పేదల జోలికి వస్తే ఖబడ్ధార్ -ఈటల రాజేందర్

పేదల జోలికి వస్తే ఖబడ్ధార్ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Update: 2024-08-29 14:17 GMT

పేదల జోలికి వస్తే ఖబడ్ధార్ అంటూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఓల్డ్ బోయినపల్లి హస్మత్ పేట బోయిన చెరువు చుట్టూ ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు స్థానికంగా నివస్తున్న వారి ఇళ్ళు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి, ప్రభుత్వం వీళ్ళ జోలికి వస్తే ఖబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

"హస్మత్ పెట్ చెరువు పక్కకి ఉన్న 125 మంది, అల్వాల్ చెరువు దగ్గర ఉన్న 120 మంది కడు పేదరికంలో ఉండి, 40-45 ఏళ్లుగా ఇక్కడే పనిచేసి 60-70 గజాలు భూములు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ చెరువులు ఉండాలని, చెరువులలో నీళ్లు ఉండాలని, భూగర్భ జలాలు పెరగాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవాళే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, వారే మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినట్టుగా వారు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే బాధనిపిస్తుంది" అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

"1956 నుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు 17 సంవత్సరాలు టిడిపి పాలించింది, పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది, కానీ 40 సంవత్సరాలు పైగా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అధికారులు వీటన్నిటి పైన రిపోర్టులు తీసుకొచ్చి పేదలకు విఘాతం కలగని పద్ధతిలో చెరువులకు కట్టలు పోసి, చెరువు నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసివేశారు. ఇవాళ వచ్చి N కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొట్టేది ఒకటో రెండో పెద్దోళ్ళవి కానీ వందల మంది పేదలకు నోటీసులు ఇచ్చారు" అంటూ మండిపడ్డారు.

"ఈ నోటీసు వచ్చిన తర్వాత పేదలకు కంటిమీద కునుకు లేదు. వాళ్లు కార్పొరేటర్, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, పేదవాళ్ల ఇళ్ల పంచాయతీ అన్నారు ఈటల రాజేందర్. మొన్న ప్రెస్ మీట్ లో నేను ఒకటే చెప్పాను... హైడ్రా పేరిట మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ పేదల ఇళ్ల జోలికొస్తే ఖబర్దార్ అని ఇప్పటికే హెచ్చరించాము. ఇంత జరుగుతున్నా కూడా మళ్లీ రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కమిషనర్ కావచ్చు మేము పేదల ఇళ్ల జోలికి పోవడం లేదంటున్నారు కానీ ఈ నోటీసులు ఎందుకు పంపించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను" అని తెలిపారు.

"మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వందల చెరువుల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ల బాధ గురించి ఇప్పటికే మేము ప్రస్తావించాము. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాను ఏదో సుద్ధ పూసలెక్క, ధర్మాన్ని నీవే పునరుద్ధరిస్తున్నట్టుగా, నువ్వు ఏదో ఛాంపియన్ లాగా ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేయకు, పేదల జోలికొస్తే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను అని ఈటల రేవంత్ పై ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News