‘నా కోపానికి బలవుతారు’

సంచలనంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి;

Update: 2025-07-14 06:42 GMT

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాల తర్వాత జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అందులో పలు కీలక అంశాలను ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏడాది తన కోరికను తీర్చడం లేదని, తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఏడాది అందరూ మనస్ఫూర్తిగా పూజలు చేశారని, భక్తులు అందించిన బోనాలను ఆనందంగా స్వీకరించానని వెల్లడించారు. తాను ఎవరిపైనా కోపంగా లేనని కూడా పేర్కొన్నారు. అమ్మవారి ఎదురుగా వచ్చి కుండపై నిల్చుని స్వర్ణలత చెప్పిన భవిష్యవాణి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

నేను కోపం చూపించట్లేదు..

నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతీ ఏడాది ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు. ప్రతీ సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదు. ఏడాదికి ఏడాది నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదు. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చస్తరు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయి.. కాలం తీరిందంటే ఎవ్వరు ఏది అనుభవించాలో అది తప్పక అనుభవిస్తారు. నేను దానికి అడ్డురాను. వేల రాసులు నేను రప్పించుకుంటున్న... నాకు రక్తం బలి ఇవ్వడం లేదు.. మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. ఈ ఏడాది జరిపించకపోతే.. ఎవరెవరు అడ్డుపడుతారో వారిని రక్తం కక్కేలా చేస్తా. అందుకు నన్ను నిందించొద్దు. నన్ను కొలిచే వారు తప్పనిసరిగా విధివిధానంగా పూజలు జరిపించండి’ అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అయితే తల్లీ కోపం వద్దని.. సక్రమంగా పూజలు చేస్తామని ఆలయ పూజారులు అమ్మవారికి వాగ్దానం చేశారు.

Tags:    

Similar News