‘తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వండి’
సంక్షేమ పథకాలు అమలు చేసే అంశంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హౌసింగ్ మంత్ర మనోహర్ లాల్ ఖట్టర్‌కు తెలంగాణ మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు.;
సంక్షేమ పథకాలు అమలు చేసే అంశంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హౌసింగ్ మంత్ర మనోహర్ లాల్ ఖట్టర్‌కు తెలంగాణ మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. పలు పథకాల విషయంలో తెలంగాణకు కావాల్సిన వాటా దక్కడం లేదని ఆయన అన్నారు. పేదలను అందించే అంశంలో తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, రాష్ట్ర జనాభాకు అనుగుణంగా తెలంగాణకు ప్రాధాన్య ఇవ్వాలని ఆయన కోరారు. ‘‘తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడిచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలి’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. తెలంగాణకు ఒకరోజు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలంగాణ మంత్రి పొంగులేటి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగులేటి హౌసింగ్‌కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ''గత ప్రభుత్వం గృహనిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగులను ఇతర శాఖలలో సర్ధుబాటు చేసింది. ఈ పరిస్ధితులలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది’’ అని వివరించారు.
‘‘సర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇల్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షల వరకు ఉన్నారు. లబ్దిదారుల అర్హత, జియో ట్యాగింగ్, వారి ప్రస్తుత నివాసం వంటి విషయాలను డాక్యుమెంటేషన్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాం. దీనితో ఇంటింటి సర్వే నిర్వహించాం. 360 డిగ్రీ టూల్‌తో డెస్క్ వెరిఫికేషన్ జరిగింది. తుది జాబితాల రూపకల్పన కోసం గ్రామ సభలు నిర్వహించాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుంది. 26 జిల్లాల్లోని 6867 గ్రామాలను ఇటీవల యూడిఎ కిందికి తీసుకు రావడం జరిగింది. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో చేర్చాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేజ్ -1 ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరుకాగా తెలంగాణకు 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతం. భారత దేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత కలిగి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి'' అని మంత్రి పొంగులేటి కోరారు.