KTR | ‘దమ్ముంటే చర్చ రండి’.. సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ..
తెలంగాణలో ఈ-కార్ రేస్ దుమారం మరోసారి రేగుతోంది. ఈ అంశంపై చర్చకు తాము సిద్ధమని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తెలంగాణలో ఈ-కార్ రేస్(E-car Race) దుమారం మరోసారి రేగుతోంది. ఈ కేసులో కేటీఆర్(KTR)కు విచారించడానికి గవర్నర్ అనుమతి లభించిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే గవర్నర్ అనుమతించిన పత్రాలను తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) మంగళవారం రాత్రి ఏసీబీ(ACB) అధికారులకు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా కేటీఆర్‌ను విచారించడానికి చర్యలు చేపట్టొచ్చు. ఈ క్రమంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీ చర్చకు అనుమతించాలని ఛాలెంజ్ చేశారు. తాము చర్చకు సిద్ధమని, ఇందులో కాంగ్రెస్ చెప్తున్నవి వాస్తవాలే అయినా వారు కూడా చర్చకు రావాలని పిలిచారు. కేటీఆర్ తన లేఖలో అనేక అంశాలను వివరించారు. 2023లో తమ ప్రభుత్వం నిర్వహించిన ఈ-కార్ రేస్.. అన్ని వర్గాల వారి మన్ననలు అందుకున్నదని చెప్పారు. తమ పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే పరమావధిగా కాంగ్రెస్ పని చేస్తోందని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రతిష్టను చెడగొట్టడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఒక పదిపాళ్లు ప్రజల సమస్యలపై పెట్టినా నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించబడుతాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ
— BRS Party (@BRSparty) December 18, 2024
❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.
❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl
కేటీఆర్ లేఖ యథాతథంగా..
‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నది. ఇదే విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకున్నది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.
నిజానికి ఫార్ములా- ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసన సభ వేదికగా చెబుదాం. శాసన సభ సెషన్ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి. మరోసారి చెబుతున్నాను. ఫార్ములా ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్ ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి’’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.