‘తెలంగాణలో 28.9శాతం అత్యాచారాలు పెరిగాయి’
రోజుకు సగటున 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంతవరకు తీసుకుంటే క్రైమ్ రేట్ 41శాతం పెరిగింది.;
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నేరాలకు అడ్డాగా మారుతుందంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు ఎనిమిది అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఆరోపించారు. సీఎం పాలనలో రాష్ట్రంలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి హక్కులేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందని, రాష్ట్రంలో 43శాతం క్రైమ్ రేట్ పెరిగిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ‘‘రాష్ట్రంలో అత్యాచారాల సంఖ్య 28.9శాతం పెరిగింది. రోజుకు సగటున 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంతవరకు తీసుకుంటే క్రైమ్ రేట్ 41శాతం పెరిగింది. మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారు. పోలీసులను సైతం లెక్క చేయడం లేదు. కారు బానెట్‌పై కూర్చుని కేసులు పెట్టాలని పోలీసులను బెదిరించిన వ్యక్తి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే’ అంటూ దాసోజు శ్రావణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఒక టీవీ ఛానెల్‌పై దాడి కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణిని ఏ25గా చేర్చారు. పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆమెను బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం. కొడంగల్ లో రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి పోలీసులు వచ్చారని రేవంత్ రెడ్డి సతీమణి గీత రోడ్డుపై ధర్నా చేస్తే వారిపై ఎవరైనా కేసులు పెట్టారా? రీ ట్వీట్ చేసినందుకు శశిధర్ గౌడ్ ను 17 రోజులు జైల్లో పెట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆఫీసుపై, పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, నల్గొండలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడి, సిరిసిల్లలో కేటీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడి, ఖమ్మంలో హరీష్ రావు కాన్వాయ్ పై దాడి చేశారు. వీటిపై ఎవరన్నా కేసు నమోదు చేశారా? రేవంత్ రెడ్డి.. చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడమే పనిగా రేవంత్ పనిచేస్తున్నారు. పోలీసులు సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.