పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రిని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్నారు.;
By : The Federal
Update: 2025-05-16 02:20 GMT
మహబూబ్ నగర్ జిల్లాలోని 700 సంవత్సరాల వయసు గల పిల్లల మర్రి వృక్షాన్ని ప్రపంచ అందాల భామలు సందర్శించనున్నారు. ప్రపంచ సుందరీమణుల రాకతో ఏడు శతాబ్దాల చరిత్ర గలిగిన మహావృక్షం పాలమూరు పిల్లలమర్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది.
పాలమూరు జిల్లా పేరు ప్రఖ్యాతులు
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత పాలమూరు జిల్లా పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం చేసేందుకు అందాలభామలను పిల్లలమర్రి సందర్శనకు తీసుకురానున్నారు. .ఎంతో గొప్ప చరిత్రను కలిగిన ఈ ప్రాంతానికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పిల్లలమర్రి భారతదేశంలోని అతి పెద్ద మహా వృక్షాల్లో మూడవది. ఈ మహావృక్షం తన వేళ్లలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది.
మహబూబ్ నగర్ ఆవిర్భావం...
మహబూబ్ నగర్ జిల్లాను గతంలో రుక్మాపేట, పాలమూరుగా పిలిచేవారు. నిజాం కాలంలో 1980వ సంవత్సరంలో మహబూబ్ నగర్ గా పేరు మార్చారు. ప్రసిద్ధ కోహినూర్ డైమండ్ తో పాటు ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఇక్కడి నుంచి వచ్చాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గతంలో చోళవాడి చోళుల భూమి అని కూడా పిలిచేవారు. పాలమూరు నుంచి కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. 7 శతాబ్దాల చరిత్ర ఉన్న వేర్లు మొదలు ఎక్కడో నేటికీ గుర్తించలేని ఓ మహా వృక్షం ఈ ప్రాంత కీర్తిని మరింత పెంచుతుంది. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పిల్లలమర్రి మహావృక్షం రమణీయమైన ప్రకృతి క్షేత్రంలో ఉంది.
మర్రిచెట్టును తొలచిన చెదపురుగులు
ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం పొందిన మర్రిచెట్టును చెదపురుగులు తొలచి వేయడంతో 2017వ సంవత్సరం డిసెంబర్ లో ఒక కొమ్మ విరిగిపడింది.దీంతో చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆపేశారు. ప్రజలు చెట్టు వద్దకు వచ్చినా దాన్ని తాకకుండా ఉండేలా చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. దానిపై నుంచే చూసేలా ఏర్పాటు చేశారు.
చెదపురుగుల నివారణకు...
ఆ తరువాత పిల్లలమర్రి చెట్టు వద్ద చెద పురుగులు లేకుండా చేసేందుకు క్లోరోఫైరీ ఫస్ ద్రావణాన్ని తొర్రల్లోకి పంపించారు. అందుకు సెలైన్ బాటిళ్లను వాడారు. చెట్ల కొమ్మలకు డ్రిల్లింగ్ చేసి ద్రావణం వెళ్లేలా ఏర్పాటు చేసి జీవం పోశారు. పిల్లలమర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మళ్లీ జీవం పోసుకుంది. ఒదిగిన చోటే ఎదిగి తిరిగి చిగురించి తన చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా పిల్లలమర్రి నిలిచింది. భారతదేశంలోనే అతిపెద్ద మర్రి చెట్లలో ఇది ఒకటని తెలంగాణ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొదట ఈ చెట్టును పీర్లమర్రిగా పిలిచేవారు. క్రమంగా పిల్లలమర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చెట్టు శాఖోప శాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ అనేది తెలుసుకోలేనంతగా మారింది.
16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం
16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం కృష్ణానది తీరంలోని ఈర్లదిన్నె గ్రామంలో ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణ సమయంలో ఏర్పడిన ముంపు నేపథ్యంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించే ఉద్దేశంతో 1983వ సంవత్సరంలో పిల్లల మర్రి పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణానికి తరలించి అధునాతన పునాదులపై 1983లో తిరిగి పునర్ ప్రతిష్ఠించారు.విజయనగరం వాస్తు శైలిలో నిర్మించిన ఈ ఆలయం 16వ శతాబ్దానికి చెందినది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శన శాఖలో జిల్లాకు చెందిన పలు గ్రామాలు పట్టణాల్లో సేకరించిన శిల్పాలు, శాసనాలు రాతియుగపు పనిముట్లు హైదరాబాద్ స్టేట్ మ్యూజియం నుంచి సేకరించిన పంచలోహ విగ్రహం పిల్లల మర్రి ప్రదర్శనశాలలో ఉంచారు.
పిల్లల మర్రి లోని శిల్ప విశిష్ఠత చూపరులకు కనువిందు చేస్తుంది సందర్శకులకు విజ్ఞానంతో పాటు వినోదాలతో పాటు ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతతను కూడా కల్పిస్తుంది. పిల్లల మర్రిలో ప్రదర్శించిన శిల్పాలు మహబూబ్ నగర్ జిల్లాలోని అల్వాల్ పల్లి, గొల్లతగుడి, పూడూరు, నంది వడ్డెమాన్, పానగల్, కల్వకోల్ ప్రాంతాల్లోని హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు.అమరాబాద్ త్రవ్వకాల్లో లభించిన పాత రాతియుగం పనిముట్లు నవీన శిలాయిగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాలు ఎన్నో ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
పిల్లల మర్రిలో మరెన్నో...
పిల్లలమర్రి శిల్ప విశిష్ఠత చూపరులను కనువిందు చేస్తుంది. తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో పిల్లల మర్రిలో జిల్లా మ్యూజియం ఏర్పాటు చేశారు. శాతవాహనుల నుంచి అసఫ్ జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు ,రాగి,బంగారు నాణెలు ఇక్కడ ప్రదర్శించిన వాటిలో ప్రముఖమైనవి. పిల్లలమర్రిలో ఇంకా ఎన్నో విహారయాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్లు,కుందేళ్లు, కోతులు,సరీసృపాలు వివిధ రకాల కు చెందిన చేపల ఎక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది.
రెండు గంటల పాటు పర్యటన
పాలమూరు అంటేనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇంతటి ప్రఖ్యాతలు సాధించిన ఆలయాలు పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీర పరిశీలించేందుకు ప్రపంచ సుందరిమణులు పాలమూరుకు తరలి రావడం ఇక్కడి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రపంచ సుందరిమణులు (మిస్ వరల్డ్ 2025 పోటీదారులు) శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఈ నెల16వతేదీ సాయంత్రం ఐదు గంటలకు పిల్లలమర్రి చేరుకుంటారు. అక్కడే సుమారు రెండు గంటల పాటు చారిత్రక ఆలయాలను జిల్లా మ్యూజియంతో పాటు పిల్లలమర్రి చరిత్రను వాటి ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటారు. పాలమూరు వారసత్వాన్ని సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పర్యాటకశాఖ విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ సుందరిమణులు పిల్లలమర్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ చరిత్రను పిల్లలమర్రి ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యాచరణ చేపట్టింది.
పకడ్బందీ ఏర్పాట్లు
అందాల భామల పర్యటనకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి ఎస్.పి.డి జానకి ల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే ఐ.జి సత్యనారాయణ, జోగులాంబ జోన్ డిఐజి ఎల్ హెచ్ చౌహన్ సహా ఇతర జిల్లా అధికారులు,అదనపు కలెక్టర్లు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వెయ్యి మందికి పైగా పోలీస్ అధికారులు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్ తో ప్రభుత్వం అందాల భామలు, ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళికలు రచించింది. తద్వారా పాలమూరు ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
పిల్లలమర్రికి ప్రపంచ సుందరీమణులు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ సుందరీమణులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రిని సందర్శించనున్నారు. పిల్లలమర్రికి వచ్చే అందాలభామలకు పర్యాటక శాఖ అధికారులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలకనున్నారు. దేవాలయాన్ని సందర్శించిన తర్వాత 700 ఏళ్ల వయసు గల పిల్లల మర్రి గురించి ప్రపంచ సుందరీమణులకు వివరించి చెప్పనున్నారు. నంది, గణేశ్ విగ్రహాలు, మ్యూజియాన్ని అందాల భామలు తిలకిస్తారు.అందాల భామలు తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ, బోనాలు, బంజారా డాన్స్ చేయనున్నారు.
ఏఐజీ ఆసుపత్రికి అందాల భామలు
40 మంది ప్రపంచ అందాలభామలు శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందుబాటులో ఉన్న చికిత్సల గురించి అడిగి తెలుసుకుంటారు. దేశ, విదేశీ రోగులకు, చిన్న పిల్లలకు, బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్ నెస్, డైట్ కార్యక్రమాల గురించి ఏఐజీ వ్యవస్థాపకులు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి అందాలభామలకు వివరించనున్నారు.