42శాతం రిజర్వేషన్లు బీసీలకేనా..?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత పాయల్ శంకర్.;

Update: 2025-08-31 08:33 GMT

బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక అనుమానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్తున్న 42శాతం రిజర్వేషన్లు మొత్తం బీసీలకే ఇస్తారా? అని ప్రశ్నించారు. అందులో 10శాతం ముస్లింలు లేరా? అని నిలదీశారు. ఈ అంశంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 42శాతం రిజవర్వేషన్లకు జీఓ తీసుకొచ్చే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలో రిజర్వేషన్ల పరిమితి రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దానికి సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగానే బీజేపీ నేత పాయల్ శంకర్ కీలక అంవాలను లేవనెత్తారు. చెప్తున్న 42శాతం రిజర్వేషన్లు మొత్తం బీసీలకేనా? ఈ అంశంపై ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతోంది? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి ప్రభుత్వం నీళ్లు నములుతోందని, ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 6శాతానికి పెంచేలా జీవోలో ఎందుకు ఉంది? అని కూడా పాయల్ నిలదీశారు.

బీసీలంటే కాంగ్రెస్‌కు చులకనా..

రాజకీయ లబ్ధికోసం మాత్రమే కాంగ్రెస్.. బీసీ రాగం తీస్తోందని శంకర్ విమర్శించారు. అందులో భాగంగానే బీజేపీని బద్నం చేయడానికీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీలకు అరచేతిలో వైకుంఠ చూపుతూ నిలువునా మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలంటే నిజంగానే అంత ప్రేమ కాంగ్రెస్‌కు ఉంటే పార్లమెంటులో రెండు స్థానాలు కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? సీఎంల పదవులేమో మీకు.. అధ్యక్షుల పదవులు మాత్రం బీసీలకా? అని ప్రశ్నలు గుప్పించారు. కాంగ్రెస్‌లో బీసీలకు అధికారం చేపట్టే అర్హత లేదా? అని నిలదీశారు. అంతేకాకుండా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కాంగ్రెస్‌కు నచ్చడం లేదని, అందుకే రాష్ట్రంలో 15 యూనిర్వసిటీలు ఉంటే వాటిలో ఒకటి, రెండిటికి మాత్రమే బీసీలు ఛాన్స్‌లర్లుగా ఉన్నారని, అంతకుమించి అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమంలో ఆర్థిక పరమైన సమస్యలు అనేకం ఉన్నాయని, వాటిపై వెంటనే దృష్టి పెట్టి వాటిని పరిష్కరించాలని కోరారు.

అనుమానాలు నివృత్తి చేయండి..

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుంది. కానీ ఈ విషయంలో తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే రావాలని తెలిపారు. మీ చేతులో ఉన్న అధికారాన్ని పంచి పెట్టడానికి మీకు ఉన్న అభ్యతరం ఏంటి..? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చక ప్రజలకి జరిగిన మేలు ఏంటి..? బీసీలలో ప్రభుత్వానికి నమ్మకస్తులు లేరా.. మీ మంత్రి వర్గం, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఎంత మంది బీసీలకి ఇచ్చారు..? అని ప్రశ్నించారు.

42శాతం రిజర్వేషన్లు గొప్ప ఆలోచన

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది చాలా గొప్ప ఆలోచన అని పాయల్ శంకర్ మెచ్చుకున్నారు. అదే విధంగా తాము బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, బీసీల పేరుతో మతపరంగా ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించడానికి మాత్రం తాము వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు. 

Tags:    

Similar News