పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంప్రదాయ ఆదివాసీ ఢోలి కళాకారుడు సకిని రామచంద్రయ్య (61) ఆదివారం కన్నుమూశారు.

Update: 2024-06-23 12:21 GMT

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంప్రదాయ ఆదివాసీ ఢోలి కళాకారుడు సకిని రామచంద్రయ్య (61) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జిల్లాలోని మణుగూరు మండలం కూనవరంలోని తన ఇంట్లో మృతి చెందారు. ఆదివాసీ కళారూపాలను పరిరక్షించడంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2022లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.


సమ్మక్క సారలమ్మ పురాణాన్ని చెప్పగలిగిన ఏకైక కోయ కళాకారుడు రామచంద్రయ్య. కంచు మేళం, కంచు తాళంతో ఆదివాసీ తెగల కథలు చెప్పే చిట్టచివరి కళాకారుడిగా ఆయన గుర్తింపు పొందారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అధికారిక ఆహ్వానితుడిగా ఉన్నారు. సమ్మక్క సారలమ్మతో పాటు గిరికామరాజు, పగిడిద్ద రాజు, రామరాజు, గాదిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సద్దులమ్మ మొదలైన ఆదివాసీ యోధుల కథలను ఆయన చెప్పేవారు.


సాంప్రదాయక కళారూపాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు సకిని రామచంద్రయ్య. పన్నెండేళ్ల వయసులోనే ‘ఢోలి’ కళారూపంపై మక్కువ పెంచుకున్నాడు. తెలుగు, కోయ భాషల్లో కథలు చెప్పడంలో పట్టు సాధించారు. రామచంద్రయ్య నిరక్షరాస్యుడైనప్పటికీ ఆదివాసీ తెగలు, కులమతాలు, మనుషుల పుట్టుక చరిత్రను వివరిస్తూ తన పాటలు, కథల ద్వారా కోయల చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ లలో వేలాది ప్రదర్శనలు అందించి శ్రావ్యమైన స్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయనకి పద్మశ్రీ లభించిన తర్వాత, ఢోలి కళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


ప్రభుత్వ సాయం అందిందా..?

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ సకిని రామచంద్రయ్య పరిస్థితి తనని కలచివేసిందని, కళాకారుడిగా ఉంటామని ఆర్థిక సాయం ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 426 గజాల ఇంటిస్థలం ఇస్తామని మాట ఇచ్చింది. అదనంగా కోటి రూపాయల నజరానా ప్రకటించింది. కానీ ఆయనకు గత రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నజరానా, ఇంటి స్థలం నేటికి అందించలేదని సకిని రాంచంద్రయ్య సన్నిహితులు చెబుతున్నారు. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు అనారోగ్యం బారినపడి మంచంపట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య నేడు కన్నుమూశారు. 

జానపద కళకు తీరని లోటు..

పద్మశ్రీ అవార్డు గ్రహిత కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. "వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి తన డోలు వాయిద్యంతో దేశవ్యాప్తంగా కీర్తిని సాధించి పెట్టారు. వారి అకాల మరణం పట్ల వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను" అని భట్టి విక్రమార్క రామచంద్రయ్య మృతిపై సంతాపం తెలియజేశారు. 

Tags:    

Similar News