NEET | స్థానికత కోటాపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ;
తెలంగాణ స్థానికత కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. చదువుకోసం రెండు సంవత్సరాలు బయటకు వెళ్లినవారిని స్థానికులు కాదంటే ఎలా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ అంశంలో తెలంగాణలో నాలుగేళ్లపాటు వరుసగా చదవకపోయినా వారికి స్థానికత కోటా వర్తిందని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై మంగళవారం మరోసారి విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థి తెలంగాణలో పుట్టి, పెరిగి, చదివి.. రెండు సంవత్సరాల చదువు కోసం బయటకు వెళ్లినందుకు వాళ్లకి స్థానికత కోటా వర్తించదని అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. 2024లో తీసుకువచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ పేర్కొన్నారు. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ బీఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటంటే..!
నీట్ పరీక్ష రాయడానికి నాలుగు సంవత్సరాల ముందు నుంచి తెలంగాణలో చదవాలి. ఆ విద్యార్థులకు మాత్రమే నీట్‌లో స్థానికత కోటా కింద సీట్ లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అయితే ఇవి చెల్లవని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది మాత్రం పిటిషనర్లకు(విద్యార్థులకు) రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అదే విధంగా ఈ ఏడాది తమకు కూడా మినహాయింపు అందించాలని కోరుతూ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో పుట్టి పదోతరగతి వరకు చదివినప్పటికి 11, 12 తరగతులు చదవనందుకు తమను అనర్హులుగా పరిగణిస్తున్నారని, దాని వల్ల తాము తీవ్రంగానష్టపోతున్నమని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.