మాదిగల చరిత్ర ఘనం, అభివృద్ధిలో అధమం

అన్ని విధాలుగా వెనుకబడిన మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం రణం చేసి సాధించుకున్నారు. ఏపీ అసెంబ్లీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;

Update: 2025-03-21 12:12 GMT
మాదిగల చరిత్ర
ఈ భూమిపై మొట్టమొదటి కళాకారుడు మాదిగ. ఆది మానవులుగా మనుషులు జంతువులను చంపి మాంసం తినే రోజుల్లో జంతువుల చర్మాన్ని తీసి దానిని ఉపయోగించిన మొదటి వ్యక్తి. ఈ మాదిగ జాతిని మదిగ, ఆది జాంభవా, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు అనే పేర్లూ ఉన్నాయి. నిచ్చెనమెట్ల సమాజంలో వీరు దళితులుగా మిగిలారు. తెలంగాణ రాష్ట్రంలోని కొలనుపాకలో 2000 ఏళ్లకు పూర్వం నుంచే జాంభవ మఠం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జాంభవ పురాణం ప్రకారం మాదిగలు మొదటి వారు, మొదటి రాజులు.

మాదిగ కులస్తులకు సంబంధించి అనేక పురాణాలు ఉన్నాయి. కొన్ని పురాణ గాధల ప్రకారం, మాదిగ కులం వృత్తుల ఆధారంగా అభివృద్ధి చెందింది. హిందూ వర్ణాశ్రమ ధర్మంలో వీరు శూద్రుల్లోని అట్టడుగు వర్గంగా, అవర్ణుల కిందకు చేర్చారు. “మాదిగ” అనే పేరు వెనుక ప్రత్యేక ఆచారాలు, ఇతిహాసాలు ఉన్నాయి.
19, 20వ శతాబ్దాల్లో మాదిగ కులానికి చెందిన వ్యక్తులు తమ హక్కులు, సామాజిక సమానత్వం కోసం ఉద్యమాలు చేపట్టారు. మాదిగ మహాజన సంఘం వంటి సంస్థలు సామాజిక మార్పు కోసం ప్రయత్నించాయి. దళిత సమాజంలో ఓ పెద్ద శాతంగా ఉన్నారు. మాదిగ కులానికి అనుబంధ ఉప కులాలు ఉన్నాయి. ఇవి సామాజిక, ఆర్థిక విభిన్నతలను ప్రతిబింబిస్తాయి. మాదిగలోని ముఖ్యమైన ఉపకులాలు ఓడ, రెడ్డి మాదిగ, రెల్లి, ముత్రాశి మాదిగ, డక్కలి వంటివనేకం ఉన్నాయి.
మాదిగ కులం ఎలా ఏర్పడిందో అర్థం చేసుకోవడం కేవలం చారిత్రక పరమైన అంశమే కాదుషయం మాత్రమే కాదు, సామాజిక న్యాయం, అవగాహన వంటి అంశాలతో కూడా ముడిపడి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల మధ్య అనేక అసమానతలున్నాయి. విద్య, ఉద్యోగాలు, సామాజిక స్థాయి, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందడం ఇలా ప్రతి విషయంలోనూ మాల, ఉపకులాల ఆధిపత్యం కొనసాగుతోంది. మాదిగ, ఉపకులాలు కొన్ని తరాలుగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందడంలో వెనుకబడి ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వరకు నియమించిన కమిషన్లన్నీ వర్గీకరణ ఎందుకు అవసరమో వివరిస్తూ దానికి అనుకూలంగానే నివేదికలు ఇచ్చాయి. దళితులంతా సజాతీయులు కాదనడానికి చారిత్రక ఆధారాలున్నాయంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది ఆగస్టులో తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ కూడా ఎస్సీల వర్గీకరణ ఎందుకు అవసరమో వివరించింది.
మిశ్ర కమిషన్‌ నివేదికలో ఏం నిగ్గు తేల్చిందంటే..
మొత్తం 59 ఎస్సీ కులాల్లో అన్ని రంగాల్లో మాలల ఆధిపత్యం కొనసాగుతోంది. 2023-24 డేటా ప్రకారం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో (హెచ్‌ఓడీల్లో) పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల్లో మాలలు 32,914 మంది ఉంటే, మాదిగలు 17,574 మందే ఉన్నారు. ఉద్యోగావకాశాల్లో మాలలతో పోలిస్తే మాదిగలు ఎంతగా వెనుకబడి ఉన్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఇతర ఎస్సీ కులాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ కులాల ఉద్యోగులు 2,442 మందే ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత గడిచిన పదేళ్లలో ఎనిమిది ఎస్సీ కులాలకు ఇంత వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రాకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.
ప్రాథమిక పాఠశాల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యాపరంగా మాల మాదిగల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇంటర్మీడియట్, ఐటీఐతోపాటు ఇంజినీరింగ్, పీజీ వంటి ఉన్నత విద్యా కోర్సులకు వచ్చేసరికి మాదిగలు బాగా వెనుకబడ్డారు. పీజీ చదువుతున్న ఎస్సీల్లో మాలలు 59 శాతం కాగా మాదిగలు 38 శాతమే. ఉపకారవేతనాలు పొందుతున్న ఎస్సీ విద్యార్థుల్లో మాలలు 54% ఉంటే, మాదిగలు 43 శాతమే.
