పిఠాపురంపై పట్టుకు ప్రవన్ పక్కా ప్లాన్..!
భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఎత్తుగడలు. వైసీపీ, టీడీపీలకు ఇబ్బందులు తప్పవా? ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మకు చెక్.;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను గెలిపించిన పిఠాపురంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న నేతలను తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. రాని వారికి తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కొన్నాళ్లుగా జరుగుతున్న, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.
పదకొండేళ్ల క్రితమే జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ కు అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం ఇప్పటివరకు రాలేదు. 2014 లో పార్టీ ఆవిర్భవించినా ఆ ఏడాది ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం స్థానాల నుంచి బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. దీంతో సాక్షాత్తూ పార్టీ అధినేతనై ఉండి కూడా గెలవలేక పోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయడం కూడా కష్టతరమైంది. ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జనసేన జతకట్టి కూటమిగా ఏర్పడింది.
పవన్ అసెంబ్లీకి పోటీ చేయడంపై చాలా చోట్ల వెతికి చివరకు తన సామాజికవర్గీయులు అధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అయితే అప్పటికే పిఠాపురం టీడీపీ సీటును ఖాయం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మను కాదని కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. అప్పట్లో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి బుజ్జగించారు. పవన్‌ను గెలిపించాలని కోరారు. దీంతో వర్మ పవన్ గెలుపునకు క్రుషి చేశారు. పిఠాపురం ఓటర్లు ఆ ఎన్నికల్లో 70 వేలకు పైగా ఓట్లతో పవన్‌ను గెలిపించారు.
ఇప్పడేం జరుగుతోంది?
సార్వత్రిక ఎన్నికలు జరిగాక పిఠాపురంలో పరిస్థితులు మలుపులు తిరుగుతున్నాయి. రానురాను వర్మ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. తొలిదశలో ఎమ్మెల్సీ ఖాయమనుకున్న వర్మకు ఆశాభంగమే ఎదురైంది. ఇక రెండో విడతలోనైనా దక్కుతుందనుకుంటే ఈసారీ టీడీపీ అధినేత మొండి చేయే చూపారు. పైగా తనకు దక్కాల్సిన ఎమ్మెల్సీ సీటు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించారు. ఇలా ఎమ్మల్యే సీటు పవన్ కల్యాణ్, ఎమ్మల్సీ సీటు నాగబాబు (అన్నదమ్ములిద్దరూ) తన్నుకు పోయారన్న ఆవేదన వర్మతో పాటు ఆయన వర్గీయుల్లో బలంగా ఉంది.
ఇంతలో చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు వర్మనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపునకు ఆయన చరిష్మా, స్థానిక ఓటర్లే తప్ప మరెవరూ కాదని, అలా కాకుండా తన పాత్ర ఉందని ఇంకా ఎవరైనా అనుకుంటే వారి *ఖర్మ* అంటూ నాగబాబు సభలో వ్యాఖ్యానించారు. పవన్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వర్మనుద్దేశించి హేళనగా మాట్లాడడం తగదని వర్మ వర్గీయులు మండి పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే మున్ముందు పిఠాపురంలో జనసేన పట్టు బిగించి పవన్ కల్యాణ్ తన అడ్డాగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే చేస్తున్నారనిపిస్తోందని పిఠాపురానికి చెందిన టీడీపీ అభిమాని కె.రామచంద్రరావు *ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్* ప్రతినిధితో చెప్పారు.
వర్మకు నియోజకవర్గంలో బలమైన వర్గం ఉందని, ఆయనకు ప్రాధాన్యత తగ్గించాలనుకుంటే టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మరో టీడీపీ సీనియర్ కార్యకర్త ఎస్.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. పిఠాపురంలో తన బలాన్ని పెంచుకోవడం ద్వారా పట్టు సాధిస్తే భవిష్యత్తులో తన గెలుపు సునాయాసమవుతుందన్నది పవన్ కల్యాణ్ యోచనగా ఉందని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరో చోట వెతుక్కునే అవసరం రాకుండా పిఠాపురంలో జనసేన క్యాడరును బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆ నియోజకవర్గంలోని జనసైనికులు చెప్పుకుంటున్నారు.
