Sridhar Babu | మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా మారింది కాబట్టే ఇన్ఫుయెన్షియల్ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించింది;
పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు(Duddilla Sridhar Babu) అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ మ్యాగిజైన్(Analytics India) ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన ‘ఇండియన్ 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ-2025’ జాబితాలో మంత్రి చోటు దక్కించుకున్నారు. సమర్ధవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలును ప్రోత్సహిస్తు ఇండియాను అగ్రగామిగా నిలబెట్టడంలో కృషిచేస్తున్న వ్యక్తుల్లో ఒకరిగా దుద్దిళ్ళను మ్యాగజైన్ గుర్తించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. విధానరూపకల్పన విభాగంలో మంత్రితో పాటు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయెల్(Piyush Goel), కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఐఏ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షుడు దేబజాని ఘోష్ తదితరులున్నారు.
మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా మారింది కాబట్టే ఇన్ఫుయెన్షియల్ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించింది. బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించటంలో మంత్రి కీలకంగా వ్యవహరించినట్లు మ్యాగజైన్ నిర్వాహకులు చెప్పారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్ ను ప్రోత్సహించేలా తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ చేంజ్ ను ప్రారంభం అయ్యేందుకు మంత్రి చొరవను మ్యాగజైన్ అభినందించింది. తెలంగాణ ఎకోసిస్టమ్ ను మరింత బలోపేతంచేసేలా 2025-26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. పరిశోధన-అభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యం ఉన్న మానవవనరులను తయారుచేయటంలో మంత్రి గట్టి సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు మ్యాగజైన్ తెలిపింది.
రేవంత్ ప్రోత్సాహం వల్లే : దుద్దిళ్ళ
మ్యాగజైన్ ప్రకటించిన గౌరవం యావత్ తెలంగాణకు దక్కినట్లుగా తాను అనుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహం వల్లే తాను సమర్ధవంతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మెరుగైన జీవితాల కోసం అందరు ఏఐని ఉపయోగించాలన్నదే తమ ప్రభుత్వ ముందుచూపుగా మంత్రి తెలిపారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిద్దిద్దేందుకు తాను కృషిచేస్తున్నట్లు చెప్పారు.