ప్రభుత్వానికి షాక్ కొట్టడం ఖాయమేనా ?
రైతురుణమాఫీ నేపధ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనే లక్షలమంది రైతులను బాగా ఇబ్బంది పెడుతోంది.
రుణమాఫీకి విధించిన ఒక షరతే ప్రభుత్వానికి షాక్ కొట్టేట్లుగా ఉంది. రైతురుణమాఫీ నేపధ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనే లక్షలమంది రైతులను బాగా ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ ఆ నిబంధన ఏమిటంటే రు. 2 లక్షలకు పైగా రుణమున్న రైతులు ముందు తాము చెల్లించాల్సిన అప్పును బ్యాంకులకు చెల్లించేస్తే మిగిలిన రు. 2 లక్షల అప్పును ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్న నిబంధన విధించింది. ఈ నిబంధనే ప్రభుత్వంపై రైతులను, రైతుసంఘాలను రెచ్చగొడుతోంది. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో రైతుసంఘాల ఆధ్వర్యంలో రైతులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు ఇదే సమయమని రైతులను బాగా రెచ్చగొడుతున్నాయి.
ఇపుడు సమస్య ఏమిటంటే రుణమాఫీ చేసి కూడా ప్రభుత్వానికి క్రెడిట్ దక్కటంలేదు. ప్రభుత్వం లెక్కల ప్రకారమే రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 22 లక్షలు. 22 లక్షల మందికి అయిన రుణమాఫీ సుమారు రు. 18 వేల కోట్లు. ఈ 22 లక్షలమందికి రుణమాఫీ సంపూర్ణంగా అయిపోయింది కాబట్టి వీళ్ళతో ఎలాంటి పేచీలేదు. అయితే ఇక్కడే చిన్న మెలికుంది. అదేమిటంటే రు. 2 లక్షలకు పైగా రుణాలున్న రైతుల సంఖ్య 8 లక్షలమందున్నారు. వీళ్ళకి రుణమాఫీ కాలేదు. ఎందుకంటే రైతులు చెల్లించాల్సిన 2 లక్షలకు పైగా అప్పును ముందు చెల్లించేస్తే ఆ తర్వాత ప్రభుత్వం వాటాగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. దీంతోనే రైతులు తీవ్రంగా విభేదిస్తున్నారు.
ఉదాహరణకు ఎల్లయ్య అనే రైతుకు 3 లక్షల రూపాయలు అప్పుందని అనుకుందాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్లయ్య ముందు లక్ష రూపాయలను బ్యాంకు అప్పు తీర్చేయాలి. ఎల్లయ్య లక్ష రూపాయల అప్పు తీర్చేసినట్లు బ్యాంకునుండి ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. అప్పుడు లక్ష రూపాయల అప్పుకు మ్యాచింగ్ 2 లక్షల అప్పును ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించేస్తుంది. దాంతో ఎల్లయ్య రు. 3 లక్షల అప్పు సంపూర్ణంగా మాఫీ అయిపోతుంది. ఇక్కడే సమస్య పెరిగిపోతోంది.
అదేమిటంటే బ్యాంకుకు తాము ఎంత అప్పున్నామన్నది ప్రభుత్వానికి ఎందుకంటే రైతులు మండిపోతున్నారు. తమకు 3 లక్షల రూపాయలు అప్పున్నా సరే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రు. 2 లక్షలు బ్యాంకుకు తీర్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీర్చాల్సిన రు. 2 లక్షల బ్యాంకుకు చెల్లించేస్తే మిగిలిన లక్షరూపాయలను తాము మెల్లిగా తీర్చుకుంటాము కదాని రైతులు లాజిక్ మాట్లాడుతున్నారు. రైతులు చెబుతున్నది సబబుగానే అనిపిస్తోంది. రూ. 2 లక్షలకు పైగా ఉన్న అప్పును రైతులు తీర్చుకుంటే ప్రభుత్వానికి ఏమిటి ? తీర్చకపోతే ఏమిటని రైతుసంఘాలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రూపాయలు బ్యాంకులకు చెల్లించేయాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్, బీజేపీలు ఏకమయ్యాయా ?
గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. బీఆర్ఎస్, బీజేపీలు ప్రత్యక్షంగా చేతులు కలపకపోయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న హెచ్చరికలు మాత్రం ఒకే తరహాలో ఉంటున్నాయి. ఇంతకీ రెండుపార్టీలు మాట్లాడుతున్నది దేనిగురించి అంటే రైతు రుణమాఫీ గురించే. రైతురుణమాఫీ సంపూర్ణంగా జరగకుండానే ప్రభుత్వం, పార్టీ సంబరాలు చేసుకోవటం ఏమిటంటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాల దాడులు మరోవైపు రైతులు, రైతు సంఘాల ధర్నాలు, ప్రదర్శనలతో రాజకీయ వేడి పెరిగిపోతోంది.
ఇక్కడ విషయం ఏమిటంటే రైతు రుణమాఫీ అయ్యిందా అంటే అయ్యిందనే చెప్పాలి. సంపూర్ణంగా జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రుణమాఫీ అయ్యింది 22 లక్షల మందికి మాత్రమే. అయితే రుణమాఫీ కావాల్సిన రైతుల సుమారు 8 లక్షలమందున్నారు. సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఎలాగంటే ప్రభుత్వం ఏమో రుణమాఫీకి రైతుకుటుంబాలని మొదటినుండి చెబుతోంది. ప్రతిపక్షాలేమో రుణమాఫీకి ప్రాతిపాదికగా రైతుల సంఖ్యను చెబుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు రుణమాఫీ అయ్యింది 22 లక్షల రైతుకుటుంబాలకు. ప్రతిపక్షాలేమో రుణమాఫీ అందుకోవాల్సిన రైతుల సంఖ్య 60 లక్షలంటున్నాయి. ప్రభుత్వం చెబుతున్న రైతుకుటుంబాల సంఖ్యతో అంగీకరించని ప్రతిపక్షాలు నానా గోలచేయటమే కాకుండా రైతులను, రైతుసంఘాలను బాగా రెచ్చగొడుతున్నాయి. దాంతో రైతుసంఘాల ఆధ్వర్యంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పథకం బండారాన్ని బయటపెట్టడానికి తొందరలోనే తాము గడపగడప తిరుగుతామని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో బోగస్ రుణమాఫీకి వ్యతిరేకంగా ఈనెల 23వ తేదీన రైతు దీక్ష చేయబోతున్నట్లు బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రకటించారు. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రెండు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతుసంఘాలను పై రెండుపార్టీలు బాగా రెచ్చగొడుతున్నాయి. ఎలాగూ రుణమాఫీ లబ్ది అందని రైతులు 8 లక్షలున్నారు కాబట్టి చాలా ప్రతిపక్షాల నిరసన పిలుపుకు తేలిగ్గా ఆకర్షితులవుతున్నారు. ఇదే సమయంలో కొన్ని సాంకేతిక కారణాలతో 2 లక్షల లోపు రుణాలు కూడా మాఫీకాలేదు. రుణమాఫీ లబ్ది అందని ఇలాంటి రైతులు సుమారు 6 లక్షలమందుంటారు. రుణమాఫీ నిబంధన తొందరలో జరగబోతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. రుణమాఫీ అందుకున్న రైతులు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటంలేదు. ఇదే సమయంలో రుణమాఫీ అందని రైతులు మాత్రం పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. దాంతో వ్యవహారమంతా గందరగోళంగా తయారవుతోంది. రుణమాఫీ ప్రక్రియ చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.