కవితకు కేటీఆర్ వార్నింగ్..
పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదు. అధినేతకు ఎవరైనా లేఖలు రాయొచ్చు.;
బీఆర్ఎస్‌లో చీలికలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీలు చేసిన ఆరోపణలను ప్రస్తుతం బీఆర్ఎస్‌లోని పరిస్థితులు వాస్తవాలగా మారుస్తున్నాయి. కేసీఆర్‌కు కవిత రాసిన ఆరు పేజీల లేఖ ఇప్పుడు అన్నాచెల్లెలి మధ్య మాటల యుద్ధానికి నాంది పలికింది. అసలు ఆ లేఖ కవితే రాశారా? అన్న ప్రశ్నకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. తానే స్వయంగా రాశానని, రెండు వారాల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆమె చేసిన వ్యాఖ్యలకు శనివారం ఉదయం కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడాలంటూ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని చెప్తూనే.. లోపల విషయాలను లోపలే ఉంచాలని, అంతర్గతంగా చర్చించాలని కేటీఆర్ చెప్పారు.
‘‘పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదు. అధినేతకు ఎవరైనా లేఖలు రాయొచ్చు. సూచనలు చేయొచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సరైన టైమ్ వచ్చినప్పుడు వారే బయటపడతారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన మాటల్లో పార్టీ వ్యవహారాల కన్నా.. కవిత చేసిన ప్రతి మాటలకు కౌంటర్ ఇవ్వడమే ఎక్కువగా కనిపించింది. ఇప్పటికే బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత మధ్య సంబంధాలు కాస్తంత చెడిపోయి ఉన్నాయన్న టాక్ వినిపిస్తున్న క్రమంలో.. కవిత, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. కవితకు కేటీఆర్ వార్నింగ్ ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు. ఆ లేఖ.. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో లీక్ అయింది. నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ పాలిటిక్స్‌ను కమ్మేసింది. ఈ లేఖ కవితే రాశారా? అన్న అనుమానాలు కూడా బలంగా వినిపించాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కవిత.. అమెరికా నుంచి రావాల్సిందే అని అంతా ఎదురుచూశారు. ఆమె శుక్రవారం రాత్రి తెలంగాణకు వచ్చారు. అయితే ఈ లేఖ గురించి కవిత.. పార్టీలో ఎవరితోనూ చర్చించకుండా, ఎవరికీ ఒక్కమాట కూడా చెప్పకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే మీడియాతో మాట్లాడేశారు. తానే రాశానని అంగీకరించారు. లేఖలో కార్యకర్తల అభిప్రాయాలే ఉన్నాయి తప్పితే.. పర్సనల్ అజెండా ఏమీ లేదన్నారు. అంతేకాకుండా కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. అయితే అసలు ఈ విషయంపై పార్టీలో చర్చించకుండా.. అంతర్గత విషయాన్ని బహిర్గతం చేయడం, పార్టీలో కోవర్టులు ఉన్నారని అనడం, సొంత పార్టీ నేతలనే దెయ్యాలు అని వ్యాఖ్యానించడాన్ని కేటీఆర్ తీసుకోలేకపోయారని, అందుకే వార్నింగ్ ఇచ్చారని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదంతా కూడా కవిత రాసుకున్న ప్లానే అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఇన్నాళ్లూ బయటకు రాని లేఖ.. ఆమె అమెరికాకు వెళ్లిన రోజే బయటకు వచ్చిందని కొందరు తమ దృక్కోణాన్ని చెప్తున్నారు. ఇదంతా కేసీఆర్ ప్లానే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. పార్టీలో పదవిని కవితకు అందించడం కోసం కేసీఆర్ ఈ ప్లాన్ రచించారని, ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయన్న మాట కూడా జోరుగా వినిపిస్తోంది. అలా కేసీఆర్ ఎందుకు చేస్తారంటే ఎవరి వెర్షన్ వాళ్లు చెప్తున్నారు. కొందరు రాజకీయ ఉనికి అంటే మరికొందరు కవితపై ప్రేమ అంటున్నారు.