మంత్రి సాక్షిగా ఎంఎల్ఏపై ఎంపీ దాడిచేశారా ?
ప్రజాప్రతినిధులు ఒకరిపై మరొకరు కొట్టేసుకునేంత ప్రజాస్వామ్యం ఉందన్న విషయం ఇపుడే బయటపడింది;
కాంగ్రెస్ అంటేనే పూర్తి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధులు ఒకరిపై మరొకరు కొట్టేసుకునేంత ప్రజాస్వామ్యం ఉందన్న విషయం ఇపుడే బయటపడింది. విషయం ఏమిటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొంతకాలంగా ఎంపీ, ఎంఎల్ఏల మధ్య ప్రోటోకాల్ గొడవ జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్(BRS Defection MLA Bandla Krishna Mohan Reddy) ఫిరాయింపు ఎంఎల్ఏల ఎంట్రీతో వివాదం మరింతగా పెరిగింది. ఇపుడు విషయం ఏమిటంటే నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య పెద్ద గొడవే అయ్యిందని సమాచారం. గద్వాల నియోజకవర్గంలో ఫిరాయింపు ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్, 2023 ఎన్నికల్లో బండ్లకు వ్యతిరేకంగా పోటీచేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్యకు అసలు పడటంలేదు. తిరుపతయ్యేమో కాంగ్రెస్ నేత, బండ్లేమో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో నుండి ఫిరాయించిన ఎంఎల్ఏ. పైగా బండ్లపైన అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ నేపధ్యంలో నియోజకవర్గంలో అధికారులు, ఎంపీ, పార్టీ మొత్తం తిరుపతయ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏకి నియోజకవర్గంలో పెద్దగా గుర్తింపులేకుండా పోయింది. దాంతో ఈ ఇద్దరి మధ్యా గొడవలవుతున్నాయి. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు వీళ్ళ గొడవలను సర్దుబాటుచేయలేక చేతులెత్తేశారు.
ఈ నేపధ్యంలోనే భూభారతి(Bhubharathi program)పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ్లతో పాటు తిరుపతయ్యను కూడా ఎంపీ మల్లురవి(Mallu Ravi) వేదికమీదకు పిలిచారు. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏకు బాగా మండిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంపీ, బండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కారులో కూర్చున్నారు. కొంతసేపు ప్రయాణం అయిన తర్వాత తనకు వ్యతిరేకంగా తిరుపతయ్యను వేదికమీదకు పిలిచి ఎలా ప్రోత్సహిస్తారంటు ఫిరాయింపు ఎంఎల్ఏ మల్లురవిని నిలదీశారు. తనని ఎంఎల్ఏ నిలదీయటంతో ఎంపీ మల్లురవికి కోపం వచ్చి గట్టిగా మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్యా పెద్ద వాదులాట జరిగింది. వాదులాట జరుగుతుండగానే మల్లురవి సడెన్ గా ఎంఎల్ఏ చెంపమీద గట్టిగా కొట్టారని సమాచారం. ఊహించని పరిణామంతో ముందు షాక్ కు గురైన ఎంఎల్ఏ తాను కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా తిరిగి ఎంపీని గట్టిగా కొట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ప్రోటోకాల్ రగడను పరిష్కరిద్దామని కారులో కూర్చోబెట్టుకున్న మంత్రి ఇద్దరు ప్రజాప్రతినిధుల గొడవతో బిత్తరపోయారు. ముందుసీటులో కూర్చున్న మంత్రి వెనుక ఇద్దరు కొట్టుకున్నా ఏమీ జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండిపోయారని తెలిసింది. ఇదే విషయమై వివరణ అడుగుదామని ఎంపీ మల్లురవికి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని సమాధానం వచ్చింది.