జయకేతనం సక్సెస్‌తో ముందుకు..
పిఠాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనం లక్షల్లో పోటెత్తారు. ఊహించిన దానికంటే అభిమానుల రాక పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పట్టు వ్యూహానికి బాగా కలిసొచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో అభివ్రుద్ధి పనులు చేపట్టి ప్రజల మన్ననలను చూరగొనే ప్రయత్నం కూడా జరుగుతుందని వీరు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అక్కడ జనసైనికులతో పాటు టీడీపీ నుంచి కూడా సానుకూలత సాధించడం తేలికవుతుందని అంటున్నారు. ఇప్పటికే నాగబాబు మాటల తూటాలతో వర్మపై పరోక్షంగా తన వ్యతిరేకతను వెల్లడించారు. మరోవైపు అభివ్రుద్ధి వ్యూహంతో ముందుకెళ్లడం ద్వారా వర్మకు చెక్ పెట్టవచ్చన్నది జనసేన పెద్దల ఆలోచనగా ఉందన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది.
వర్మపై ఎందుకింత పగ?
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన అధినేత పవన్, ఆయన సోదరుడు నాగబాబుకు ఎందుకంత కోపం అన్న దానిపై తలోరకంగా చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంలో వర్మ.. నాగబాబుకు చికాకు తెప్పించారని, అయితే అప్పట్లో పవన్ కల్యాణ్ గెలుపుపై ప్రభావం చూపుతుందన్న భావనతో వర్మ చెప్పినట్టే అయిష్టంగా చేశారని అంటున్నారు. ఆ తర్వాత పవన్ బొటాబొటీగా కాకుండా భారీ మెజారిటీ (71 వేల ఓట్ల)తో గెలవడం, ఆపై ఉప ముఖ్యమంత్రి కావడం వంటివి జరిగిపోయాయి. దీంతో పవర్ చేతికి వచ్చాక నాటి వర్మ వైఖరిని గుర్తు చేసుకుని చెక్ పెట్టేందుకే పావులు కదుపుతున్నారని చెప్పుకుంటున్నారు.
మున్ముందు టీడీపీకి పట్టులేకుండా..
పిఠాపురంలో వర్మకు బలమైన క్యాడరు ఉంది. టీడీపీలో మెజారిటీ శ్రేణులు ఆయన వెంటే ఉన్నారు. దీంతో అక్కడ ఏకైక బలమైన నాయకుడిగా వర్మే కొనసాగుతున్నారు. మరోవైపు వర్మపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంత సానుకూలంగా లేదని, అందువల్లే ఆయనకిచ్చిన ఎమ్మెల్సీ హామీ కూడా నెరవేర్చలేదని ఆ నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే తప్ప నోరెత్తలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని పిఠాపురం నియోజకవర్గంలో పట్టు బిగించి ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంతో అధినేత పవన్, ఆయన సోదరుడు నాగబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కల్యాణ్ అడ్డాగా అభివర్ణించారు.
వైసీపీకీ ఎదురు దెబ్బలు..
మరోవైపు వైసీపీని బలహీన పరచేందుకు కూడా పవన్ కల్యాణ్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. కాపు సమాజికవర్గానికే చెందిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పిఠాపురం సీటు ఆశించిన ఆయన్ను కాదని వంగా గీతకు ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన వైసీపీ అధినేత జగన్ తీరుపై అసంత్రుప్తితో ఉన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి అనుచరులతో కలిసి జనసేన తీర్థం పుచ్చకున్నారు. దీంతో ఇప్పడు ఆ నియోజకవర్గం బాధ్యతలు వంగా గీత ఒక్కరే చూస్తున్నారు. ఇటీవల గీత కూడా జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె వర్గీయులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇలా ఇప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పట్టు కోసం ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు.