జనసైనికులతో సత్తా చాటిన పవన్!
టీడీపీ తనవల్లే నిలబడిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. జయకేతనం సభకు పొరుగు రాష్ట్రాల నుంచీ పోటెత్తిన జనం.;
ఒక్క సభ.. ఎన్నో చర్చలకు తావిచ్చింది. మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన జనసేన.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైంది. ఏపీలో పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు సాధించి 100 శాతం స్ట్రయిక్ రేటుతో సంచలనం స్రుష్టించింది. దీంతో కూటమి పాలనలో జనసేన అత్యంత కీలకంగా మారింది. అప్పట్నుంచి ఎలాంటి విజయోత్సవాలను నిర్వహించని ఆ పార్టీ.. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల తర్వాత పార్టీ ఆవిర్భావ సభతో మరోసారి తన సత్తాను చాటుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరంల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి 71 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన పిఠాపురం నియోజకవర్గంలోనే పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం సరైనదిగా భావించారు. తనను గెలిపించిన గడ్డపై నుంచే తానేమిటో విపక్షానికే కాదు.. కూటమిలోని స్వపక్షాలకు కూడా చెప్పాలనుకున్నారు. ఆ దిశగా జనసైన్యాన్ని సన్నద్ధం చేశారు. పిఠాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రాడ జాతీయ రహదారి పక్కన ఉన్న విశాలమైన స్థలాన్ని ఎంచుకున్నారు. పార్టీ ఆవిర్భావ సభ పేరిట శుక్రవారం నిర్వహించిన జయకేతనం సభకు లక్షలాదిగా అభిమాన జనం పోటెత్తారు.
సభలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు, అన్ని జిల్లాల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. జనసేన ఆవిర్భవించాక జరిగిన అతి పెద్ద సభగా చిత్రాడ సభ నిలిచిపోయింది. తమ అధినేత పవన్ కల్యాణ్ కోరుకున్నది కూడా ఇదేనని, ఆయన ఆశించిన స్థాయిలో జనసందోహం వచ్చిందని జన సైనికులు సంబరంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే గత ఏడాది ఎన్నికల్లో పార్టీ విజయ దుందుభి మోగించడంతో పాటు టీడీపీకి కూడా ఊపిరి పోసిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ మంచి ఊపు మీద ఉన్నారు. తనకు ఇంత బలగం ఉందని జయకేతనం సభ ద్వారా మరోసారి నిరూపించుకోవడానికి వీలయింది.
పవన్ తన ప్రసంగంలో ఈసారి వ్యూహాత్మకంగానే కొంత ప్రసంగాన్ని చేశారు. మనం నిలబడ్డాం.. నలభయ్యేళ్ల చరిత్ర ఉన్నటీడీపీని కూడా నిలబెట్టాం.. అనే మాటలు తన వల్లే టీడీపీ మనుగడలో ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. మున్ముందు కూడా కూటమిలో తానే కీలక నేతనని, టీడీపీకి తన అవసరం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేశారు. అదే సమయంలో బీజేపీకి కూడా తన బలాన్ని చూపడం ద్వారా ఇదే సందేశాన్నిచ్చినట్టు భావిస్తున్నారు. జయకేతనం సభలో పవన్ కల్యాణ్ టీడీపీ గురించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు సభకు వచ్చిన వారు సభలోనూ, బయట కూడా పవన్ కల్యాణ్ భవిష్యత్తు సీఎం అంటూ నినాదాలు చేశారు. కానీ దీనిపై పవన్ ఎలాంటి కామెంట్లు చేయలేదు.
మజ్జిగ పంపిణీ
పంచ్‌లు లేని ప్రసంగం!
పవన్ కల్యాణ్ ప్రసంగం అంటే పంచ్‌లుంటాయని అంతా అనుకుంటారు. కానీ చిత్రాడ సభలో మాత్రం అభిమానులు, జనసైనికులు ఆశించినంతగా ఆయన పంచ్‌లు విసర్లేదు. అంతేకాదు.. ఆయన ప్రసంగం కూడా మునుపటిలా వీరిని అంతగా ఆకర్షించలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించడానికే కాస్త సమయాన్ని కేటాయించారు. తన ప్రసంగాన్ని ఎక్కడో మొదలు పెట్టి మరెక్కడికో తీసుకెళ్లారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, మతాలు, వివిధ రాష్ట్రాల అంశాలను సుదీర్ఘంగా ప్రస్తావించారు. వీటి పట్ల సభికులు ఏమంత ఆసక్తి చూపలేదు. గతంతో పోల్చుకుంటే చిత్రాడ సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినా, వీరి నుంచి పవన్ ప్రసంగానికి ఆశించిన స్థాయిలో చప్పట్లు, అరుపులు, కేకలు వినిపించలేదు.. కనిపించలేదు. అప్పుడప్పడు పవన్ తనకు తానే చేతులు పైకెత్తి చప్పట్లు చరిచినా అటు నుంచి స్పందన కనిపించలేదు.
సహనానికి పరీక్షలా..
చిత్రాడ జయకేతనం సభకు శుక్రవారం మధ్యహ్నం 12 గంటల నుంచే సభా ప్రాంగణానికి జనం రావడం మొదలు పెట్టారు. సాయంత్రం నాలుగ్గంటలకు సభ ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ సభను ఆలస్యంగా 5.15 గంటలకు ప్రారంభించిన నిర్వాహకులు తొలుత పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ మంత్రులతో మాట్లాడించారు. మైకులను అందుకున్న వీరు సుదీర్ఘంగా ప్రసంగించి మైకాసురులను తలపించారు. అధినేత పవన్ కల్యాణ్ కోసం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వీరు ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. రాత్రి 7.30 గంటలకు పవన్ వేదికపైకి వచ్చారు.
పవన్ ప్రసంగం ప్రారంభం కాకముందే అప్పటికే సహనం నశించిన వీరు తిరుగు ముఖం పట్టారు. వీరిలో చాలామంది పవన్‌ను చూడకుండానే వెనుదిరిగారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తమలాంటి వారు నిరాశ, అసహనంతో తిరిగి వెళ్తున్నామంటూ నిట్టూర్చారు. 8.50 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ 10.30 గంటల వరకు సుదీర్ఘంగా మాట్లాడారు. అంతకు ముందు ఇసుకేస్తే రాలనంతగా ఉన్న జనం ఆయన ప్రసంగించే సమయానికి బాగా పలచబడ్డారు.
పుచ్చకాయల పంపిణీ
కాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం కత్తిపూడి-కాకినాడల మధ్య సుమారు 40 కి.మీల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ రోడ్డుపై కేవలం సభకు వెళ్లే వాహనాలనే తప్ప ఆర్టీసీ బస్సులను అనుమతించలేదు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలు చేయడంతో కాకినాడ వెళ్లే, కాకినాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే చాలా ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ప్రజలను ఇలా అవస్థలు పాల్జేస్తారా? అంటూ పలువురు ప్రయాణికులు మండిపడ్డారు.
ఫుడ్ ఏర్పాట్లు భేష్..
జయకేతనం సభకు లక్షలాదిగా జనం వస్తారని నిర్వాహకులు ముందుగానే అంచనా వేశారు. మండుటెండల ద్రుష్ట్యా అందుకు తగినట్టే ఆహార ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా టన్నుల కొదీ పుచ్చకాయలను తెచ్చి వచ్చిన వారికి ముక్కలు కోసి అందించారు. తాగినన్ని మజ్జిగ, పెరుగు ప్యాకెట్లను, బిస్కెట్ ప్యాకెట్లను ఇచ్చారు.