వరంగల్-హన్మకొండ జిల్లాలు విలీనమవుతాయా?

కలపాల్సిందే అంటున్న ప్రజలు మేధావులు;

Update: 2025-07-29 07:29 GMT
హనుమకొండ జిల్లా పటము

ఒకే నగరం.. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా దాన్ని చీల్చి రెండు జిల్లాలుగా విభజించారు. కానీ రెండు జిల్లాల పరిపాలన మాత్రం ఒకే ప్రాంతం నుంచి జరుగుతుంది. దీనిలో ఇద్దరు కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులంతా రెండు విభాగాలుగా ఉన్నారు.

ఇదంతా చెప్పేది చారిత్రక వరంగల్, హనుమకొండ జిల్లాల గురించే. 2016 లో జరిగిన జిల్లాల పునర్విభజనలో వరంగల్ జిల్లాలను ఐదు జిల్లాలుగా అంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిగా విభజించారు.

తరువాత 2019 లో ములుగు జిల్లా ఏర్పాటుతో వరంగల్ జిల్లా ఆరు జిల్లాలుగా విభజన అయింది. మిగిలిన జిల్లాల విషయంతో పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ వరంగల్ జిల్లాను రెండుగా విభజించి హనుమకొండ గా మార్చడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వరంగల్, కాజీపేట, హనుమకొండ మూడు పట్టణాలు కలిసే ఉంటాయి. కానీ వాటి హద్దులు కచ్చితంగా నిర్ధారించడం అధికారులకు మాత్రమే సాధ్యం. ప్రజలంతా దీనిని ఒకే నగరంగా భావిస్తారు. రాంపూర్ నుంచి ఆరేపల్లి వరకూ హసన్ పర్తి నుంచి గొర్రెకుంట వరకూ సిటీ విస్తరించింది.


 


వరంగల్ అనేది మార్కెట్, వ్యాపారాలకు ప్రసిద్ది చెందగా, హనుమకొండ అధికార కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. అంటే వరంగల్ జిల్లా ప్రజలకు అవసరాలకు హనుకొండ జిల్లాకు రావాల్సిందే.
మరీ ప్రత్యేకంగా హనుమకొండ జిల్లాను ఎందుకు ఏర్పాటు చేశారు. కేవలం రాజకీయ నాయకులను సంతృప్తి పరచడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కొంతమంది నాయకుల ప్రభావం తగ్గించడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేశారన్నది వాస్తవం.
హనుమకొండలో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతాలు..
హనుమకొండ జిల్లాలో కలిపిన కొన్ని భాగాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ లాంటి మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు ఎక్కువగా హనుమకొండలో స్థిరపడ్డారు.
హనుమకొండ సీటీ కల్చర్ గా ఉంటుంది. ఇక్కడే విద్యా కేంద్రాలు ఉన్నాయి. అధికారులు, ఉన్నత వర్గాల ప్రజలు ఇక్కడ జీవించడానికి ఇష్టపడతారు. వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ది చెందింది. రద్దీ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ పరంగా మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం. అయినప్పటికీ వీటిని పట్టించుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసింది.
2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, వాటిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న దానిపై ఎటువంటి కదలిక లేకపోవడంతో దీనిపై కొంతమంది మేధావులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ అంశానికి సంబంధించి భీమదేవరపల్లి మండలం టీజాక్ అధ్యక్షుడు అయిన డ్యాగల సారయ్య ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ‘‘ వరంగల్, హనుమకొండ జిల్లాలు వేరువేరుగా ఉండటం మంచిది కాదు. వీటికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ప్రజలంతా ఒకే ప్రాంతానికి వచ్చినప్పుడూ రెండు జిల్లాలు ఎందుకుండాలి. హనుమకొండ ప్రాంతం చాలా చిన్నది. వరంగల్ కాస్త పెద్దది. దీనికి ఇద్దరు పరిపాలనా అధికారులు ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఇలా విభజించడం వల్ల ప్రజలకు కలిగిన లాభం ