తెలంగాణ-ఏపీ మధ్య నలిగిపోతున్న ‘భద్రాచల’ రాముడు
తెలంగాణ-ఏపీ మధ్య వివాదం పెరుగుతున్న కొద్దీ భద్రాద్రిరాముడికి కష్టాలు కూడా పెరుగుతున్నాయి;
దక్షిణ అయోధ్యగా భక్తులు చెప్పుకునే భద్రాచలరాముడు వివాదంలో చిక్కుకుని నలిగిపోతున్నాడు. తెలంగాణ-ఏపీ మధ్య వివాదం పెరుగుతున్న కొద్దీ భద్రాద్రిరాముడికి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. భద్రాచలరాముడికి కష్టాలు 2014 సమైక్య రాష్ట్ర విభజనతో మొదలయ్యాయి. భద్రాద్రిరాముడు(Bhadrachalam Temple)కి వచ్చిన కష్టం ఏమిటంటే రాముడి దేవాలయం భద్రాచలం పట్టణంలో ఉండిపోయింది. ఆలయానికి చెందిన ఆస్తులేమో ఏపీ ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళింది. అలాగే భద్రాచలం పట్టణంలో ప్రతిరోజు పోగవుతున్న చెత్తను ఎక్కడ డంబ్ చేయాలో అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే భద్రాచలం పట్టణం చుట్టూవున్న నాలుగు రెవిన్యు గ్రామాలతో పాటు ఒక పంచాయితి ఏపీ ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోవటంతో పట్టణంలో సేకరిస్తున్న చెత్తను ఎక్కడవేయాలో అర్ధంకావటంలేదు. ఏపీ పరిధిలోకి వెళ్ళిన గ్రామపంచాయితీల్లో వేయటానికి ప్రయత్నిస్తే అందుకు ఏపీ ప్రభుత్వం అధికారులు అభ్యంతరం చెప్పారు. దాంతో చెత్తను డంబ్ చేయటానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో అధికారులు చెత్తను గోదావరి నదితీరంలోనే డంబ్ చేసేస్తున్నారు.
ఇలాంటి సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య చాలానే ఉన్నాయి. 2014 విభజన సమయంలో భౌగోళికంగా క్షేత్రస్ధాయి పరిస్ధితులు, సమస్యలు తెలియని పెద్దలు గుడ్డిగా మ్యాపు దగ్గరపెట్టుకుని ఢిల్లీలో కూర్చుని ఏకపక్షంగా విభజన చేసేయటంతో రెండు రాష్ట్రాలమధ్య వివాదాలు అంతకంతుకు పెరిగిపోతున్నాయి. ఈసమస్యగురించి పూర్తిగాతెలియాలంటే 11 ఏళ్ళు వెనక్కువెళ్ళాల్సిందే. 2014లో సమైక్య ఆంధ్ర విభజన జరిగిన విషయం తెలిసిందే. విభజనలో భాగంగా ఏపీలోని పోలవరం ప్రాజెక్టును అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మించాలంటే తెలంగాణ(Telangana) భూభాగంలోని కొంతప్రాంతం ముంపుకు గురవుతుంది. అందుకని అప్పట్లోనే తెలంగాణలోని ఏడు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వీఆర్ పురం, భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని కొంతభాగాన్ని ఏపీలో కలుపుతు నిర్ణయం తీసుకున్నారు.
విభజన అయిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్(KCR), ఏపీలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అధికారంలోకి వచ్చారు. ఆసమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ఇచ్చిన సలహాతో చంద్రబాబు ఐదురెవిన్యు గ్రామాలు పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తమపట్నంతో పాటు గ్రామపంచాయితి గుండాలను ఏపీలో కలపాలని పట్టుబట్టారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే పై పంచాయితీలు ముంపుకు గురవుతాయని చెప్పారు. ప్రాజెక్టు ఏపీలోను, ముంపు ప్రాంతం తెలంగాణలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని చంద్రబాబు అనుకున్నరు. అందుకనే పైనచెప్పిన ఐదుగ్రామాలను ఏపీలో కలపాలని పట్టుబట్టారు. దాంతో కేంద్రప్రభుత్వం చంద్రబాబు అడిగినట్లుగా ఐదుగ్రామాలను ఏపీలో కలిపేసింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ విజ్ఞప్తి, ఒత్తిడి మేరకు భద్రాచలం పట్టణాన్ని ఏపీ నుండి తిరిగి తెలంగాణలో కలుపుతు కేంద్రూప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీచేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం పట్టణం తిరిగి వచ్చేయటంతో ఆలయం కూడా తెలంగాణకు వచ్చేసింది.
అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఎలాగంటే ఇపుడు భద్రాచలం పట్టణంలో ఉన్న భద్రాద్రిరాముడి ఆస్తులన్నీ ఏపీలో కలిసిపోయిన పురుషోత్తమపట్నం గ్రామంలో ఉండిపోయాయి. పురుషోత్తమపట్నంలో దేవాలయానికి చెందిన భూములు సుమారు 900 ఎకరాలున్నాయి. దీనివల్ల ఏమైందంటే దేవాలయాన్ని అభివృద్ధిచేయాలంటే టెంపుల్ కు ఆస్తులు లేకుండా పోయాయి. దేవాలయం ఉన్న భద్రాచలంకు పురుషోత్తమపట్నం ఆనుకునే ఉంటుంది. భద్రాచలం పట్టణానికి ఆనుకునే ఉన్నప్పటికీ పురుషోత్తమపట్నం గ్రామంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేకుండాపోవటంతో ఏమీచేయలేకపోతున్నారు. చుట్టూ విశాలమైన సముద్రం ఉన్నా తాగటానికి గుక్కెడు నీళ్ళు కరువే అన్నట్లుగా తయరైంది భద్రాద్రిరాముడి పరిస్ధితి.
భూముల విషయన్ని పక్కనపెట్టేస్తే రాముడి(Lord శ్రీ Rama) దర్శనంకోసం ప్రతిరోజు వేలాదిమంది భక్తులు భద్రాచలం వస్తుంటారు. పట్టణంలో ఉన్న సుమారు లక్షమంది ప్రజలకు బయటనుండి వచ్చే భక్తులు తోడవ్వటంతో టన్నుల కొద్ది చెత్త ప్రతిరోజు పేరుకుపోతోంది. టన్నుల కొద్ది చెత్తను ఎక్కడ డంబ్ చేయాలో భద్రాచలం పట్టణ అధికారులకు అర్ధంకావటంలేదు. పురుషోత్తమపట్నంలో ఒకసారి చెత్తను డంబ్ చేయగానే ఏపీ అధికారుల నుండి తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు వచ్చాయి. దాంతో అప్పటినుండి చెత్తను డంబ్ చేసేదారిలేక అధికారులు అవస్తలు పడుతున్నారు. అలాగని చెత్తను ఎక్కడిది అక్కడే వదిలేయలేరు. అందుకని వేరేదారిలేక సేకరిస్తున్న చెత్తను అధికారులు గోదావరి నదితీరంలో తాత్కాలికంగా డంబ్ చేస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతమంతా దుర్గందంతో ముక్కలు అదిరిపోతుంటాయి. భారీ వర్షమో లేకపోతే వరదో వస్తే చెత్తంతా మళ్ళీ భద్రాచలం పట్టణంలోకి వచ్చేస్తోంది.
ఈవిషయాన్ని కూడా పక్కనపెట్టేస్తే భద్రాచలం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. పురాణాల ప్రకారం వనవాసం సమయంలో సీతా, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు పర్ణశాల ప్రాంతంలో కొంతకాలం విడిదిచేశారు. ప్రతిరోజు స్నానంచేసిన తర్వత సీతమ్మవారు చీరను పర్ణశాలలో ఆరేసుకునేవారట. అలాగే సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. సీతను ఆకాశమార్గాన తీసుకుని వెళుతున్నపుడు జటాయువు అడ్డుకునే ప్రయత్నంచేసింది. అప్పుడు జటాయువు రెక్కలను రావణుడు తెగనరికేశాడు. అప్పుడు తెగి రెక్కలు పర్ణశాలలోనే పడినట్లుగా స్ధలపురాణం చెబుతోంది. అందుకనే భద్రాచలం రాముడిని దర్శించుకున్న భక్తులు పర్ణశాలకు కూడా వెళతారు.
