రాహుల్ గాంధీకి కేటీఆర్ హెచ్చరికలు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు.

Update: 2024-08-18 11:40 GMT

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసింది అని లేఖలో విమర్శించారు. 40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ. 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న కేటీఆర్... రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే, వారి తరపున కాంగ్రెస్ పార్టీపైన పోరాడుతామని హెచ్చరించారు.

ఇంటింటికీ బీఆర్ఎస్..

గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తారన్నారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలు పెడతామని వెల్లడించారు. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి మంత్రి నియోజక వర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

రుణమాఫీ ఆందోళనలు..

రాష్ట్రంలో రుణమాఫీ అందని రైతులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, రేవంత్ శవ యాత్రలు వంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా కష్టపడ్డ తనకే రుణమాఫీ జరగలేదని.. రుణమాఫీ చేయకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా అని రాజారెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు.


Tags:    

Similar News