ఇదీ హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని(Nehru Zoological Park ) బ్రీడింగ్ క్రాల్ నైట్ హౌస్ ప్రత్యేక గుహ...మేటింగ్ సీజను ప్రారంభం కావడంతో జూపార్కులో ఉన్న ఆఫ్రికన్ ఆడ సింహం మగ సింహం తోడు కోసం హీటెక్కి ఎదురు చూస్తుంది. దీన్ని గమనించిన జూపార్కు ఎనిమల్ కీపర్లు, పశువైద్యులు ఆఫ్రికన్ మగ సింహాన్ని బ్రీడింగ్ నైట్ హౌస్ లోకి పంపించారు.ఆఫ్రికన్ సింహాల జంట శృంగారంతో ఆఫ్రికన్ ఆడ సింహం గర్భం దాల్చి సింహం కూనకు జన్మనిచ్చింది.
రెండు ఆఫ్రికన్ సింహాలు 8 కి పెరిగాయ్
2012వ సంవత్సరంలో సౌదీ అరేబియా రాజు అబ్ధుల్లా బిన్ అజీజ్ హైదరాబాద్ జూపార్కు సందర్శించిన సందర్భంగా ఆఫ్రికన్ సింహాల జంటను బహుమతిగా అందించారు. నాడు సౌదీ రాజు జంట సింహాలు పంపించగా గడచిన 13 ఏళ్లలో అవి సంతానోత్పత్తి చేయడంతో వీటి సంఖ్య 8 కి పెరిగింది.దీంతో అరుదైన ఆఫ్రికన్ సింహాలు జూపార్కు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
రెండున్న ఇండియన్ ఎలుక జింకలు 16 అయ్యాయి...
జూపార్కులో ఇండియన్ ఎలుక జింకలు (Indian Chevrotain/Mouse Deer) మొదట్లో కేవలం రెండే ఉండేవి. ఈ అరుదైన జింకల సంతానోత్సత్తికి అనువైన వాతావరణాన్ని జూ అధికారులు కల్పించడంతో వీటి సంఖ్య 16 కు పెరిగాయి. ఎలుక జింకలు కలిసి సంతానోత్పత్తి చేసేందుకు వీలుగా వీటి కోసం ప్రత్యేకంగా బ్రీడింగ్ డెలివరీ రూంలను ఏర్పాటు చేసి, వాటిని ప్రత్యేకంగా గదుల్లో ఉంచారు. దీంతో అవి కలయికతో ఆడ ఎలుక జింకలు గర్భం దాల్చి పిల్లల్ని పెడుతున్నాయి. దీంతో జూపార్కులో ఎలుక జింకల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
సంతానోత్పత్తిలో రికార్డు
జూపార్కులో సింహాలు, పులులు, ఎలుక జింకలే కాదు వివిధ రకాల వన్యప్రాణుల సంతానోత్సత్తి (Major Breeding Animals)సాగించాయి. వన్యప్రాణులను సందర్శనకు ఉంచడమే కాకుండా అరుదైన జాతుల జంతువులను సంతానోత్సత్తి చేసేందుకు హైదరాబాద్ జూపార్కులో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో వన్యప్రాణుల సంతానోత్పత్తి వల్ల దేశంలోనే అత్యధిక సంఖ్యలో వన్యప్రాణులున్న జూగా హైదరాబాద్ పేరొందింది.హైదరాబాద్ జూపార్కు వన్యప్రాణుల సంతానోత్పత్తిలో రికార్డు సాధించిందని తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బ్రీడింగ్ డెలివరీ రూం
హైదరాబాద్ జంతుప్రదర్శనశాలలో వివిధ రకాల జంతువులు శృంగారం జరపడం ద్వారా సంతానోత్పత్తి చేసేందుకు ప్రత్యేకంగా 70కి పైగా బ్రీడింగ్ డెలివరీ రూంలు, గుహలను ఏర్పాటు చేశారు. జూపార్కు జంతువులు, వన్యప్రాణుల కలయిక కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్లలో కాకుండా జూపార్కు వెనుక వైపు ప్రత్యేకంగా 70 కిపైగా బ్రీడింగ్ గుహలను ఏర్పాటు చేశామని జూపార్కు పశువైద్యాధికారి అయిన డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సంతానోత్పత్తి చేసే వన్యప్రాణులకు తాము మంచి ఆహారంతో పాటు విటమిన్ల సప్లిమెంట్ అందిస్తామని చెప్పారు.
