హాట్ హాట్‌గా స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాలు..
ముదురుతున్న రాజయ్య, కడియం మధ్య వివాదం.
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పార్టీ ఫిరాయింపు అంశంపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కడియం శ్రీహరి రాజీమానా చేయాలని రాజయ్య సహా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై రాజయ్య ఘాటు విమర్శలు గుప్పించారు. సిగ్గు, శరణం, చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు. అంతకన్నా మరింత ఘాటైన పదజాలాన్ని కూడా వినియోగించారు. వాటికి కడియం శ్రీహరి సైతం స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చారు. తనకూ బూతులు వచ్చని, కానీ సంస్కారం అడ్డుపడటం వల్లే తిట్టడం లేదని అన్నారు. అదే విధంగా తాను ఎప్పుడూ పదవులు అడగలేదని, కేసీఆరే తనను పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని చెప్పారు. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య మరోసారి విమర్శనాస్త్రాలు సందించారు. అవినీతికి నిలువెత్తు రూపం కడియం శ్రీహరి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆస్తులపైన ఆస్తులు కొంటున్నాడు
‘‘నేను ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు అమ్ముకున్నాను. కడియం మాత్రం ఒకదాని తర్వాత ఒకటిగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు. కావాలంటే మా ఇద్దరి ఆస్తుల వివరాలు చూడండి. కడియం శ్రీహరి శుక్రవారం విడుదల చేసిన కాగితం కేవలం చిత్తు కాగితమే. అది ప్రొసీడింగ్ కాపీ కాదు. కేవలం ప్రపోజన్ మాత్రమే. కనీసం సంతకం పెట్టే దైర్యం కూడా లేని పిరికివాడు కడియం’’ అని మండిపడ్డారు. అంతేకాకుండా కడియం శ్రీహరికి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ‘‘ప్రజల అభీష్టం మేరకే కడియం శ్రీహరి పార్టీ మారినట్లయితే వెంటనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ జెండా పట్టుకుని ఉపఎన్నిక బరిలోకి దిగాలి. కాంగ్రెస్ జెండా పట్టుకుని రాష్ట్రమంతా తిరగాలి. ఆయనపై ప్రజలు పూలదండలు వేస్తారో.. చెప్పుల దండ వేస్తారో చూద్దాం. దేనికైనా కడియం సిద్ధంగా ఉండాలి’’ అని రాజయ్య సవాల్ విసిరారు.
కడియం కౌంటర్ ఏంటంటే..
స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని వివరించారు కడియం శ్రీహరి. ‘‘నియోజకవర్గ పరిధిలో రిజర్వాయర్లు ఉన్నా కాలువుల అసంపూర్తిగా ఉన్నాయి. చెట్లు, పూడిక పేరుకుపోయి అస్తవ్యస్థంగా ఉన్నాయి. దాని వల్ల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లా. కాలువల్లో పూడికలు తీసి స్లాబులు వేయాలని చెప్పాను. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాట ఇచ్చా. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించా. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అనుకున్నా. అదే చేస్తున్నా’’ అని స్పష్టతనిచ్చారు.