‘సింగరేణి కార్మికులకు రూ.లక్షల నష్టం’
తమది దగా ప్రభుత్వం అని రేవంత్ మరోసారి నిరూపించుకున్నారన్న కవిత.
సింగరేణి కార్మికుల దసరా బోనస్ విషయంలో కాంగ్రెస్ దగా చేస్తోందంటూ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సింగరేణి లాభాల్లో 34శాతం ఆదాయాన్ని కార్మికులకు పంచుతున్నామని చెప్పిన ప్రభుత్వం.. మొత్తం లాభాల నుంచి పంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి లాభాల నుంచి కార్మికులకు వాటా అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పన్నిన కుట్ర వల్ల ఒక్కో సింగరేణి కార్మికుడు రూ.లక్ష రూపాయల వరకు నష్టపోతారని అన్నారు కవిత. శ్రీరాంపూర్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగానే దసరా పేరు చెప్పి ఇస్తున్న బోనసుల్లో కూడా కాంగ్రెస్ దగా చేస్తుందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. సింగరేణిని నష్టాల బాట పట్టించేలా కుట్ర జరుగుతోందన్నారు.
‘‘2024-25 సంవత్సరానికి 69.01 MT బొగ్గు ఉత్పత్తి చేయడంతో సింగరేణికి రూ.6 వేల కోట్ల నికర లాభాలు వస్తాయని చెప్పారు. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 34 శాతం వాటా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఈ లెక్కన సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ రూపేణా 2,040 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏవేవో సాకులు చెప్పి కార్మికులకు ఇచ్చే లాభాల బోనస్ ను రూ.819 కోట్లకు తగ్గించింది. రూ.2,040 కోట్లు చెల్లించాల్సిన స్థానంలో రూ.819 కోట్లు మాత్రమే ఇస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చే బోనస్ శాతం ఎంతో అర్థం చేసుకోవచ్చు. • సంస్థ విస్తరణ మంచిదే కానీ కార్మికుల శ్రమను దోపిడీ చేయడం ఏమాత్రం సరికాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక వ్యతిరేకమే అన్నది ఈ చర్యతో స్పష్టం అయ్యింది. కార్మికుల సొమ్మును పక్కదారి పట్టిస్తూ సంస్థ అభివృద్ధి పేరిట వందలు, వేల కోట్లను దోచుకుంటున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది’’ అని డిమాండ్ చేశారు.
బకాయిలు చెల్లించండి..
‘‘సింగరేణి సంస్థకు పెట్టిన రూ.42వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. సింగరేణి అంటే నాకెంత ప్రాణమో అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు నుంచి సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నా. మనకు కరువులో అన్నం పెట్టిన సంస్థ సింగరేణి. ఆంధ్ర పాలనలో మనకు వచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే.. అవి సింగరేణివే. తెలంగాణ వచ్చాకే డిపెండెంట్ ఉద్యగాలను తిరిగి సాధించుకున్నాం. సింగరేణి సంస్థకు ఈ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల బకాయిలు పెట్టింది. సింగరేణిలో గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదు. కానీ కర్ణాటక లో ఒక గని, మరోచోట రాగి గనిని తీసుకున్నారు. వాటిని తవ్వేందుకు డబ్బులు లేవంటూ ఎల్ఐసీని రూ. 3 వేల కోట్లు అప్పు అడుగుతున్నారు’’ అని మండిపడ్డారు.
కార్మికులు బిచ్చం వేశారా.. సీఎం..
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి తగ్గించుకోవాలి. అప్పుడు అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా అంటూ వారికి సీఎం బిచ్చం వేశారా? లాభాల్లో అభివృద్ధి, పనుల వాటా తీసేసి మిగిలిన వాటిలో వాటా ఇవ్వడం ఏంటి? మొత్తం గ్రాస్ లాభాల నుంచి కార్మికులకు బోనస్ ఇవ్వాలి. సీఎం చర్యల వల్ల ఒక్కో కార్మికుడు రూ.లక్ష వరకు నష్టపోయారు. సింగరేణి విషయంలో రాజకీయ జోక్యం వద్దని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ నాయకులే గెలిచారు. కార్మికులకు మంచి చేయకపోగా.. రౌడీ యిజం చేస్తున్నారు’’ అని అన్నారు.