Pakhal Lake | ఎకో సెన్సిటివ్ జోన్‌గా పాఖాల,అభయారణ్యానికి మహర్దశ
వరంగల్ లోని పాఖాల సరస్సు, వన్యప్రాణుల అభయారణ్యానికి మహర్దశ పట్టనుంది.తాజాగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్విశాఖ పాఖాలను ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించింది.;
By : Saleem Shaik
Update: 2025-01-31 12:36 GMT
చుట్టూ ఎతైన కొండలు...నలువైపులా పచ్చని చెట్లు...రంగురంగుల పక్షుల కిలకిలరావాల మధ్య ఉన్న పాఖాల సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట పట్టణానికి 12 కిలోమీటర్ల చేరువలో ఉన్న పాఖాల సరస్సు, వన్యప్రాణుల అభయారణ్యం పర్యాటకులకు కొత్త అందాలను సంతరించుకుంటోంది.
పాఖాల ఇక ఎకో సెన్సిటివ్ జోన్
ఇన్నాళ్లు పాఖాల వన్యప్రాణుల అభయారణ్యంగా మాత్రమే ఉన్న పాఖాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ పరిరక్షణ 1986 రూల్ 5 సబ్ సెక్షన్ 3 ప్రకారం పాఖాల చుట్టూ ఉన్న ప్రాంతాలను పర్యావరణ సున్నితమైన జోన్ గా ప్రకటిస్తూ జనవరి 24వతేదీన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ మేరకు భారత గెజిట్ లోనూ నోటిఫికేషన్ ను ప్రచురించింది. వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న పాఖాల వన్యప్రాణుల అభయారణ్యాన్ని పర్యావరణ పరంగా పరిరక్షించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీని కూడా నియమించింది.
పాఖాల పర్యవేక్షణ కమిటీ
తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతి కుమారి అధ్యక్షతన తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పర్యావరణ శాఖ కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి, తెలంగాణ గ్రామీణాభివృద్ధ శాఖ కార్యదర్శి ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాఖాల పర్యావరణ పరిరక్షణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ప్రకృతి పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ ప్రతినిధి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు, విశ్వవిద్యాలయ జీవావరణ శాస్త్ర అధ్యాపకుడు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు సభ్యుడు, అటవీశాఖ డీఎఫ్ఓ, పర్యావరణ శాఖ డైరెక్టర్ లు ఈ పాఖాల పర్యావరణ పర్యవేక్షణ కమిటీలో సభ్యులుగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.
పాఖాల ప్రాంతంలో క్వారీలు ఇక బంద్
పాఖాల అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం బయటి ప్రాంతాలను కూడా ఎకో సెన్సిటివ్ జోన్ గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ములుగు, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పాఖాల చుట్టూ బయటి ప్రాంతాల్లోనూ క్వారీయింగ్ లను మూసివేయనున్నారు. వాగుల్లో ఇసుకను కూడా తీసేందుకు అనుమతించరు. పాఖాలతతో పాటు వన్యప్రాణుల అభయారణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఎకోటూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో పాఖాల ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు, డ్యామ్ లు, కోళ్ల ఫారాలు కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. కొండలు, గుట్టల వద్ద రాళ్లు కొట్టి కట్టుబడికి తీసుకువెళ్లేందుకు అనుమతించరు. ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
అభయారణ్యంలో వన్యప్రాణులెన్నో...
1213వ సంవత్సరంలో అప్పటి కాకతీయ రాజు గణపతి దోవా పాఖాల సరస్సును తవ్వించారు. కృష్ణాకు ఉపనదిపై పాఖాల సరస్సు నిర్మించారు. గలగల పారుతూ కనిపించే నీళ్లు, జలాశయం మీదుగా వీచే గాలి, పక్షుల కిలకిల రావాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వన్యప్రాణుల అభయారణ్యం చెంత ఉన్న పాఖాల సరస్సు 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చిరుతపులి, అడవి పందులు, హైనాలు,కొండ గొర్రెలు,తోడేళ్లు, అడవి పిల్లులు, ఎలుగుబంట్లు, జింకలు, పాములు, మొసళ్లు, వివిధ రకాల పక్షలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. పాఖాల సరస్సులో ఏడాది పొడవునా పర్యాటకులు వస్తుంటారు.
మూలికలు, వివిధ రకాల పక్షులు
ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించేలా వివిధ రకాల మూలికలు, ఔషధ గుణాలున్న చెట్లతో పాఖాల అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో ఎంబ్లికా అఫిసినాలిస్, కార్డిఫోలియా, బాంబాక్స్ సీబా, క్లిస్టాంథస్ కొల్లినస్, ఫ్లాకోర్టియా ఇండికా, బ్రిడెలియా రెటుసా, డాల్బెర్జియా లాటిఫోలియా, కోక్లోస్పెర్ముమ్ రెలిజియోసమ్, గరుగా పిన్నాటా వంటి ఆకురాల్చే వృక్షాలున్నాయి.
పాఖాలలో పర్యాటకాభివృద్ధికి చర్యలు
పాఖాల అభయారణ్యంలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు 56 లక్షల రూపాయలతో పలు పనులు చేపడుతున్నామని నర్సంపేట ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ రవికిరణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాఖాల సరస్సు చెంత ఎకరం స్థలంలో బట్టర్ ఫ్లై గార్డెన్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పాఖాల సరస్సులో పర్యాటకుల ఆహ్లాదం కోసం రెండు బోట్లను సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటికే పాఖాల సరస్సులో బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. పాఖాల అభయారణాన్ని సందర్శించే వారి కోసం నైట్ క్యాంపింగ్, ట్రెక్కింగ్ , వన్యప్రాణులను వీక్షించేందుకు సఫారీని కూడా సిద్ధం చేస్తున్నామని ఫారెస్ట్ అధికారి రవికిరణ్ వివరించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా కొత్త అట్రాక్షన్స్ తో పాఖాల సరస్సు చెంత పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.