తెలంగాణా నియామకాల్లో రికార్డు సృష్టించారు

ఒక ఎంఎల్ఏ శ్రీకారంచుట్టిన కొత్త ఒరవడి ఇపుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Update: 2024-11-22 06:54 GMT
Newly appointed Marketing Committee Chairmans

తెలంగాణాలో సరికొత్తపద్దతిలో నియామకాలు మొదలయ్యాయి. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదు. ఒక ఎంఎల్ఏ శ్రీకారంచుట్టిన కొత్త ఒరవడి ఇపుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. సౌజన్య 15 మందితో పోటీపడి పోస్టుకు ఎంపికైంది. చికోటి మనోజ్ కుమార్ ఐదుమందితో పోటీపడి పోస్టు దక్కించుకున్నారు. దొడ్ల కవిత ముగ్గురితో పోటీపడి పోస్టును సాధించుకుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సిమిలారిటి ఉంది. అదేమిటంటే ముగ్గురూ ఎంపికైంది వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగానే. మామూలుగా అయితే మార్కెట్ కమిటి ఛైర్మన్ పోస్టంటే ఎంఎల్ఏ రికమెండ్ చేస్తే వెంటనే ప్రభుత్వం నియమించేస్తుంది. కాని ఈసారి అలా జరగలేదు. నియోజకవర్గంలోని మూడు మార్కెంట్ కమిటీల ఛైర్మన్ పోస్టులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు హాజరైన మిగిలిన వాళ్ళతో పోటీపడి మొదటిస్ధానంలో నిలిచిన వాళ్ళనే మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా ఎంఎల్ఏ రికమెండ్ చేయగానే ప్రభుత్వం నియమించేసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే కామారెడ్డి(Kamareddy) జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ఉంది. దీనికి ఎంఎల్ఏ తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Laxmikantha Rao). నియోజకవర్గంలో మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. మూడింటికి ఛైర్మన్లను నియమించాలని అనుకున్నారు. అయితే మూడుపోస్టులకు బాగా పోటీఉంది. అందుకని ఎవరిని రికమెండ్ చేయాలనే విషయంలో ఎంఎల్ఏ ఆలోచించి కొత్తపద్దతిని ఎంచుకున్నారు. అదేమిటంటే మార్కెట్ కమిటి ఛైర్మన్ పోస్టును ఆశిస్తున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని. ఇంటర్య్వూలో ఎవరైతే ఫస్టుగా నిలుస్తారో వాళ్ళకే ఛైర్మన్ పోస్టని ఎంఎల్ఏ ప్రకటించారు. ఈ తరహా ప్రొసీజర్ మామూలుగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు ఉంటుంది. అదే పద్దతిని ఎంఎల్ఏ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు కూడా వర్తింపచేశారు. దాని ప్రకారం నియోజకవర్గంలోని మద్నూరు, పిట్లం, బిచ్ కుంద మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో పాల్గొన్నవాళ్ళల్లో ఫస్టు ప్లేసులో నిలిచిన సౌజన్య, సంజయ్, కవితలను ఎంపికచేసి మార్కెట్ కమిటి ఛైర్మన్లుగా నియమించారు.

మద్నూరు మార్కెట్ కమిటి ఎస్సీలో మహిళకు రిజర్వుచేశారు. ఈ పోస్టుకు కవితతో పాటు మరో 15 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. వ్యవసాయం, మార్కెటింగ్ పద్దతులు, మార్కెట్ల వల్ల రైతులకు జరుగుతున్న మేలు, మెరుగైన పద్దతులు తదితరాలపై ప్రశ్నలు వేశారు. మద్నూరు ఛైర్మన్ పోస్టుకు ఎంఎల్ఏ లక్ష్మీకాంతరవుతో పాటు జుక్కల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంజు పటేల్, మద్నూరు మండల పార్టీ అధ్యక్షుడు శాయన్న, డోంగ్లీ పార్టీ అధ్యక్షుడు రాజుపటేల్ తో పాటు మరో నలుగురు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి హాజరైన వాళ్ళందరినీ వ్యవసాయం, మార్కెటింగ్, రైతుల సమస్యలు, పరిష్కారాలపైన 15 ప్రశ్నలు వేశారు. అందరిలోకి 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన సౌజన్యను ఛైర్మన్ గా ఎంపికచేశారు. బీఈడీ చేసిన సౌజన్య ఎంఎస్సీ బోటనీ చదువుతోంది. విద్యావంతురాలైన సౌజన్య కుటుంబం మొదటినుండి కాంగ్రెస్ లోనే ఉన్నది.

