రేవంత్ రెడ్డి పేరిట ఫేక్ వీడియో
ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూని సైబర్ నేరగాళ్లు ఎఐ టెక్నాలజీతో..;
రూ 21వేల రూపాయలు పెట్టుబడులు పెట్టండి రెండు లక్షల రూపాయలు సంపాదించండి అని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు వైరల్ కావడంతో ఫాక్ట్ చెక్ తెలంగాణ ఆరా తీసింది.
ఇది ఫేక్ వీడియో అని తేల్చేసింది. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఫుటేజిని సైబర్ నేరగాళ్లు ఎఐ టెక్నాలజీతో ఈ ఫేక్ వీడియో సృష్టించారు. ఈ వీడియోను నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వాంటం ఎఐ వెబ్ సైట్ ను ప్రమోట్ చేస్తున్నట్టుగా నకిలీ ఎఐ జనరేటెడ్ వీడియోను చూసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ లో పోస్టు పెట్టింది.
క్వాటం ఎఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించలేదని , ప్రముఖుల వీడియోలను కొందరు నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపింది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోకూడదని పేర్కొంది. అటువంటి వాటికి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని షేర్ చేయకూడదని . ప్రభుత్వ సంక్షేమ పథకాల గూర్చి అధికారిక వెబ్ సైట్ లను వినియోగించాలని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.