KTR | ‘అందరికీ అన్నీ అని ఇప్పుడు కొందరికే కొన్ని అంటే ఎలా’
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.;
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో పలు సంక్షేమ పథకాల అమలుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అధికారం కోసం కాంగ్రెస్ చేస్తున్న నయవంఛనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అని చెప్పి.. వన్ ఇయర్ తర్వాత.. వన్ విలేజ్ అంటే ఎలా కుదురుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులందరికీ అందించాలని, అడ్డగోలు షరతులు పెట్టి.. కోతలు విధించడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలో కోతలు పెట్టడంపైనే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, తిక్కతిక్క కారణాలు చెప్తూ ఏదో ఒక రకంగా కోతలు విధించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విధ్య అని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్షరసత్యం చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై పలు ప్రశ్నలు సంధించారు.
‘‘మండలానికి ఒక గ్రామంలోనే
మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ?
మండలానికి ఒక గ్రామంలోనే
మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా ?
మండలానికి ఒక గ్రామంలోనే
మీ ఎన్నికల ప్రచారం చేశారా ?
మండలానికి ఒక గ్రామంలోనే
ప్రజలను ఓట్లేయమని అడిగారా ?
మండలానికి ఒక గ్రామంలోనే
ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారా ?
నాడు "అందరికీ అన్నీ.."
అని..
నేడు "కొందరికే కొన్ని.."
పేరిట మభ్యపెడితే
నాలుగు కోట్ల తెలంగాణ
మీ నయవంచనను క్షమించదు..
ఎన్నికలప్పుడు..
రాష్ట్రంలోని ప్రతి మండలం..
ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా..
అబద్ధపు హామీలను ఊదరగొట్టి..
"వన్ ఇయర్" తరువాత "వన్ విలేజ్"
అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే
ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు..
ఓపిక పట్టడానికి మేము సిద్ధం కానీ
ఏరు దాటక తెప్ప తగలేసే
మీ ఏడాది దగా పాలన
చూసిన తరువాత ఆగడానికి
ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు
గుర్తుపెట్టుకోండి..
"పథకాలు రాని గ్రామాల్లో.."
రేపటి నుంచి..
"ప్రజా రణరంగమే..!!’’ అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.