ఇపుడు సమస్య ఏమిటంటే భద్రాచలం-పర్ణశాల మధ్య ఉన్న 10 కిలోమీటర్ల రోడ్డు ఏపీ పరిధిలోకి ఉంది. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. అలాగే పదికిలోమీటర్ల పరిధిలో ఉండే ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాలు మళ్ళీ ఏపీలోకి వెళిపోయాయి. దీనివల్ల రోడ్డును అభివృద్ధిచేయాలంటే తెలంగాణకు కష్టంగా ఉంది. పోనీ రోడ్డును ఏపీ ప్రభుత్వం వేస్తుందా అంటే వేయటంలేదు. ఎందుకంటే రోడ్డు భౌగోళికంగా తెలంగాణలోనే ఉంటుందన్న కారణంతో ఏపీ ప్రభుత్వం పట్టించుకోవటంలేదు.
అన్నీ ఆక్రమణలేనా ?
పురుషోత్తమపట్నం గ్రామంలో భద్రాద్రిరాముడికి ఉన్న సుమారు 900 ఎకరాల్లో అత్యధికం ఆక్రమణలకు గురయ్యాయి. ఈఆక్రమణలు ఇప్పుడు మొదలైనవి కావు. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే భూములమ్మితే కాని డబ్బులు రావు. డబ్బులుంటే కాని భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి అవకాశంలేదు. ఆలయం అభివృద్ధికి అప్పట్లో కేసీఆర్ చాలా హామీలిచ్చారు కాని పెద్దగా వర్కవుట్ కాలేదు. ఒకవైపు భూములు కబ్జాకు గురవుతున్నా నిరోధించలేని స్ధితిలో దేవాలయం అధికారులున్నారు. అలాగే భౌగోళికంగా దేవాలయం భూములు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయన్న సాకుతో ఏపీ అధికారుల పట్టించుకోవటంలేదు. దేవాలయంకు అనుబంధంగా అధికారులు నిర్మించాలని అనుకున్న గోకులధామం (గోశాల), అన్నదాన సత్రం, పుష్పవనం, తులసివనం, పండ్లతోటలు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైపోయాయి. ఎందుకంటే డెవలప్ చేయాలంటే స్ధలం లేదు, సరిపడా నిదులూ లేవు.
అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం : తుమ్మల
విభజన చట్టంతో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా(Amit Shah) కు ఉమ్మడి ఖమ్మంజిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) విజ్ఞప్తిచేశారు. ఏపీలో విలీనమైన ఐదుగ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న సుదీర్ఘ డిమాండును మంత్రి అమిత్ షా కు గుర్తుచేశారు. ఏపీ పరిధిలోకి వెళ్ళిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తేకాని భద్రాద్రిరాముడి దేవాలయం అభివృద్ధి సాధ్యకాదని అమిత్ షాకు తుమ్మల వివరించారు. విభజన చట్టాన్ని అమలుచేయాల్సింది కేంద్ర హోంశాఖ కాబట్టే అమిత్ షా ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తుమ్మల తెలంగాణ ఫెడరల్ కు వివరించారు. ఇదే వినతిని చంద్రబాబుకు కూడా ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
Telangana: Union Home Minister @AmitShah inaugurates the National Turmeric Board Headquarters in Nizamabad#NationalTurmericBoard | @HMOIndia pic.twitter.com/htUFmKcQvG
— All India Radio News (@airnewsalerts) June 29, 2025
కేంద్రపాలిత ప్రాంతంచేయాలి : బూసిరెడ్డి
పోలవరం ముంపుప్రాంతం మొత్తాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి వ్యవస్ధాపక ఛైర్మన్ బూసిరెడ్డి శంకరరెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నా కేసీఆర్ భద్రాచలం ప్రాంతానికి చేసింది ఏమీలేదని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోకి వెళ్ళిపోయిన ఐదుగ్రామాలను తిరిగి తెలంగాణ పరిధిలోకి తీసుకుని వస్తేకాని భద్రాచలం దేవాలయంతో పాటు పట్టణం అభివృద్ధిజరగదని బూసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే విభజనచట్టం ఆధారంగా ఏపీలో కలిపిన ఏడుమండలాలను కూడా తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంతం మొత్తాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి టూరిజం స్టాప్ గా తీర్చిదిద్దాలని కోరారు. ముంపుప్రాంతం మొత్తాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధిచేస్తే దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్ గా డెవలప్ అవుతుందని చెప్పారు.
