పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆఘాయిత్యం
స్పాట్ లోనే చనిపోయిన రమ్య,కొన ఊపిరితో ప్రవీణ్;
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట సోమవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆ ప్రేమికులు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. చాలా కాలంగా తమ పెద్దలను పెళ్లికి అంగీకరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రేమికులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయాన్ని గమనించి స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. రమ్య అనే యువతి స్పాట్ లోనే ప్రాణాలు విడిస్తే ప్రియుడు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు. యువతి గొంతుపై కత్తిగాట్లు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.
రామచంద్ర పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ ఈ ఘటన చోటు చేసుకుంది.
డిగ్రీ చదువుతున్న రమ్య గత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించిందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రమ్య ఆత్మ హత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. తన ప్రేయసి ఆత్మహత్యయత్నం చేసిందని ప్రవీణ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారా విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారా దర్యాప్తులో తేలాల్సి ఉంది.
యువతిపై కత్తిగాట్లు ఉండటంతో ప్రవీణ్ ఆ యువతిని చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.