హాండ్ రియరింగ్ సెంటర్
కొన్ని పులులు, సింహాలు కూనలకు జన్మనిచ్చాక వాటిని దగ్గరకు రానివ్వవు. కూనలకు పాలు కూడా ఇవ్వవు. అలాంటి కూనలను హాండ్ రియరింగ్ సెంటరుకు తరలించి తమ జూపార్కు ఎనిమల్ కీపర్ల సాయంతో వాటికి పాలు పట్టి పెంచుతున్నామని డాక్టర్ హకీం చెప్పారు. పాలు పట్టి పెంచాక అవి పెరిగి పెద్దయ్యాక వాటికి మాంసం పెట్టడంతో పాటు ఎన్ క్లోజర్లలోకి పంపిస్తామని చెప్పారు. జూపార్కులో సింహాలు, పులులు, చిరుత పులులు, జింకలు, తాబేళ్లు, మొసళ్లు, సాంబార్, నీలుగాయిలు, పక్షులు, పాములు...ఇలా ఒకటేమిటి పలు రకాల వన్యప్రాణులు, జంతువుల సంతానోత్పత్తి చేస్తున్నామని డాక్టర్ అబ్దుల్ హకీం వివరించారు.
జూపార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి
దేశంలోనే అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటైన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు పలు వన్యప్రాణుల సంతానోత్పత్తి కేంద్రంగా మారింది.వివిధ రకాల అరుదైన వన్యప్రాణులతో సందర్శకులకు కనువిందు చేయడమే కాకుండా అంతరించి పోతున్న వన్యప్రాణుల సంతానోత్పత్తికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జూపార్కులో ఉన్న అరుదైన జంతువులను సంతానోత్పత్తికి వీలుగా వాటిని బ్రీడింగ్ కేంద్రాలకు తరలించి, పశువైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పలు వన్యప్రాణులు ఏడాది కాలంలో పలు పిల్లలకు జన్మనిచ్చాయి.
జంటగా వచ్చి కూనలకు జన్మనిచ్చి...
రెండు ఉన్న బెంగాల్ టైగర్ లు సంతానోత్పత్తితో మూడు కూనలకు జన్మనిచ్చాయి. తెల్లపులి జంట కూడా మూడు పులి కూనలను పెట్టింది. తోడేళ్లు, కృష్ణ జింకలు, నక్కలు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు ఇలా ఒకటేమిటి పలు రకాల వన్యప్రాణులు జంటగా వచ్చినా, సంతానోత్పత్తి వల్ల వీటి సంఖ్య జూపార్కులో పెరిగింది. సంతానోత్పత్తి చేసే వన్యప్రాణులకు ప్రత్యేకంగా గుహలు ఏర్పాటు చేసి, వాటికి మంచి ఆహారం, మల్టీ విటమిన్లు అందిస్తూ జూపార్కు వైద్యాధికారులు, జూ కార్మికులు సేవలు అందిస్తున్నారు.సంతానోత్పత్తి వల్ల జూపార్కులో వివిధ వన్యప్రాణుల సంఖ్య పెరగడంతోపాటు పులి కూనలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్ణణగా నిలిచాయి.ఇలా పులి కూనలను పలువురు దత్తత తీసుకొని వాటి పోషణకు అయ్యే ఖర్చును విరాళాలుగా అందిస్తున్నారు.
గర్భం దాల్చిన వన్యప్రాణులకు దాణాతో పాటు విటమిన్ల పంపిణీ
గర్భం దాల్చిన వన్యప్రాణులకు నాణ్యత గల దాణాతోపాటు వివిధ సంప్లిమెంట్లను పశువైద్యులు అందిస్తుంటారు. బి కాంప్లెక్స్, ఖనిజ మిశ్రమం, మల్టీవిటమిన్లు అందించి ఆరోగ్యవంతమైన కూనలు జన్మించేందుకు తోడ్పాటు అందిస్తారు. జూపార్కులోని వన్యప్రాణులు, జంతువులను నిరంతరం పరీక్షలు చేస్తూ వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తుంటామని జూపార్కు పశువైద్యాధికారి అయిన డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రాబందుల పెంపక కేంద్రం
