సంతోషంగా రంగం భవిష్యవాణి... మాతంగి ఏం చెప్పిందంటే?
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆషాఢమాసం బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆషాఢమాసం బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రెండవ రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరువాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పూజారి అడిగిన ప్రశ్నలకి మాతంగి సమాధానం చెప్పారు.
ప్రశ్నలకు అమ్మవారి సమాధానం...
పూజారి : 250 ఏళ్లుగా లష్కర్ కు వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నావ్. ఈ ఏడాది 16 రోజులుగా జాతర జరిపించుకున్నావ్. నీ ఆశీర్వాదం తెలుపు?
మాతంగి: ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచిన నిండుగా నిలిచిన మహంకాళి నేను.
పూజారి: బోనాలు నీ పూజలో ప్రత్యేకం. బోనాలు ఎవరు, ఎలా జరిపించాలి?.
మాతంగి: ఏ బోనం అయినా, ఎవరు ఎత్తుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్ళు, వాళ్ళు తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునే బాధ్యత నాది.
పూజారి: వర్షాలు ఎలా కురుస్తాయి? పాడి పంటలను ఎలా ఆశీర్వదిస్తావు? వ్యాధులు లేకుండా ఎలా చూస్తావ్?
మాతంగి: కోరినంత వర్షాలు వుంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా.
పూజారి: కోట్ల మంది ప్రజలు నీ దర్శనం చేసుకున్నారు. 48 గంటలు వర్షంలో తడిచి దర్శనం చేసుకున్నారు. నీ తృప్తిని తెలియజేయి.
మాతంగి: నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను.
పూజారి: ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అమ్మ. నువ్వు ఏమి కోరుకుంటున్నావ్?
మాతంగి: నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా.. పెట్టండి, ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను పెట్టించుకుంటాను, తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.
పూజారి: ఇది నీ ఆశీర్వాదం కాదు. ఆజ్ఞగా భావించి ఆ కార్యక్రమంలో ఉంటాం. నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తాం.
మాతంగి: నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి బెల్లం సాక పెడుతున్నారు. ఈ సారి కూడా 5 వారాలు పప్పు బెల్లాలతో సాక పెట్టండి.
పూజారి: ప్రజలు వ్యాధులు, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారికి ని చల్లని చూపుకావాలి.
మాతంగి: చదువుని ఏటికేడు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ.. పాడి పంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. ఔషధాలు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి.
పూజారి: బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ.
మాతంగి: రక్త పాశం ఇవ్వడం లేదు, మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోషపడుతున్నాను.
పూజారి: భక్తులను ఆదరించి, ఆశీర్వదించు తల్లి.
జవాబు: సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను.