారు.
‘‘నానో యూరియా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన ప్రత్యేక రకమైన ద్రవరూపమైన ఎరువు. దీనివల్ల మొక్కల రంద్రాల ద్వారా పోషకాలు నేరుగా మొక్కలోకి వెళతాయి. పంటలు దిగుబడిపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని చెట్ల గౌరారంకు చెందిన నరహరి అనే రైతు చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడింది: మెదక్ జిల్లా ఏఓ
‘‘నానో యూరియా మొక్కలోకి వెళ్లడం ద్వారా పంటలు దిగుబడిపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని మెదక్ జిల్లా వ్యవసాయాధికారి(District Agriculture officer) దేవ్ కుమార్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.
‘‘క్షేత్రస్థాయిలో రైతులు ముఖ్యంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి నిస్తేజం అవుతుంది. యూరియాను మోతాదుకు మించి వాడడం ద్వారా నేల కాలుష్యంతోపాటుగా రైతులకు పెట్టిన పెట్టుబడి రావడం లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. గుళికల రూపంలో వేసినటువంటి ఎరువుల్లో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే పంట తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఎరువులు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన నానో యూరియా వల్ల పత్ర రంధ్రాల ద్వారా నత్రజని ఎరువులు మొక్కలకు 70 నుంచి 80 శాతం అందుతాయి. వినియోగ సామర్థ్యం పెరిగి రైతుకు పంట దిగుబడిలో సానుకూల ప్రభావం చూపుతోంది’’ అని ఆయన చెప్పారు.
‘‘ అతి తక్కువ ఖర్చుతో ఈ ద్రవరూప ఎరువులు వాడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సాంప్రదాయ యూరియా కంటే చాలా తక్కువ మోతాదులో నానో యూరియా అవసరం అవుతుంది. కనుక నత్రజని లీచింగ్, నీటి కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తుంది. నానో యూరియాను ఎకరాకు ఒక బాటిల్ (అరలీటరు) పిచికారి చేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వ్యవసాయ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం’’ అని దేవ్ కుమార్ చెప్పారు.
‘‘నానో యూరియా వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. రైతులకు నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాం. ప్రయోజనాలు, వినియోగించే విధానాలను వివరించాం’’ అని మండల ప్రత్యేక అధికారి, గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి బాబు నాయక్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.
‘‘ నానో యూరియా వల్ల నైట్రోజన్ వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. మొక్కల పెరుగుదల, ధారాళమైన దిగుబడి, నాణ్యతను మెరుగుపరుస్తుంది. సాధారణ యూరియాపై ఆధారాన్ని తగ్గించి, వ్యయాన్ని తగ్గిస్తుంది.పర్యావరణహితం – నైట్రోజన్ లీచింగ్ తగ్గి మట్టి నీటి కాలుష్యం తగ్గుతుంది’’ అని బాబునాయక్ చెప్పారు.
ప్రధాన పంట దశల్లో వాడితే మెరుగైన ఫలితాలు అందుతాయి.తొలకరి, పుష్పించు దశలో నానో యూరియాను వాడితే ప్రయోజనాలు ఎక్కువ. 1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలి.ప్రతి పంట కాలంలో రెండు సార్లు ఉపయోగించాలి.
వరి, గోధుమ, పత్తి, మక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు, నూనె గింజల పంటల్లో దీన్ని విరివిగా వాడొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అరలీటర్ బాటిల్ రూపంలో నానో యూరియా అందుబాటులో ఉంది. ఇది ఒక యూరియా బస్తాకు సమానం.అయినప్పటికీ నానో యూరియా వాడటం లేదు. సాంప్రదాయ యూరియా డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో నానో యూరియా ఆ వాక్యూమ్ పూడ్చగలదు.
ఖరీఫ్ సాగుకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. వర్షా కాలంలో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి వచ్చింది. అంటే నిర్ణీత కోటాలో సగం యూరియా మాత్రమే రాష్ట్రానికి అందింది. దీంతో రైతులకు సరిపడా యూరియా అందడంలేదు. రాష్ట్ర అవసరాలు, కేటాయింపులకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం నుంచి ఆశించిన మేరకు యూరియా రావడంలేదు. ఆగస్టు వరకు కేటాయింపులు 8.30 లక్షల టన్నులుగా ఉంది. కానీ, ఇపట్పివరకు జరిగిన సరఫరాతో పోలిస్తే ఇంకా 2.98 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడింది. దీనికితోడు తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి ఆశించిన స్థాయిలో యూరియా ఉత్పత్తి కావడంలేదు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 145 పనిదినాలు ఉంటే.. 78 రోజులు రామగుండంలో యూరియా ఉత్పత్తి జరగలేదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఉత్పత్తి సరిగా లేకపోవడం, అటు కేంద్రం నుంచి కోటా ప్రకారం రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవడంతో రాష్ట్రంలో కొరత ఏర్పడింది. ఈ వర్షాకాలం పంటలు గట్టెక్కాలంటే ఇంకా 4.50 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి రావాలి.ఇప్పట్లో అయితే కేంద్రం నుంచి యూరియా రాకపోవచ్చు. రాష్ట్రంలో ఉత్పత్తి లేదు. నానో యూరియా తప్పితే మరో మార్గం లేదు.