అంతరించి పోతున్న రాబందులు, మౌస్ డీర్ ల సంతానోత్పత్తికి బ్రీడింగ్ సెంటర్లను జూపార్కులో ఏర్పాటు చేశారు. నగరంలో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న జంతువులను జూపార్కులోని పుసరావాస సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చి వాటికి చికిత్స అందించి సంరక్షిస్తున్నారు. జంతువులు, వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా పశువైద్యశాలను జూపార్కులో ఏర్పాటు చేశారు. బయట నుంచి చికిత్స కోసం తీసుకువచ్చిన జంతువులు,పక్షులకు, పాములకు 30 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందించి, కోలుకున్న తర్వాత వాటిని అడవుల్లో వదిలివేస్తున్నారు.సెంట్రల్ జూ అథారిటీ నిధులతో హైదరాబాద్ జూ పార్కులో ప్రత్యేకంగా రాబందుల పెంపక కేంద్రం, మౌస్ డీర్ బ్రీడింగ్ సెంటరును ఏర్పాటు చేశారు. అంతరించి పోతున్న రాబందులు, ఎలుక జింకలను సంతానోత్పత్తి చేయడం ద్వారా ఈ జాతులను సంరక్షించేందుకు చర్యలు చేపట్టామని జూపార్కు ప్రజాసంబంధాల అధికారి హెచ్ఎం హనీఫుల్లా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బట్టర్ ఫ్లైస్ పార్కులో లక్ష సీతాకోక చిలుకలు
దేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకల పార్కు ఉన్న హైదరాబాద్ జూపార్కులో రంగరంగుల రెక్కలతో కూడిన సీతాకోక చిలుకల సంఖ్య లక్షకు దాటింది. పూలపై వాలి వాటిలోని మకరందాన్ని పీల్చే సీతాకోక చిలుకల్లో 45 రకాల జాతులున్నాయి. డ్రాగన్ ఫ్లైస్, బీటిల్స్, తేనెటీగలు, చీమలు, కందిరీగలు, సీతాకోక చిలుకలు, చిమ్మటలు, ఈగలు 91 పెట్టెల్లో ఉన్నాయి. జూపార్కులో 14 ఆసియాటిక్ సింహాల ఎన్ క్లోజర్లు ఉన్నాయి. సింహాలకు టీకాలు వేసి వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. జూపార్కులోని సింహాల ఆరోగ్య పరిస్థితి బాగుందని జూపార్కు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
విదేశీ వలస పక్షుల ఏవియన్ విస్టా
జూపార్కులో విదేశాల నుంచి వలస వచ్చిన పక్షులతో ఏవియన్ విస్టా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.వివిధ రంగురంగుల పక్షులు, వివిధ జాతుల పక్షుల కిలకిలరావాలతో విభిన్న శ్రేణిలో పక్షిజాతులతో జూపార్కు కళకళ లాడుతోంది. జూపార్కులోని సింగోజీ చెరువు వివిధ పక్షుల సంతానోత్సత్తికి కేంద్రంగా నిలిచింది.కొంగలు, హెరాన్లు, ఎగ్రెట్‌లు, రెండు రకాల కింగ్‌ఫిషర్లు ఇక్కడ ఉన్నాయి. వివిధ రకాల పక్షులకు గూళ్లు నిర్మించి వాటిని పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ఐబిస్ చెరువు మారింది.
వన్యప్రాణుల ఆసుపత్రి
జూపార్కులో గర్భం దాల్చిన వన్యప్రాణులు, అనారోగ్యానికి గురైన వన్యప్రాణులకు పశువైద్యులు తమ సంరక్షణలో ఉంచుకొని చికిత్స చేస్తుంటారు. వన్యప్రాణులకు ఇచ్చే దాణా, పండ్లు, కూరగాయలు, ధాన్యం, గొడ్డు మాంసం, కోళ్లు, మటన్ ను ప్రతీరోజూ పశువైద్యులు పరీక్షించి నాణ్యత గల వాటిని వన్యప్రాణులు, జంతువులకు అందజేస్తుంటారు. అనారోగ్యానికి గురైన జంతువులను క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తుంటామని జూపార్కు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ చెప్పారు. బయటి నుంచి జూ పార్కుకు వచ్చిన జంతువులు, పక్షులు, పాములను 10 రోజుల నుంచి 30 రోజుల వరకు క్వారంటైన్ చేసి వాటి ఆరోగ్య స్థితిని పరిశీలించాకే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనుమతితో జూ ఎన్ క్లోజర్లలోకి విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
జూ పార్కుల వన్యప్రాణుల సంతానోత్పత్తి పట్టిక
భారతీయ తోడేళ్లు 5
బూడిద రంగు లంగూర్ 1
ఎలుక జింక 16
హాగ్ డీర్ 2
బ్లాక్ బక్ 3
గోల్డెన్ జాకల్ 3
చింకారా 2
ఇండియన్ బార్కింగ్ డీర్ 1
మచ్చల డీర్ 4
ఆసియా తాటి సివెట్ 1
తెల్ల పులి 3
బెంగాల్ టైగర్ 3
సారస్ క్రేన్ 2
సాంబార్ డీర్ 5
నీలగై 6
నాలుగు కొమ్ముల జింక 1
గ్రే పెలికాన్ 2
వైల్డ్ డాగ్ 3
చింకారా 2
ఇండియన్ గౌర్ 2