హైదరాబాద్ 'అరణ్య భవన్' లో టైగర్ సెల్
జనవాసాల్లో పులులు, చిరుతల సంచారానికి ఇక బ్రేక్.... ఎలాగంటే;
By : Saleem Shaik
Update: 2025-08-25 04:38 GMT
‘‘మా ఊర్లో మేకల మందపై పులి దాడి చేసింది...మా ఊరు నుంచి బైక్‌పై పోతుంటే పులి తోవ దాటింది...గొర్లను మేపబోతే చిరుతపులి నీళ్లు తాగేందుకు వాగుకు వచ్చింది...ఇప్పుడే గిక్కడకెళ్లి పులి వెళ్లింది’’ అంటూ తెలంగాణ రాష్ట్రంలోని పలు అటవీ జిల్లాల్లో నిత్యం మనకు ఏదో ఒక అటవీ గ్రామంలో ప్రజలు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
జనవాసాల్లోకి పులులు, చిరుతలు
తెలంగాణ రాష్ట్రంలో పలు అడవుల జిల్లాల్లో పులులు, చిరుతలు ఆహారం, నీళ్ల కోసం జనవాసాల్లోకి వస్తున్నాయి. మనుషులు, పులుల మధ్య సంఘర్ణణ తలెత్తడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు దీన్ని నివారించడానికి అరణ్య భవన్ కేంద్రంగా టైగర్ సెల్ ను ఆగస్టు నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వన్యప్రాణుల విభాగం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆధ్వర్యంలో కొందరు ఐఎఫ్ఎస్ అధికారులు, పులుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న హిటికాస్, మరో సంస్థ ప్రతినిధులు సభ్యులుగా టైగర్ సెల్ నిర్వహణ కోసం ఒక కమిటీని నియమించాలని తాజాగా నిర్ణయించారు. పులులు, చిరుతల సంచారంపై టైగర్ సెల్ మానిటరింగ్ చేస్తుందని తెలంగాణ వన్యప్రాణుల పరిరక్షణ విభాగం సీనియర్ అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పులుల సంచారంపై గ్రామస్థుల ఫిర్యాదులు
-మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీగడ్‌పూర్ గ్రామ పంచాయతీలో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి దాడులకు భయపడి రైతులు పొలాలకు వెళ్లడం మానేశారు.
- ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని పెన్‌గంగా నది పరీవాహక ప్రాంతంలో తాజాగా ప్రజలకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర, మంగి, సవర్గాం గ్రామాల మధ్య పెద్ద పులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
- మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్,కడంబా రిజర్వు ఫారెస్టుల నుంచి పులులు ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి వలస వస్తున్నాయి. కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లడంలో మహారాష్ట్ర పులులు పలు అటవీగ్రామాల్లో సంచరిస్తూ ప్రజలకు కనిపిస్తున్నాయి.
తెలంగాణకు మహారాష్ట్ర పులుల వలసలు
మహారాష్ట్రలోని తాడోబా రిజర్వు ఫారెస్టులో 50 పులులు, ఇంద్రావతి జాతీయ పార్కులు 35 పులులున్నాయి.దీంతో మహారాష్ట్ర పులులు తెలంగాణ అడవులకు వలస వస్తున్నాయి. ఒక్కో పులి సంచారానికి తగిన ఫారెస్ట్ టెరటరీతోపాటు వాటి ఆహారం కోసం జింకలు, సాంబార్, నీల్ గాయిలు కావాలి. కవ్వాల ఫారెస్టులో పులులకు ఆహారం పుష్కలంగా ఉంది. మహారాష్ట్రలో అధికంగా ఉన్న పులులను తెలంగాణ కవ్వాల అభయారణ్యానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ వన్యప్రాణుల విభాగం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మహారాష్ట్ర అటవీశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. మహారాష్ట్రలో పులుల పునరుత్పత్తితో వీటి సంఖ్య పెరగడంతో తెలంగాణ కవ్వాల అభయారణ్యానికి పులులను పంపించేందుకు పొరుగు రాష్ట్ర అటవీశాఖ అధికారులు అంగీకారం తెలిపి ప్రతిపాదనలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదం కోసం పంపించారు.
పెరిగిన చిరుతల సంచారం
హైదరాబాద్ నగర శివార్లలోని ఇక్రిశాట్ లో, గ్రేహోండ్స్ పోలీసు ఆవరణలో ప్రత్యక్షమైన చిరుత పులులను అటవీశాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేసి వాటిని పట్టుకొని అమ్రాబాద్ అడవుల్లో వదిలేశారు.మంచిరేవుల, బాలాపూర్ శివారు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలోనూ చిరుతలు సంచరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిగామ సిరన్పల్లి ప్రాంతాల్లో ఇటీవల చిరుతలు మేకలమందలపై దాడి చేశాయని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. పాలమూరు జిల్లాలోనూ చిరుతలు సంచరిస్తున్నాయని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ధర్మారం, రుద్రంగి, నూకలమర్రి ప్రాంతాల్లో, కామారెడ్డి జిల్లా సిరికొండ మండలంలో చిరుతలు సంచరిస్తుండటంతో పలు గ్రామాల ప్రజలు, రైతులు గగ్గోలు పెడుతున్నారు.కిన్నెరసాని, వెంకటాపురం, ఏటూరునాగారం ప్రాంతాల్లోనూ చిరుతల సంచారం పెరిగింది.
తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే...
తెలంగాణలో పులుల సంఖ్య 40కుపైగా ఉంది. మరో వైపు 187 చిరుతపులులున్నాయి. ఒక పులి సంచరించడానికి వీలుగా 30 కిలోమటర్ల టెరీటరీని ఎంచుకొని ఆ ప్రాంతంలోనే నివాసమంటోంది. అయితే పులుల సంఖ్య పెరగటం,అటవీ ప్రాంతం విస్తీర్ణం తగ్గడంతో పులుల సంచారానికి టెరీటరీ కరువై అవి కాస్తా పల్లెలపై పడి పశువులను చంపేస్తున్నాయి.
అటవీ ప్రాంతం అంతర్ధానం
పోడు సేద్యం వల్ల 12లక్షల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అంతర్ధానం అయిపోవడంతోపాటు పులులు, చిరుతల వేట కోసం ఆశించిన మేర జింకలు, దుప్పులు లేవు. దీనివల్ల అడవుల్లోని పులులు,చిరుతలు అటవీ ప్రాంత పల్లెలపై పడి పశువులపై దాడి చేస్తున్నాయి. మరో వైపు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని అంధేరి, తడోబా అభయారణ్యాల్లో పులుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అవి కాస్తా టెరిటరీ లేక అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అభయారణంలోకి వలస వస్తున్నాయి. ఈ వలస వచ్చిన పులులు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో సంచరిస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
టైగర్ సెల్ ఏర్పాటు ఎందుకంటే...
తెలంగాణలో పులులు, చిరుతలు జనవాసాల్లోకి రాకుండా టైగర్ సెల్ చర్యలు తీసుకుంటుందని తెలంగాణ వన్యప్రాణుల విభాగం సీనియర్ అధికారి, వన్యప్రాణి నిపుణుడు ఎ శంకరన్ చెప్పారు.దీని కోసం తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు పులులు, చిరుతలను పర్యవేక్షించడానికి ‘టైగర్ సెల్’ను ఆగస్టు నెలాఖరులోగా ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఈ కొత్త సెల్ ప్రత్యేకంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పులులు, చిరుతపులి కదలికలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 22వతేదీన అరణ్యభవన్ లో జరిగిన అటవీ శాఖ అధికారుల సమావేశంలో టైగర్ సెల్ పర్యవేక్షణకు కమిటీని నియమించాలని నిర్ణయించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో వాహనాల రాకపోకలపై అధ్యయనం
కవ్వాల టైగర్ రిజర్వ్ లోపల భారీ వాహనాల రాకపోకల ప్రభావంపై అధ్యయనం నిర్వహించాలని తెలంగాణ వన్యప్రాణుల బోర్డు నిర్ణయించింది. దిద్దుబాటు చర్యలను అమలు చేసే లక్ష్యంతో ఈ అధ్యయనం వన్యప్రాణుల మరణాలు, శబ్ద కాలుష్యం,వాయు కాలుష్యం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టింది. కవ్వాల అభయారణంలో ప్రధాన రోడ్డుపై వాహనాల రాకపోకలకు తాజాగా అనుమతించారు.అటవీ చెక్‌పోస్టుల నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అడవుల సంక్షేమం, వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కేటాయించాలని తెలంగాణ వన్యప్రాణుల బోర్డు సిఫార్సు చేసింది.
పులులు, చిరుతలు కనిపిస్తే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయండి
పశువుల వేట, పులులు, ఇతర వన్యప్రాణుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ పరిస్థితులను నిర్వహించడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరిత ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేయడానికి ఈ టైగర్ సెల్ ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, మన్ననూర్‌లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్,మంచిర్యాలలోని కవ్వాల టైగర్ రిజర్వ్‌లలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి ఐదు గ్రామాలను, కవ్వాల టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి ఒక గ్రామాన్ని తరలించడానికి ప్రతిపాదనలకు వన్యప్రాణి బోర్డు సమావేశం ఆమోదించింది.తెలంగాణ రాష్ట్రంలోని జనవాసాల్లో పులులు, చిరుతలు కనిపిస్తే టోల్ ఫ్రీ ఫోన్ నంబరు 040 232317725కు సమాచారం ఇవ్వాలని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల విభాగం సీనియర్ అధికారి ఎ శంకరన్ కోరారు.