వర్షాలపై మంత్రి సమీక్ష.. జిల్లాకు రూ.కోటి సాయం..
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించిన మంత్రి పొంగులేటి.;
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా పడుతున్న వర్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అయితే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ బూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సాయంత్రం వరకు ఒకమోస్తరు వర్షం కురవొచ్చని, సాయంత్రం నుంచి మాత్రం వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చీఫ్ సెక్రటరీతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా పలువురు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు ఇచ్చారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ‘‘ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలి’’ అని తెలిపారు. అదే విధంగా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎస్ఆర్‌నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. వర్షాల దెబ్బకు రాజేందర్ నగర్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌ను అధికారులు మూసివేశారు. హిమాయత్ సాగర్ నీటి విడుదలతో ఆ ప్రాంతం రోడ్డుపై వరద నీరు పారుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బ్యారికేడ్లు పెట్టి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ వర్షాల దెబ్బకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.