గల్ఫ్ మృతుల్లో జగిత్యాల జిల్లా వాసులే అధికం

తెలంగాణలో గల్ఫ్ మృతుల్లో జగిత్యాల జిల్లా వాసులే అధికంగా ఉన్నారని తాజాగా వెల్లడైంది. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన అనారోగ్యంతోపాటు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.

Update: 2024-10-25 14:23 GMT

తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన జగిత్యాల జిల్లావాసుల్లో 28 మంది మృత్యువాత పడ్డారని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మృతుల స్వగ్రామాలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన డేటా ప్రకారం గల్ఫ్ దేశాల్లో 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి చెందినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు చెప్పారు.


రూ.1.4 కోట్లు కేటాయింపు
గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.గల్ఫ్ మృతుల కుటుంబబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం జగిత్యాల జిల్లాకు రూ.1.4కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల 21వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని వినోద్ కుమార్,మంద భీంరెడ్డి లు కోరారు.

మార్గదర్శకాలు విడుదల
గల్ఫ్ దేశాలలో చనిపోయిన తెలంగాణ ప్రవాసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో నెంబర్ 205 కు కొనసాగింపుగా,అక్టోబర్ 7న విడుదల చేసిన మార్గదర్శకాల జీవో నెంబర్ 216 విడుదల చేసింది. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించినవారికి ఎక్స్ గ్రేషియా పథకం వర్తిస్తుంది.విదేశాల్లో మృతి చెందిన తేదీ లేదా మృతదేహం ఇండియాకు చేరుకున్న తేదీ నుంచి ఆరు నెలల లోపు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి.

గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా 18 దేశాల్లో మృతులకు ఇవ్వాలి
18 ఈసీఆర్ దేశాల్లోని బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ ఏడు దేశాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసీఆర్ జాబితా లోని మిగిలిన 11 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్ లకు కూడా వర్తింపజేయాలని వీటితో పాటు సింగపూర్, ఇజ్రాయిల్, కాంబోడియా, రష్యా, ఉక్రేన్, మాల్దీవ్స్ దేశాలను కూడా చేర్చాలని గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు చెల్లించే మృతధన సహాయ దేశాల పరిధిని విస్తరించాలనే విజ్ఞప్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని వారు కోరారు.


Tags:    

Similar News