ఎన్డీఎస్ఏ నివేదిక :కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో బహిర్గతం అయిన లోపాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలోనే కాకుండా డిజైన్లలో లోపాలపై ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పలు లోపాలు వెలుగుచూశాయి.;
By : Saleem Shaik
Update: 2025-04-29 13:32 GMT
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక సమర్పించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైంది.
మేడిగడ్డ బ్యారేజ్ కూలిందిలా...
2023 అక్టోబర్ 21వతేదీ : మేడిగడ్డ బ్యారేజీలోని ఏడవ బ్లాక్ 20 నంబరు పిల్లరు వద్ద కుంగిపోయింది.
2023 అక్టోబర్ 22వతేదీ : కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్, సీడీఓ లు బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించారు.
2023 అక్టోబర్ 25వతేదీ :నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇంజినీరింగ్ చీఫ్, ఎల్ అండ్ టీ బ్యారేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు.అక్టోబరు 28వతేదీన రామగుండం ఈఎన్సీ ఎన్డీఎస్ఏ బృందానికి బ్యారేజీ వివరాలు అందించారు.
2023 నవంబర్ 1వతేదీ :నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగటానికి కారణాలపై నివేదికను సమర్పించింది.నవంబరు 4వతేదీన ఈ ప్రాథమిక నివేదికను తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి పంపించింది.
ఏడుగురు నిపుణులతో ఎన్డీఎస్ఏ కమిటీ
2024 ఫిబ్రవరి 13వతేదీన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించి, ఈ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఛైర్మన్ ను కోరింది. దీంతో కాళేశ్వరం మూడు బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏడుగురు నిపుణులతో కమిటీని ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ ఛైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన, న్యూఢిల్లీ ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా, ఢిల్లీ ఐఐటీ ఫ్రొఫెసర్ డాక్టర్ బి మన్నా, ఇతర నిపుణులు యూఎస్ విద్యార్థి, రాహుల్ కుమార్ సింగ్, డాక్టర జి పాటిల్, ఎస్ కే శర్మ, డాక్టర్ ఆర్ చిత్రాలతో కూడిన నిపుణుల కమిటీని కాళేశ్వరం బ్యారేజీలపై నివేదిక ఇచ్చేందుకు ఎన్డీఎస్ఏ నియమించింది.
జస్టిస్ పినాకి చంద్రఘోష్ జుడీషియల్ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాల వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో దీనిపై న్యాయవిచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ న్యాయవిచారణ ప్రారంభించింది. న్యాయవిచారణ కమిషన్ పినాకి చంద్ర ఘోష్ ను 2024 మార్చి 14వతేదీన నియమించారు
2024 మార్చి 7, 8 తేదీల్లో కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సందర్శించి బ్యారేజీ కుంగిపోవడానికి కారణాలపై అధ్యయనం చేసింది.
ఎన్డీఎస్ఏ తుది నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్డీఎస్ఏ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి విభాగం విచారణ కమిటీ ఛైర్మన్ తుది నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 24వతేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ఏం చెబుతుంది...
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని 5,700 డ్యామ్ ల సేఫ్టీ చట్టం మేర పార్లమెంటు తీర్మానంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2022 ఫిబ్రవరి 17వతేదీన ఏర్పాటు అయింది. ఈ సంస్థ నిపుణులు డ్యామ్ ల భద్రతకు సంబంధించి అధ్యయనం చేసి నివేదికలను సమర్పిస్తుంటాయి, ఈ సంస్థ అత్యున్నత డ్యామ్ ల భద్రతా విధానాలను అమలు చేసే సంస్థగా గుర్తింపు పొందింది.
నాణ్యత లేకుండా నిర్మాణాలు
ప్రజాధనంతో నాణ్యత లేకుండా బ్యారేజీలను నిర్మించి ఘోరైన మానవ నిర్మిత విపత్తుని సృష్టించారని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. దేశంలో ఇలాంటి ఘోరమైన విపత్తు చూడలేదని ఎన్డీఎస్ఏ ఆరోపించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బ్యారేజీల నిర్మాణం వద్ద సరైన భౌగోళిక సాంకేతిక పరిశోధనలు చేయలేదని, డిజైన్లలో లోపాలున్నాయని, నిర్మాణంలోనూ లోపాలున్నాయని కమిటీ తేల్చి చెప్పింది. మోడలింగ్ అధ్యయనాల్లో విఫలమ్యారని, బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యం, క్వాలిటీ కంట్రోల్ చేయక పోవడం, బ్యారేజీల ఆపరేషన్, మెయింటెనెన్స్ వైఫల్యాలను ఎన్డీఎస్ఏ కమిటీ ఎత్తి చూపించింది.