రాజకీయ వివాదంగా మారిపోయిందా ?
ఏపీలో కలిపిన ఐదుగ్రామాల అంశం రాజకీయ వివాదంగా మారిపోయింది. అధికారంలో ఉన్నంతకాలం ఏపీకి ఇచ్చేసిన ఐదుగ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన గట్టి ప్రయత్నం ఏమీలేదు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంతకాలానికి కల్వకుంట్ల కవిత దృష్టి ఐదుగ్రామాల మీదపడింది. ఐదుగ్రామాలను తిరిగి తెలంగాణ పరిధిలోకి తీసుకురావాలని కవిత చేస్తున్న డిమాండులో నూరుశాతం రాజకీయమే కనబడుతోంది. రాజకీయం కాకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇదేడిమాండును కవిత(Kavitha) ఎందుకు వినిపించలేదు ? అని భద్రాచలం జనాలు అడుగుతున్నారు. తమ గ్రామాలను తిరిగి తెలంగాణ పరిధిలో చేర్చాలని గతంలో పై ఐదుగ్రామల సర్పంచులు, పంచాయితీలు ఏకగ్రీవ తీర్మానంచేసి గవర్నర్ కు అందిచాయి. అయినా ఉపయోగం కనబడలేదు.
నిజానికి ఏపీకి ఇచ్చేసిన గ్రామాలను తిరిగి తెలంగాణ పరిధిలోకి తీసుకురావటం అంత ఈజీకాదు. దీనికి రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం జరగాలి. తీర్మానాలను కేంద్రప్రభుత్వానికి పంపాలి. తీర్మానాల ఆధారంగా కేంద్రం బిల్లుపెట్టి పార్లమెంటులో చర్చించి ఓటింగ్ నిర్వహించాలి. ఓటింగులో బిల్లు నెగ్గిన తర్వాత రాష్ట్రపతి సంతకం అవ్వాలి. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత మాత్రమే ఏపీకి వెళ్ళిపోయిన ఐదుగ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకురాగలరు. రేవంత్, చంద్రబాబు, నరేంద్రమోదీ అనుకుంటే పని చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎందుకంటే ఐదుగ్రామలు ఏపీలో ఉన్నా ఒకటే, తిరిగి తెలంగాణకు వచ్చేసిన ఒకటే. అయితే వివాదం పరిష్కారమైపోతే ఒకళ్ళమీద మరొకళ్ళు బురదచల్లుకోవటానికి పార్టీలకు ఇష్యూ ఏముంటుంది ? అందుకనే భద్రాద్రి రాముడి వివాదం 11 ఏళ్ళుగా నానుతునే ఉంది. మరి భద్రాద్రిరాముడి కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాల్సిందే.
ఐదుగ్రామాలను తెలంగాణలో కలపాలి : సంపత్
ఏపీలో కలిపిన ఐదుగ్రామాలను వెంటనే తిరిగి తెలంగాణ పరిధిలోకి తీసుకురావాలని ఐదుగ్రామల పంచాయితీల సాధన సమితి సభ్యుడు సంపత్ డిమాండ్ చేశాడు. తెలంగాణ నుండి వచ్చిన ఐదుగ్రామాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధచూపటంలేదన్నారు. ఏపీ ప్రభుత్వంలో డెవలప్ కాకపోవటంతో పాటు ఐదుగ్రామాల ప్రజలు చాలా కష్టాలుపడుతున్నట్లు చెప్పారు. భద్రాద్రిరాముడి ఆస్తులన్నీ ఏపీ పరిధిలోకి వెళ్ళిపోయిన పురుషోత్తమపట్నం గ్రామంలో ఉండటంతో దేవాయం అభివృద్ధి సాధ్యంకావటంలేదన్నారు. భూములన్నీ ఏపీ ప్రభుత్వ పరిధిలోకి వెళిపోవటంతో దేవాలయం, భద్రాచలం పట్టణం అభివృద్ధికి నోచుకోవటంలేదని సంపత్ మండిపడ్డాడు. సమస్యలన్నీ తెలిసినా పాలకులు సంవత్సరాల తరబడి పరిష్కారాన్ని చూపకుండా నాన్చుతున్నట్లు అభిప్రాయపడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయినపుడు ఐదుగ్రామాల అంశంపైన కూడా చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.