‘కాళేశ్వరం గలాటా కక్షగట్టి చేస్తున్నదే’
సీపీ ఘోష్ కమిషన్ పేరుతో రేవంత్ చేసిందంతా టైమ్ పాసేన్న కేటీఆర్.;
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ కక్షగట్టి పని చేస్తుందన్నారు. కమిషన్ పేరుతో ఏడాదిన్నర పాటు రేవంత్ టైమ్ పాస్ చేశారని విమర్శించారు. కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, 3 బ్యారేజీలు అని గుర్తు చేశారు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ అన్నారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని చెప్పారు. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారని, కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే మూసీ నది పునరుజ్జీవనం శంకుస్థాపనపై స్పందించారు. తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపనను రేవంత్ తీసుకొచ్చి తోక దగ్గర చేస్తున్నారని సెటైర్లు వేశారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మసాగర్ వద్ద చేయాలి.. లేదా మల్లన్నసాగర్ వద్ద చేయాలన్నారు. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవాళ తెస్తున్నది కాళేశ్వరం జలాలు కాదా..!
‘‘గుండెకాయను వదిలి గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు గండిపేటకు తీసుకొస్తున్న జలాలు కాళేశ్వరానివి కాదా? మల్లన్న సాగర్ నుంచే నీరు హైదరాబాద్‌కు తెస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ దానినే కూళేశ్వరం అని ప్రచారం చేస్తున్నారు. మాపై లేనిపోని అపవాదులు మోపుతున్నారు. నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్‌తో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు.
‘‘సీబీఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు వాటిలో ఒకటైన సీబీఐకే కాళేశ్వరం కేసును రేవంత్ అప్పగించారు. దీనిని బట్టే బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని అర్థమైపోతోంది’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడుంది..?
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చు రూ.9వేల కోట్లు. అలాంటప్పుడు అందులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది. కేవలం కేసీఆర్ పేరును బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే కాళేశ్వరం అవినీతి అని ఆరోపణలు చేశారు. కమిషన్ పేరుతో ఏడాదిన్నర టైమ్ పాస్ చేశారు. ఎల్లకాలం ప్రజలను మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి’’ అని హితవు పలికారు.
అవినీతి చేసింది కాంగ్రెస్ సర్కార్..
‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా భారీ అవినీతికి పాల్పడింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందు వచ్చింది. కానీ దానిని ప్రభుత్వమే అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1100 కోట్లతో హైదరాబాద్‌కు నీళ్లు తీసుకురావొచ్చు. కానీ ఈ ప్రభుత్వం రూ.7700 కోట్ల వ్యయం అంటోంది. అంటే 7 రెట్ల వ్యయం పెరిగింది. కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది’’ అని కేటీఆర్ ప్రశ్నించింది.