సీఎం కావాలనుకోవడం బుద్ధి తక్కువ పనా.. పోంగులేటి మనసులో మాట

విలేకరులతో చిట్‌చాట్ చేసిన మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావాలనుకుంటున్నాంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-03-21 14:23 GMT
Source: Twitter

లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులపై కూడా సంచలన వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం కావాలని మంత్రి పొంగులేటి యోచిస్తున్నారన్న వార్తలు కూడా వీటిలోనివే. తాజాగా ఈ వార్తలపై మంత్రి పొంగులేటి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దాంతో పాటుగా తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పొంగులేటి ఈ అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. పార్టీలో నెంబర్ 2 మీరేనా అన్న ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు.

పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు
చిట్‌చాట్‌లో భాగంగా తనపై వస్తున్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని ఒక సామెత ఉంది. ఇది కూడా అంతే. నా దగ్గర పండ్లు ఉన్నాయి. అందుకే నన్ను టార్గెట్ చేసి రాళ్లు(విమర్శలు, ఆరోపణలు) విసురుతున్నారు. రాళ్ల దెబ్బలకు ఏ చెట్టూ కూలదు. నేను, మా ప్రభుత్వం కూడా అంతే’’అని అన్నారు. అనంతరం తాను సీఎం కావాలనుకుంటున్న వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అలా అనుకుంటే బుద్ధి తక్కువ పనే అవుతుందని చెప్పారు. ‘‘పార్టీలో నేను చాలా జూనియర్‌ని. నేను సీఎం కావాలంటే హైకమాండ్ కూడా కొన్ని సమీకరణాలను చూస్తుంది కదా. నాకు సీఎం అవ్వాలన్న ఆలోచన కూడా లేదు. ఇక నేనే నెంబర్ 2 అన్న విషయానికొస్తే.. ఎప్పుడూ సీఎం రేవంత్ వెంట తిరుగుతున్న నేను నెంబర్ 2 ఎలా అవుతాను’’అని బదులిచ్చారు.
మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు
‘‘మా ప్రభుత్వానికి తన నేతలపై సంపూర్ణ నమ్మకం ఉంటుంది. మేము ఎవరిమీ బీజేపీలో ఎవరితో టచ్‌లోకి వెళ్లలేదు. అదంతా ఉత్తుత్తి ప్రచారమే. మా ప్రభుత్వం ఎవరి ఫోన్‌ను ట్యాప్ చేయదు. ఇక బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలుగా కేసులు పెడుతున్నాం అన్నది కూడా అవాస్తవాలే. వారిపై నమోదైన కేసులన్నీ కూడా వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులే అని తేలిపోతున్నాయి. కొందరు ఎండిపోయిన జలాశయాలు, పొలాల ఫొటోలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ నెలలో. అలాంటప్పుడు రానున్న ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్లను నిల్వ చేయాల్సిన బాధ్యత గత ప్రభుత్వానిది కాదా? వాళ్లు తమ బాధ్యతలను మరిచి ఇప్పుడు మాపై రాళ్లేయడం తగదు. కాళేశ్వరం వల్ల ఎవరు లబ్ధి పొందారో అందరికీ తెలుసు’’ అని విమర్శలకు చెక్ పెట్టారు.
బీఆర్ఎస్‌కు రెండు సీట్లు కూడా డౌటే
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా డబుల్ డిజిట్ సాధిస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు ఓటేస్తారన్న నమ్మకం వాళ్లకు కూడా లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ఒకటి రెండు సీట్లు వచ్చినా అది గొప్పే అవుతుంది. మా పార్టీలోకి రండి అని మేము ఏ పార్టీ నాయకులను కోరట్లేదు. మేము గేట్లు ఎత్తలేదు. ఎత్తితే వరద ఆగదు. దాన్ని తట్టుకోలేరు. ఎన్నికల ప్రచారంలో చెప్పిందే మేము ఇప్పుడు చేస్తున్నాం. గత ప్రభుత్వం పాల్పడిన అవినీతిపైనే మా పోరాటం. వ్యక్తిగత కక్షలు మాకు లేవు. దారి తప్పిన వ్యవస్థను మళ్ళీ గాడిలో పెడుతున్నాం అంతే. చెప్పినట్టే 5 ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నాం. జీతాల విషయంలో ఆలస్యం జరగలేదని అనట్లేదు. దాని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’అని స్పష్టతనిచ్చారు.
కేంద్రంతో కొట్లాటకు వెనకాడం
తమ ప్రభుత్వం ఏం చేసినా రాష్ట్ర బాగు కోసమేనని అన్నారాయన. ధరణిలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో కొట్లాటకు కూడా వెనకాడం. గత ప్రభుత్వం మింగేసిన అవినీతి సొమ్ము మొత్తాన్ని కక్కిస్తాం. ప్రధాన మంత్రిని కలిసినంత మాత్రాన నేత పొల్యూట్ అయినట్టు కాదు. వారికి కొమ్ము కాస్తున్నట్టు కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన చేస్తాం. సమస్యలు లేని భూమాత పోర్టల్‌ను తీసుకొస్తాం’’అని ఆయన వెల్లడించారు.


Tags:    

Similar News