వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల ఆందోళన, కోర్టు వివాదాల్లోనే వక్ఫ్ భూములు

వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.దీంతో తెలంగాణలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై ముస్లిం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-08-08 13:35 GMT
telangana wakf board

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకే తాము వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టామని మంత్రి ప్రకటించారు. ఈ బిల్లును బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలు సమర్ధించగా,విపక్షాలైన కాంగ్రెస్, ఎంఐఎం,ఎస్పీ, డీఎంకే, కమ్యూనిస్టులు, వైఎస్సార్ సీపీ, టీఎంసీ పార్టీలు వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి కేంద్రం పంపించింది.


ధార్మిక అవసరాల కోసం వక్ఫ్ బోర్డు ఆస్తులు
మసీదులు, దర్గాలు, అష్రూఖానాలు, మదరసాలు, విద్యాసంస్థలు, శ్మశానవాటికల నిర్వహణకు, ముస్లిం ధార్మిక అవసరాల కోసం వక్ఫ్ ఆస్తులను నిర్దేశించారు. వక్ఫ్ ఆస్తుల గురించి 1995వ సంవత్సరంలో చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టాన్ని 2013వ సంవత్సరంలో సవరించి, ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుకు కల్పించారు.

వక్ఫ్ కొత్త సవరణ బిల్లు 2024 ఏం చెబుతుందంటే...
వక్ఫ్ బోర్డుల అధికారాలను తగ్గించి, ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం సవరణ బిల్లు లక్ష్యం. వక్ఫ్ ఆస్తులను కలెక్టరు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలని బిల్లులో ప్రతిపాదించారు. వక్ఫ్ ఆస్తినా లేదా ప్రభుత్వ భూమినా అనేది కలెక్టరుు నిర్ణయించేలా బిల్లులో సవరణలు చేశారు.కేంద్ర వక్ఫ్ కౌన్సిల్,రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని బిల్లులో ప్రతిపాదించారు.

కోర్టుల్లోనే 80 శాతం తెలంగాణ వక్ఫ్ ఆస్తుల కేసులు
తెలంగాణ రాష్ట్రలో వక్ఫ్ ఆస్తుల కేసుల్లో 80 శాతం కోర్టు వివాదాల్లోనే ఉన్నాయి.తెలంగాణలో వక్ఫ్ భూమిలో 20శాతం మాత్రమే వ్యాజ్యం లేకుండా ఉన్నాయి.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కంటే మెదక్ జిల్లాలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి.దర్గాలు, మసీదులు, శ్మశాన వాటికలు, అష్రూఖానాలకు సంబంధించిన 23,910 ఎకరాల భూమి ఉంది. తెలంగాణలోని 10 పూర్వ జిల్లాల్లో మొత్తం 77,538 ఎకరాల వక్ఫ్ భూముల్లో 16,000 ఎకరాలు మాత్రమే కోర్టు వ్యాజ్యం లేనివని పేరు చెప్పడానికి ఇష్టపడని వక్ఫ్ బోర్డు అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో 33,929 వక్ఫ్ సంస్థలు పనిచేస్తున్నాయి. రంగారెడ్డి 14,785 ఎకరాల వక్ఫ్ భూములతో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 11,500 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 10,119 ఎకరాలు ఉన్నాయి.వక్ఫ్ ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి.

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం : వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ ఖుస్రూపాషా
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తామని తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ ఖుస్రూపాషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మసీదులు, మదరసాలు, దర్గాల నిర్వహణకు ఉద్ధేశించిన వక్ఫ్ ఆస్తుల పరిరక్షించాల్సింది పోయి వాటిని భక్షించే విధంగా కొత్త సవరణ బిల్లు తీసుకురావడాన్ని తమతో పాటు అన్ని ముస్లిం సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారని ఖుస్రూపాషా చెప్పారు.తెలంగాణలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం తాము ఉద్యమిస్తామని ఆయన వివరించారు.

ముస్లిం సంఘాలన్నీ వ్యతిరేకించినా బిల్లు ప్రవేశపెడతారా?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 ను దేశంలోని జమాఅతే ఇస్లామీహింద్, ముస్లిం లా బోర్డు, అన్ని ముస్లిం సంఘాలు, వక్ఫ్ బోర్డులు వ్యతిరేకించినా, బీజేపీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ఏమిటని తెలంగాణ జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ప్రశ్నించారు. ‘ఫెడరల్ తెలంగాణ’తో అజహరుద్దీన్ మాట్లాడుతూ తాము వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసే దాకా పోరాడుతామని చెప్పారు. ముస్లింల హక్కులను భక్షించడానికి కేంద్రం సవరణ బిల్లును తీసుకువచ్చిందని తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సలీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

వక్ఫ్ భూముల పరిరక్షణే లక్ష్యం
ఆస్తులపై వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ చెప్పారు.వక్ఫ్ బోర్డుకు న్యాయపరమైన అధికారాలు కల్పించాల్సింది పోయి ఉన్న అధికారాలను తగ్గించాలనుకోవడం సరైంది కాదని ఆయన చెప్పారు. ఈ సవరణ బిల్లుపై తాము సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.వక్ఫ్ భూముల పరిరక్షణే తమ లక్ష్యమని అజ్మతుల్లా వివరించారు.

బిల్లును వ్యతిరేకించిన ఎంపీ అసద్
వక్ఫ్ సవరణ చట్టం ప్రవేశపెట్టడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించేదిగా సవరణ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. ముస్లిములను శత్రువులుగా చూస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News