నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదు: రేవంత్

తెలంగాణలో చిట్టచివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని భరోసా ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-08-15 06:54 GMT

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదంటూ ఆంధ్రప్రదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బనకచర్ల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే గోల్కొండలో సీఎం రేవంత్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు తమ పాలనలో అన్యాయం జరగనివ్వమని చెప్పారు. ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే తమ లక్ష్యమని, అందుకోసం ఎంతదూరమైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటాను ఎలాగైనా దక్కించుకుంటామని చెప్పారు. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు నీరు అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హాయంలో తెలంగాణకు నీటి పరంగా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

‘‘రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు. అది కూలిపోయింది. కానీ మా ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుంది. ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. తెలంగాణలోని చిట్టచివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం. హైదరాబాద్ బ్రాండింగ్‌ను పెంచే చర్యలు చేపట్టాం. యువతను మద్దపదార్థాలకు బానిసలు కాకుండా కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 20 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్‌ వరదకు పరిష్కారం లభిస్తుంది. త్వరలో వరంగల్, ఆదిలాబాద్‌కు కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయి. అదే విధంగా అతి త్వరలో గ్రూప్-1, 2, 3 నియామకాలు పూర్తి చేస్తాం’’ అని పేర్కొన్నారు.

సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి: చంద్రబాబు

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యాలు చేశారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకుంటే.. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని చెప్పడం ద్వారా బనకచర్ల విషయంలో ప్రభుత్వ విధానాన్ని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద వచ్చినప్పుడు కిందకు వదిలేస్తున్న వాళ్లు.. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం, బీఆర్‌ఎస్‌ పార్టీ బనకచర్ల విషయంలో చేస్తున్న వాదనల నేపథ్యంలో ఏపీ వాదనను.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేదికగా మరోసారి స్పష్టం చేయడం ఆసక్తి పరిణామంగా నిలిచింది. హంద్రీ–నీవా కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పని చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూనే.. ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Tags:    

Similar News