ఇక చికోటి సంజయ్ తండ్రి చికోటి రామక్టిషయ్య కూడా సంవత్సరాల తరబడి కాంగ్రెస్ లోనే పనిచేశారు. ఈయన కూడా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. బీటెక్ చదివి పదేళ్ళు వివిధ మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసిన సంజయ్ తండ్రి కాలంచేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పిట్లం మండలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పిట్లం మార్కెట్ కమిటి ఛైర్మన్ పోస్టుకు ఆరుగురు పోటీపడ్డారు. ఎంఎల్ఏతో పాటు నిజాంసాగర్ మండలం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిట్లం మండలంలో సీనియర్ నేత ఆశావహులను ఇంటర్వ్యూలు చేశారు. పిట్లంలో పార్టీ అధ్యక్షుడు కాకుండా సీనియర్ నేత ఎందుకు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నారంటే మండల అధ్యక్షుడు హనుమాన్లు కూడా ఛైర్మన్ పోస్టును ఆశించారు కాబట్టే. పోటీపడిన అందరిలోకి సంజయ్ ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పటంతో ఛైర్మన్ గా ఎంపికచేశారు.

చివరగా బిచ్ కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టు కోసం ముగ్గురు పోటీపడ్డారు. బీఏ రెండో సంవత్సరంతో చదువు ఆపేసిన దొడ్ల కవిత మిగిలిన వారికన్నా ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పటంతో ఛైర్ పర్సన్ గా ఎంపికచేశారు. ఎంఎల్ఏతో పాటు బిచ్ కుంద మండల అధ్యక్షుడు డీ గంగారామ్, పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షుడు డీ విఠల్ రెడ్డి ఆశావహులను ఇంటర్వ్యూచేశారు. ఛైర్మన్ పోస్టు కావాలని అనుకున్న వాళ్ళని ఇంటర్వ్య ద్వారానే ఎంపికచేయాలని అనుకోవటంలో ఎంఎల్ఏ తోట లక్ష్మీకాంతరావు ఉద్దేశ్యం ఏమిటంటే వ్యవసాయం, మార్కెటింగ్, రైతాంగ సమస్యలు, వాటి పరిష్కారాలపై కనీస అవగాహన ఉండాలని. పార్టీ నేతలని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఎంపికచేయాలని ఎంఎల్ఏ అనుకోలేదు. కాకపోతే ఛైర్మన్లుగా ఎంపికయ్యేవాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కుటుంబాలే అయ్యుండాలని అనుకున్నారు.

ఎంఎల్ఏ ఆశించినట్లే ఇంటర్వ్యూలకు హాజరైనవాళ్ళు, ఎంపికైన వాళ్ళ మొదటి అర్హత ఏమిటంటే అందరిదీ కాంగ్రెస్ పార్టీయే. రెండో అర్హత ఏమిటంటే వాళ్ళ కుటుంబాలన్నీ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తుండటమే. ఇక ఛైర్మన్లుగా ఎంపికైన వాళ్ళకు ఎంఎల్ఏ అనుకున్నట్లే వ్యవసాయం, మార్కెటింగ్, రైతు సమస్యలు, పరిష్కారాలపైన బాగానే అవగాహన ఉంది. ఎలాగంటే ఛైర్మన్లుగా ఎంపికైన ముగ్గురూ వ్యవసాయకుటుంబాల నుండి వచ్చిన వారే. మార్కెటింగ్ కమిటీల ఛైర్మన్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికచేయటం అన్నది తెలంగాణా చరిత్రలోనే మొదటిసారి. తెలంగాణా మొత్తంమీద సుమారు 370 మార్కెట్ కమిటీలుంటాయి. వీటిల్లో ఎంతమందిని ఇప్పటికే ఛైర్మన్లుగా నియమించారో, ఇంకెంతమందిని నియమించబోతున్నారో తెలీదు. ఏదేమైనా నియోజకవర్గంలోని మూడు మార్కెట్ కమిటీల ఛైర్మన్ల నియామకంలో కొత్త ఒరవడికి శ్రీకారంచుట్టిన ఎంఎల్ఏ తోట లక్ష్మీకాంతరావును రేవంత్ రెడ్డి(Revanth reddy)తో పాటు మంత్రులు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News