తెలంగాణ విద్యార్థికి చిక్కిన లక్షయేళ్ల నాటి పూర్వీకుల రాతిపనిముట్టు
తెలంగాణ ప్రాంతంలో పురాతన మానవుడు సంచరించినట్లు తెలిపే అధారాలు కనిపించాయి. అతగాడు వాడినరాతిపనిముట్టును ఔత్సాహిక చరిత్రకారులు సేకరించారు. వివరాలు
By : The Federal
Update: 2024-02-22 04:33 GMT
వికారాబాద్ జిల్లా దోమ మండలం, కొత్తపల్లి గ్రామానికి, కులకచర్ల మండలం చెల్లాపూర్ గ్రామానికి శివారు ప్రాంతంలో పురాతన మానవుడు వాడిన రాతిపనిముట్టు లభ్యమయింది. ఇక్కడి బుర్కగడ్డలో పొలాలలో దాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్ కు ఈ రాతిపనిముట్టు దొరికింది. ఆయన ఈ అందంగా మలచిన రాతిముక్కని ఎ.శాంతకుమార్, ఎం.క్రిష్ణ- ఉపాధ్యాయులు, కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులకు చూపించాడు. వాళ్లు ఇది సాధారణ రాతిపెచ్చు కాదని, మనిషిచెక్కిన రాతిపనిముట్టు అని గుర్తించారు. ఈ రాతిపనిముట్టు పొడవు 12.5 సెం.మీ., వెడల్పు 8.5సెం.మీ., మందం 3.5 సెం.మీ.లున్నాయి.
ఈ రాతిపనిముట్టు లభించిన ప్రదేశానికి ఉత్తర, దక్షిణాలలో చిన్నగుట్టలున్నాయి. దక్షిణం గుట్ట పూర్తిగా ‘పలుగు(Quartz)రాళ్ళ’తో నిండివుంది. ఉత్తరాన గ్రానైట్ రాళ్ళగుట్ట కనపడుతున్నది. పడమర లోతట్టుప్రాంతంలో నీటికుంట వుంది.
ఈ రాతిపరికరం(Stone Tool) ఫోటోలను అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారుడు రవికొరిసెట్టర్(కర్ణాటక), శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొ.తె.చ.బృందం పరిశీలించి, అది తొలి పాతరాతియుగం లేదా అషూలియన్ (Acheulean 1.76–0.13 మిలియన్ సంవత్సరాల క్రితం) రాతిపనిముట్టు రాతి గొడ్డలిగా నిర్ధారించారు.
ఫ్రాన్స్ లోని సెయింట్ అషూలీన్ నుండి వచ్చిన పేరు ఇది.,ఈ రకం పనిముట్లు మొట్టమొదటి సారిగా ఫ్రాన్స్ లోని అషూలీన్ లోకనిపించాయి. అందువల్ల ఈరకం పనిముట్లను ఒక క్యాటగరిగా గుర్తిస్తారు. అసూలియన్ టైప్ అనేది ఒక పురావస్తు రాతిపనిమట్లు పరిశ్రమ. ఇది హోమో ఎరెక్టస్‌తో అనుబంధం ఉన్న కాలం.
బుర్కగడ్డ పనిముట్టు వయసు కనీసం లక్షసంవత్సరాలకు ముందటిదేనని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు.
క్లుప్తంగా.
క్షేత్ర పరిశీలన: ఎ.శాంతకుమార్, ఎం.క్రిష్ణ, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు
విషయనిపుణులు: అంతర్జాతీయ ప్రాక్చరిత్రకారులు రవి కొరిసెట్టర్, కర్ణాటక
శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం