నల్లమల అడవుల్లో పులి గెలిచింది
ఏది ఏమయినా అమరాబాద్ పులుల అభయారణ్యంలో పులుల ప్రశాంతతకే ప్రాముఖ్యం ఇచ్చి లొద్ది మల్లన్న గుడికి సాగే ఏకాదశి యాత్రను అధికారులు నిషేధించారు.
నల్లమల అడవుల్లో పులి గెలిచింది. మనుషుల నుంచి ఎంత వత్తిడి వచ్చినా సరే లెక్క చేయకుండా పులి ప్రశాంతకే తెలంగాణ అటవీ శాఖ అధికారులు ప్రాముఖ్యం ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే ఈ ఏడాది పులుల అభయారణ్యం గుండా వెళ్లి లొద్ది మల్లన్న ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అంక్షలు విధించారు. సాధారణంగా ఈ రోజు తొలి ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే, ఇంత మంది ఒక్క సారి అడవుల్లోకి ప్రవేశిస్తే పులి ప్రశాంత భగ్నమవుతుంది, అందువల ఆ పని చేయలేమని అధికారులు భక్తులకు చెప్పేశారు. మూడు రోజుల పాటు భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు, పూజలు చేసేందుకు అనుమతించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ రాసిన లేఖను అధికారులు తిరస్కరించారు. ఇలాగే విశ్వహిందూ పరిషత్ కూడా ఇలాంటి విజ్ఞప్తినే చేసింది. అయితే, అధికారలు సున్నితంగా ఈ విజ్ఞప్తులను తిరస్కరించారు.
లొద్ది మల్లన్న క్షేత్రం ఎక్కుడుంది?
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డ మీద మన్ననూరు చెక్ పోస్టు సమీపాన ఉన్న నల్లమల అడవుల్లో ఒక మారుమూల లొద్ది మల్లన్న గుడి ఉంది. పాతమహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేట నుంచి మన్ననూర్ చెక్ పోస్టు ౩౦ కి. మీదూరం. హైదరాబాద్ నుంచి 152 కి. మీ. మహబూబ్ నగర్ నుంచి 115 కి.మీ. శ్రీశైలం నుంచి 62 కి.మీ.
అక్కడ బుధవారం నాడు అంటే జూలై 17న తొలి ఏకాదశి ఉత్సవాలు జరుగాల్సి ఉంది. గతంలో ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలను ఒక రోజు కోసం అనుమతించే వారు. వీళ్లంతా ఊరికే దర్శనం చేసుకునే వెళ్లే వాళ్లు కాదు. అది అడవిని మర్చిపోయి, అది పులల అభయారణ్యం అనే సంగతి మర్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే వాళ్లు. తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచులను అక్కడే పడేసేవాళ్లు. చెత్తా చెదారంతో ఆ ప్రాంతాన్ని పాడు చేసేవాళ్లు. అడవిలో కూడా మనుషుల్లా ప్రవర్తించేవాళ్లు. తాము పులుల ఇంటికొచ్చినపుడు మర్యాదగా ఉండాలన్న జ్ఞానం ప్రదర్శించే వాళ్లు కాదు. దీనితో అడవిలో ప్రశాంతత భగ్నమయ్యేది. అందుకే ఇక ముందు బయటి నుంచి వచ్చే భక్తులను అనుమతించరాని అధికారులు నిర్ణయించారు.
అయితే, గుడిలో పూజచేసేందుకు అడవుల్లో నివసించే చెంచులను కొద్దిమందిని మాత్రం అనుమతిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజినల్ అధికారి రోహిత్ గోపిడి 'తెలంగాణ టుడే’ కి చెప్పారు.
ఇది పులుల సంపర్కకాలం
ఈ జనాల రాక పట్ల అధికారులు ఆందోళన చెందేందుకు కారణం, ఇది పులల సంపర్కకాలం. వాటిని సంపర్క అవకాశాలను దెబ్బతీసే ఏ చర్యనూ తీసుకోరాదు. ఈ అటవీ ప్రాంతం అమరాబాద్ పులుల అభయారణ్యం కిందకు వస్తుంది. పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతూ ఉంది. పండగ, పూజలు అంటూ వేలాది ప్రజలు ఈ అభయారణ్యంలోకి ప్రవేశించి ఉత్సవం చేసుకుంటే చాలా అలజడి ఏర్పడుతుంది. ఇది పులులను బెదరగొడతుంది. అన్నింటికంటే ముఖ్యంగా పులుల సంపర్కావకాశాలను దెబ్బతీస్తుంది,” అని రోహిత్ గోపిడి చెప్పారు.
కొద్ది రోజుల కిందట ఏం జరిగిందంటే...
ఈ పర్యాటకులు అడవిలో ఎంత అలజడి సృష్టించారో ఆయన వివరించారు. ఈ గుడిని సందర్శించేందుకు సూదూర ప్రాంతాలనుంచి ప్రజలు వస్తారు. వాళ్లు రాత్రి అడవిలోనే బస చేస్తారు. ఇక్కడ దావత్ చేసుకుంటారు. మాంసాహారం భుజిస్తారు. కొద్ది రోజుల కిందట ఒక బృందం ఏకంగా డిజె సాయంతో మ్యూజిక్ ప్రోగ్రాం కూడా పెట్టింది. మరికొందరైతే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వదిలిపెట్టి వెళ్లారు. ఇది అడవిలో బాగా కాలుష్యాన్ని సృష్టించింది.
“ఈ కార్యకలాపాలన్నీ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటి నియమాలకు వ్యతిరేకం. అందుకే ఈ ఉత్సవాలను, బయటి ప్రాంతాల వారిని అనుమతించడం నిషేధించాం. అయితే, ప్రజలను అనుమతెస్తున్నట్లు సోషలమీడియాలో వాట్సాప్ గ్రూప్లో తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు. అది నిజం కాదు,” అని ఆయన చెప్పారు.