బ్యారేజీల నిర్మాణంలో లోపాలు
డ్యామ్ నిర్మాణంలో భద్రతా అంశాలను విస్మరించారని, మూడు బ్యారేజీల్లోనూ వైఫల్యాలున్నాయని కమిటీ తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడవ బ్లాక్ పియర్స్ కుంగిపోవడం, వంగిపోవడం,పైపింగ్, ఎనర్జీ డిసిపేటింగ్, బ్లాకులు కొట్టుకుపోయాయని కమిటీ తెలిపింది. బ్యారేజీ హైడ్రో మెకానికల్ పరికరాలు దెబ్బతిన్నాయని, వేరింగ్ కోట్ తొలగిపోయిందని కమిటీ పేర్కొంది. బ్యారేజీ దిగువన ఉన్న సిమెంటు కాంక్రీట్ బ్లాకులు తొలగిపోయాయని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ బేలలో వీయరింగ్ కోట్ మెటీరియల్ దెబ్బతిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. కాపర్ డ్యామ్ వద్ద మట్టి కుప్పలను సైతం తొలగించలేదని, డ్యామ్ సీసీ బ్లాకులు కొట్టుకు పోయాయని నిపుణులు గుర్తించారు. బ్యారేజీ ఎగువన ఇసుక పేరుకుపోయిందని, బ్యారేజీ వద్ద గుంతలు పడ్డాయని కమిటీ వెల్లడించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ వియరింగ్ కోట్, కాంక్రీట్ బ్లాకులు తొలగిపోవడంతో లీకేజీలు ఏర్పడ్డాయని కమిటీ తుది నివేదికలో పేర్కొంది.
డీపీఆర్ ల తయారీలో లోపాలు
కాళేశ్వరం బ్యారేజీల డీపీఆర్ తయారీకి తగిన సమయం ఇవ్వలేదని ఎన్డీఎస్ఏ కమిటీ ఆరోపించింది. ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించడంతో తప్పులు జరిగాయని, తగిన డేటా, పరిశోధనలు చేయలేదని ఆక్షేపించింది. బ్యారేజీల నిర్మాణానికి నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని 2.2 కిలోమీటర్లు. 5.4 కిలోమీటర్ల మేర దిగువకు మార్చారని కమిటీ వెల్లడించింది. రెండు బ్యారేజీలు నదీ పరివాహక మట్టానికి దిగువన ఉండటంతో అన్నారం బ్యారేజీకి ఎగువన భారీగా ఇసుక మేటలు వేసిందని కమిటీ తెలిపింది. బ్యారేజీ నిర్మాణ స్థలాలు మార్చినా కొత్త స్థలాల్లో భూగర్భ పరీక్షలు నిర్వహించలేదని కమిటీ ఆక్షేపించింది.
ఇదీ బీఆర్ఎస్ డిజాస్టర్
లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా లోపాలు జరిగాయని దీనివల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థతోపాటు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇన్ని తప్పిదాలు దేశంలో ఎక్కడా జరగలేదన, బీఆర్ఎస్ ఘోర వైఫల్యాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ ఎత్తిచూపించారు. రుణాలు తీసుకువచ్చి ప్రాజెక్టులను కూలిపోయేలా నాణ్యత లేకుండా నిర్మించారని ఆయన చెప్పారు. మేడిగడ్డ కూలిపోయాక సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. మనుషులు చేసిన డిజాస్టర్ అని ఆయన చెప్పారు.
మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తుది నివేదికపై తాము చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తాము మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ డ్యామ్ నిర్మాణ లోపాలకు ఇంజినీరింగ్ అధికారులే కాకుండా ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి జరిగిన తీవ్ర వైఫల్యానికి జరిగిన నష్టానికి బాధ్యులని మంత్రి చెప్పారు.