రుణమాఫీపై రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. బీఆర్ఎస్ వార్నింగ్ భయపడేనా..!

తెలంగాణలో రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వాన్ని పడగొట్టైనా వారికి న్యాయం చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Update: 2024-10-04 14:10 GMT

తెలంగాణలో రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వాన్ని పడగొట్టైనా వారికి న్యాయం చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేసిన ఘనతను మూట గట్టుకున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ సహా పలువురు ఇతర కీలక నేతలు కూడా రుణమాఫీ విషయంలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కూడా బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా రైతులకు రుణమాఫీ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు.. దసరా పండుగ వరకు డెడ్‌లైన్ కూడా పెట్టారు. అప్పటికి రుణమాఫీ పూర్తి కాకుండా పరిణామాలు వేరేలా ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు. తాజాగా కేటీఆర్ కూడా రైతు రుణమాఫీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ చేతులు మడుచుకుని కూర్చోదని, ఉద్యమం చేసైనా రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. తమ రాజకీయ మైలేజీ పెంచుకోవడం కోసం బీఆర్ఎస్.. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తోందని, ఒక్క రైతు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ఎప్పటికీ రైతులను మోసం చేయదని భరోసా కల్పించారు.

రైతులు భయపడాల్సిన పని లేదు..

‘‘బీఆర్ఎస్ ఏకాడికీ తన స్వార్థాన్నే చూసుకుంటుంది. ఇప్పుడు రైతులు, మూసీ నిర్వాసితులపై వారు చూపుతున్నదంతా కపట ప్రేమే. రాజకీయ మైలేజీ పెంచుకోవడానికే వాళ్లు ఇలా చేస్తున్నారు. రైతు రుణమాఫీ అంటూ రోజూ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. వారి మాటలు విని రైతులు ఎవరూ భయపడకండి. వాళ్లు అధికారంలో ఉండగా అదిగో ఇదిగో రుణమాఫీ అంటూ వందల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనా వాళ్లు ఇప్పుడు రైతుల సంక్షేమం అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రైతన్నల ఆదరణతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వారిని ఈ ప్రభుత్వం ఎప్పటికీ మోసం చేయదు. కష్టమైనా సరే ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఒక పథకాన్ని ఆపైనా రైతులకు రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా, రైతు బీమాను అందిస్తాం. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తాం. ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం వల్లే ఇప్పుడు పథకాల అమల్లో జాప్యానికి కారణం’’ అని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

రుణమాఫీ తర్వాతే రైతు భరోసా

‘‘రైతు రుణమాఫీ గురించి కలలో కూడా పట్టించుకోని పార్టీలు ఇప్పుడు ప్రాణాలు అడ్డేసైనా రైతుల కోసం పోరాడతామని కబుర్లు చెప్తున్నాయి. ప్రతి రైతుకు న్యాయం చేసే ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పటి వరకు 25 వేల కోట్ల మంది రైతులకు రుణమాఫీ చేశాం. మరో 25వేల కోట్ల మందికి ఖాతాల్లో డబ్బు జమకావాల్సి ఉంది. అతి త్వరలో మరో 20 లక్షల మంది రైతులకు రుణ మాఫీ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తాం. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే రైతు భరోసాను ప్రారంభిస్తాం. అదే విధంగా పంటల విషయంలో కూడా ఎవరికీ అన్యాయం చేయం. ప్రస్తుతం తెలంగాణలో 1.45 కోట్ల టన్నుల వరి పంట సాగవుతోంది. ఈ సీజన్లో అధికశాతం మంది రైతులు సన్న ధాన్యాన్ని పండిస్తున్నారు. ఈ సన్నధాన్యానికి అదనంగా రూ.500 ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తులు కూడా చేశాం’’ అని మంత్రి వివరించారు.

ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం: కేటీఆర్

తాజాగా ఈరోజు మరోసారి రైతు రుణమాఫీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ కూర్చోమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, అదే విధంగా చెప్పినట్లే దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ కూడా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు, రైతుల విషయంలో ఈ ప్రభుత్వం తీరు ఒడ్డెక్కి తెప్ప తగలేసినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తానంటున్న సీఎం రేవంత్ దగ్గర రైతుల బంధు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవ్వడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు కూడా పైసలు లేవా అని నిలదీశారు. లక్షల మంది రైతులకు పంగనామాలు పెడతామంటూ తాము ఊరుకోమని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

రుణమాఫీ అంతా డొల్ల మాటలే

అయితే రైతు రుణమాఫీ తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతుంటే.. తాము ఎవరినీ మోసం చేయలేదని, ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అంటూ చేసిన వ్యాఖ్యలన్నీ డొల్ల మాటలే అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘‘వంద శాతం రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి పలుకులన్నీ డొల్ల మాటలేనని మరోసారి తేలిపోయింది. డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి దగా చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు పూర్తయినా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సీఎం మాటలు నయవంచన కాక మరేంటి. ఈ 20 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి. అధికారిక లెక్కల ప్రకారమే మోసపోయిన రైతుల సంఖ్య 20 లక్షలుగా ఉంటే.. అనధికారికంగా ఇంకెందరు ఉన్నారో. ఇప్పటికి కూడా రుణమాఫీని పూర్తి చేయలేదీ ప్రభుత్వం. రైతు బంధును కూడా అటకెక్కించేశారు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Tags:    

Similar News