కాంగ్రెస్‌కు రామ్‌చందర్ స్ట్రాంగ్ కౌంటర్
ఓట్ల చోరీ చేసింది బీజేపీ కాదు కాంగ్రెస్ అంటూ విమర్శనాస్త్రాలు.;
ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఓట్ జరిగిందన్న మహేష్ వ్యాఖ్యలకు రామ్‌చందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ చోరీ జరిగిందని అంటున్నారని, కానీ జరిగింది రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ సెటైర్లు వేశారు. ఏ ఓటర్ లిస్ట్‌తో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అదే ఓటర్ జాబితాతోనే బీజేపీ కూడా గెలిచిందని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిస్తే.. కాంగ్రెస్ ఎంపీలు కూడా దొంగ ఓట్లతోనే గెలిచారా? అంటూ మండిపడ్డారు రామ్‌చందర్ రావు. తెలంగాణ కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లను పెంచి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించాలని కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమన్నారు. ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరతేనని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా తోడుదొంగలని రామ్‌చందర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే వాటిని ఆలస్యం చేయడం కోసం నానా తిప్పలు పడుతూ, అన్ని మార్గాలు వెతుక్కుంటుందని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని, పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా వచ్చినా.. రైతులను రెచ్చగొట్టడం కోసం కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
మహేష్ కుమార్ ఏమన్నారంటే..
బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే వారి గెలుపును పునఃపరిశీలించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని, దానిని తాను నిరూపిస్తానని అన్నారు. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు ఉన్నాయని మహేష్ కుమార్ ఆరోపించారు. నిజామాబాద్‌లో అనేక మంది మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయని, కరీంనగర్‌లోని ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఓట్ల చోరీ చేయాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి మాత్రమేనని ఆరోపించారు.