సీఎం రేవంత్‌పై విరుచుకుపడిన నటి.. ఇవేం గలీజు పనులంటూ..

తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై మాధవీలత ఘాటుగా స్పందించారు.

Update: 2024-12-27 09:26 GMT

తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ అంతా కూడా ఏపీకి షిఫ్ట్ అయిపోవాలన్న ఆలోచేనలో ఉందన్న క్రమంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించడం ఆసక్తికరంగా మారింది. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్‌ ఘటన జరిగినప్పటి నుంచి ఇండస్ట్రీపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ సమయంలోనే బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తాను సీఎం కుర్చీలో ఉండగా బెనిఫిట్ షోలకు అనుమతించమని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి సీఎంతో భేటీ అయ్యారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. సంక్రాంతి దగ్గర పడుతున్న క్రమంలో సీఎం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ మొత్తాన్ని కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ ఘటనపై తాజాగా నటి, బీజేపీ నేత మాధవీలత ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవేం గలీజు పనులంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సంధ్య థియేటర్ ఘటనలో తామంతా అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పకనే చెప్తున్నారు. అసలు బన్నీ ఏం నేరం చేశారని అన్నారు. ఆయన చేసింది నేరం కాదని, పొరపాటు మాత్రమేనని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియలో ఒక పోస్ట్ పెట్టారు.

‘‘రేవంత్ రెడ్డి సార్‌ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదామనుంకుటున్నా.. ఇప్పటికే చాలా మంది ప్రశ్నించారు. కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను అడగటం లేట్ అయింది. నిన్న మెదక్‌లో ఓ చిన్నారిపై అత్యాచారం జరిగింది. దాని గురించి సీఎం అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారా? అక్బరుద్దీన్, ఓవైసీ ఎవరైనా ప్రశ్నిస్తారా? పసిసిల్ల ప్రాణం, పాపం, అయ్యో, అబ్బాస్ తప్పు చేశాడు, శిక్షించండి అని ఎవరైనా ప్రశ్నిస్తారా? దీనిపై ఏమంటారు రేవంత్ సారూ అని అడుగుతారా? అదేలా కొడంగల్‌లో ఒక రైతు సీఎం రేడ్డి కుటుంబీకుల వల్లే అని లెటర్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చారా..? రూ.25 వేలు అయినా ఇచ్చారా? ఆయనెవరో కోమటిరెడ్డి అంటే ఆయన ఆ రైతు ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏమైనా ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. అనంతరం అల్లు అర్జున్ అంశంపై స్పందించారు.

‘‘అల్లు అర్జున్ చేసింది నేరం కాదు. ఆయనకు తెలియకుండా జరిగింది. కాకపోతే దానిపై సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది. అందరిలాగా ఆయన కూడా సామాన్యుడే. మీకు ఎలాంటి విధులు, హక్కులు ఉంటాయో.. అవి ఆయనకీ వర్తిస్తాయి. జరిగిన తప్పుకు సినిమా ఇండస్ట్రీపై ఉక్కు పాదం మోపాలని, మీ కాళ్ల కింద పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో జగన్ ఎలా అయితే అందరినీ రప్పించి దండాలు పెట్టుకున్నారో.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత మీరు కుడా అలా చేయించుకోవాలనే ఇలా చేస్తున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రయాణాన్ని ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం చాలా బాగుంది. ఎంతో కష్టపడి ఆయన ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు. జీవితంలో చాలా సాధించారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత గలీజుగా ప్రవర్తిస్తున్నారు? ఓ స్థాయికి వచ్చిన తర్వాత ఇలా ప్రవర్తించడం దేనికి. గురుకులాల్లో ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. అందరి విషయాల్లో సమానంగా స్పందించండి. బాధితుల విషయాల్లో నేరుగా స్పందించకుండా.. దిల్ రాజును అడ్డుపెట్టుకుని సినిమా వాళ్లపై అజమాయిషీ చెలాయించాలని చూస్తున్నారు. ఏం చేస్తాం.. మా సినిమా వాళ్ల బతుకులు అలాంటివి. వచ్చి మీ కాళ్లు మొక్కుతారు’’ అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు.

 

Tags:    

Similar News