59 ఎస్సీ కులాల్లో 25 కులాలకు రాజకీయ పదవుల్లో ఎక్కడా ప్రాతినిధ్యమే లేదు. మాల, అనుబంధ కులాలకు అత్యధిక పదవులు దక్కుతున్నాయి. ఎస్సీల్లో రెండో అతి పెద్ద సామాజికవర్గమైన మాదిగలకు జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేదు. ఉన్నతస్థాయి పదవుల్లో ఈ అంతరం మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
రాష్ట్రంలో 2019-24 మధ్య మాలల నుంచి 21 మంది ఎమ్మెల్యేలుంటే, మాదిగ వర్గం నుంచి 8 మందే ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఈ అంతరం తగ్గింది. 15 మంది మాలలు, 14 మంది మాదిగలు శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆహారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, వివాహ సంబంధాలు, సంప్రదాయ వృత్తులు, భాషలు, వారు నివసించే ప్రాంతాలు, కుల పంచాయితీలు, చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఎస్సీ కులాల వారంతా సజాతీయులు కాదని జె.హెచ్‌.హట్టన్‌ (1946), కె.ఎస్‌.సింగ్‌ (1992), ఇ.థరస్టన్‌ (1909) వంటి ప్రముఖుల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆదిద్రవిడులు మాలల నుంచి నీరు, ఆహారం స్వీకరిస్తారు గానీ, మాదిగల నుంచి తీసుకోరని, చలవాది కులానికి చెందినవారు మాదిగల కంటే తమది ఉన్నత జాతిగా భావిస్తారని, మాదిగల నుంచి తప్ప ఇతర కులాల నుంచి ఆహారం స్వీకరిస్తారని గత అధ్యయనాలు చెప్పాయి. అరుంధతీయులు మాదిగల నుంచి ఆహారం స్వీకరిస్తారు గానీ, మాలల నుంచి తీసుకోరు. పాకీ కులస్థులు మాదిగల నుంచి ఆహారం, నీరు తీసుకోరు. ఇలాంటివి చాలా ఉదాహరణలున్నాయి.
ఉషా మెహ్రా కమిషన్ ఏమి చెప్పిందంటే
ఎస్సీల్లోని అన్ని కులాలవారికీ రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందాలంటే వర్గీకరణ తప్పనిసరని 2007లో ఏర్పాటైన జస్టిస్‌ ఉషామెహ్రా కమిషన్‌ కూడా అభిప్రాయపడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ షెడ్యూల్డ్‌ కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయని, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లలో మాలలు, అనుబంధ కులాలు ఎక్కువ లబ్ధి, రాయితీలు పొందుతున్నాయని స్పష్టంగా పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లలోనే కాకుండా.. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి పోస్టులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి పదవుల్లోనూ ఎక్కువ ప్రయోజనం కొన్ని వర్గాలే పొందుతున్నాయని, ఆయా కులాలకు సమాన అవకాశాలు లభించాలంటే వర్గీకరణ అవసరమని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాలకు పెద్ద సంఖ్యలో ఆర్థికంగా, సంస్థాగతంగా సహకారం అందిస్తున్నప్పటికీ కొన్ని కులాలు అభివృద్ధికి ఆవలే నిలిచిపోతున్నాయని తెలిపింది.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి బాగా వెనుకబడిన ఎస్సీ కులాల పరిస్థితి... 2000 సంవత్సరంలో వర్గీకరణ అమల్లోకి తెచ్చాక ఎలా మెరుగైందో గణాంకాలతో వివరించింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ విధుల నిర్వహణలో భాగంగానే షెడ్యూల్డ్‌ కులాలను ఎ, బి, సి, డి, గ్రూప్‌లుగా చేసిందని తెలిపింది.
అంతకు ముందు 1997లో జస్టిస్‌ పి.రామచంద్రరాజు కమిషన్‌ ఇచ్చిన నివేదికలో కూడా.. రాష్ట్రంలో మాల, ఆదిఆంధ్ర కులాలతో పోలిస్తే మాదిగ, రెల్లి కులాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయని తెలిపింది.
మాదిగ కులం చారిత్రక పరంగా అట్టడుగుస్థాయిలోకి చేరింది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావం వల్ల మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణకు పోరుబాట పట్టిన మొదటి వ్యక్తిగా మంద కృష్ణను పరిగణిస్తుంటారు. 30 ఏళ్లకు పైబడి ఆయన ఈ పోరాటం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణ బిల్లులు పాసయ్యాయి. కేంద్రం నుంచి గజిట్ నోటిఫికేషన్ వస్తే వీటికి చట్టబద్ధత వస్తుంది.
Tags:    

Similar News