హైదరాబాద్ పక్కన అంతా చూస్తుండగానే ఒక చెరువును మింగేశారు...

హైదరాబాద్ నగర శివార్లలోని బమ్ రుక్ నాథ్ చెరువు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నాడు మంచినీటిని అందించిన ఈ సరస్సు కబ్జాపై లుబ్నా సర్వత్ పోరాడుతున్నారు.

Update: 2024-04-08 03:12 GMT
bam ruknud dowlah

అది 1770వ సంవత్సరం...అసఫ్ జాహీ 2కు చెందిన నాటి రాజు నవాబ్ మీర్ మూసా ఖాన్ మంచినీటి కోసం బమ్ రుకుండ్ దౌలా పేరిట రిజర్వాయర్ నిర్మించారు. ఈ చెరువు నీటిని కుతుబ్ షాహీ పరిపాలనలోనూ 1922వ సంవత్సరం దాకా అసఫియా రాజులతో పాటు స్థానిక ప్రజలు తాగేవారని సాలార్జంగ్ మ్యూజియంలోని పరిశోధక గ్రంథాలయం చరిత్ర రికార్డులే చెబుతున్నాయి. నాటి హైదరాబాద్ రాజు ఢిల్లీ, సిమ్లాకు వెళ్లేటపుడు తాగేందుకు ఈ చెరువు నీటినే వెంట తీసుకువెళ్లేవారు.


పదేళ్లలో చెరువు అంతర్ధానం
మంచినీటి చెరువును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పర్యవరణవేత్తలు, సమాచారహక్కుచట్టం కార్యకర్తలు తీసుకువచ్చిన ఒత్తిడితో కదిలిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ 2014 ఫిబ్రవరిలో సర్వే నిర్వహించింది. నాటి సర్వేలో బమ్ రుకుండ్ దౌలా చెరువు ఎఫ్ టీఎల్ సరిహద్దును నిర్ణయించారు. 2014 ఫిబ్రవరి 28వతేదీన 17 ఎకరాల చెరువుకు ఎఫ్ టీఎల్ పిల్లర్స్ వేశారు. చెరువు సరిహద్దులు నిర్ణయించాక కూడా కొందరు బడా కబ్జాదారులు చెరువులో మట్టి నింపి చెరువును కబ్జా చేస్తుండటంతో నాడు సామాజికవేత్త అయిన డాక్టర్ లుబ్నా సర్వత్ 2018వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ముందు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు కబ్జాపై నివేదిక సమర్పించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,ఈ కబ్జాలోమున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను బాధ్యుడిని చేస్తామని హెచ్చరించింది.

బమ్ రుకుండ్ దౌలా చెరువు స్థలంలో సర్వే చేస్తున్న ఎంపీ అసద్, మున్సిపల్ అధికారులు


 సర్వే చేసినా, కబ్జాపై చర్యలేవి?

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశంతో 2019వ సంవత్సరం జులై 14వతేదీన తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్ఎంసీ అధికారులు దానకిషోర్, హరిచందన రంగంలోకి దిగి సర్వే చేసి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణాలు వెలిశాయని గుర్తించారు. చెరువు స్థలం కబ్జాదారుల వల్ల కుచించుకు పోయింది. ఈ కేసు విచారణ బాధ్యతను ఎన్జీటీ చెన్నై విభాగానికి 2022లో బదిలీ చేసింది. ఈ చెరువు కబ్జాపై, కాలుష్యంపై చెన్నై ఎన్జీటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ ఉన్నతాధికారులు సర్వే చేసినా కబ్జా అయిన చెరువు పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కబ్జాదారుల కబంధ హస్తాల్లోనే చెరువు చిక్కుకుంది.

హైకోర్టులో లూబ్నా పిటిషన్
బమ్ రుకుండ్ దౌలా చెరవును కబ్జాల బారి నుంచి కాపాడాలని కోరుతూ లూబ్నా సర్వత్ 2022 వ సంవత్సరంలో రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీన కేసు విచారణ చేపడతామని ప్రకటించింది. కానీ హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టకుండానే ఈ ఏడాది జులైకు వాయిదా వేసింది. చెరువు పూర్తిగా కబ్జా అయిందని దీనిపై సత్వర విచారణ జరపాలని లూబ్నా సర్వత్ ఎన్జీటీ బెంచ్ ను కోరారు. ఈ కేసు హైకోర్టులో పెండింగులో ఉందని ఎన్జీటీ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో చెరువు స్థలంలో మట్టి నింపుతున్న వీడియోను పోలీసులు, మున్సిపల్ అధికారులు, మంత్రులకు ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారు.

బమ్ రుకుండ్ దౌలా చెరువులో మట్టి నింపుతూ కబ్జా చేస్తున్న చిత్రం


 శాటిలైట్ గూగుల్ ఎర్త్ చిత్రంలో వెలుగుచూసిన కబ్జా

బమ్ రుకుండ్ దౌలాచెరువు 2935 ఐడీ నంబరుతో శాటిలైట్ గూగుల్ ఎర్త్ చిత్రంలో వెలుగుచూసింది. ఈ చెరువు కబ్జాపై ప్రజలు, పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పలు ఫిర్యాదులు చేసినా,2018వ సంవత్సరం నుంచి చెరువు పరిరక్షణ కోసం పోరాడుతున్నా ఈ చెరువును పూర్తిగా మట్టితో నింపి కబ్జా చేశారు. ఈ విషయం గూగుల్ ఎర్త్ చిత్రంలోనూ వెలుగుచూసింది.

బమ్ రుకుండ్ దౌలా చెరువు...శాటిలైట్ చిత్రం


 బమ్ బచావో టీం డిమాండ్లు ఇవీ

బమ్ రుకుండ్ దౌలా చెరువులో కబ్జాలను వెంటనే తొలగించాలని డాక్టర్ లుబ్నా సర్వత్ డిమాండ్ చేశారు. దీనిపై లూబ్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయడంతో పాటు దీని పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.ఈ చెరువు శిఖంలో నిర్మించిన భవనాలను వెంటనే కూల్చివేయాలని,పోలీసు అకాడమీ నుంచి బమ్ రుక్ దౌలా చెరువు వైపు ఉన్న కాల్వను పునరుద్ధరించాలని లూబ్నాతోపాటు పలువురు పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు డిమాండ్ చేశారు.

సేవ్ బమ్ రుకుండ్ దౌలా చెరువు

హైదరాబాద్ నగరానికి చెందిన సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు కలిసి  బమ్ బచావో బమ్ రుకుండ్ దౌలా చెరువును పరిరక్షించండి అనే నినాదంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు, న్యాయవాది సయ్యద్ తారిఖ్ ఖాద్రి, పర్యావరణ వేత్త ఫారూఖ్ హుసేన్, హైదరాబాద్ యునైటెడ్ సిటిజన్స్ ఫోరం జాతీయ అధ్యక్షుడు మక్బూల్ మతీన్. మానవహక్కుల యాక్టివిస్టు ఖుడ్సియా తబుస్సుమ్, వాటర్ ప్రొఫెషనల్ డాక్టర్ జస్వీన్ జైరత్ డిమాండ్ ఉన్నారు. ఈ చెరువుల కబ్జా వల్ల మంచినీటి లభ్యత తగ్గిపోవడంతోపాటు కాలుష్యం పెరుగుతోందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని డాక్టర్ లుబ్నా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ చెరువు పరిరక్షణ కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డాక్టర్ లుబ్నా చెప్పారు.











Tags:    

Similar News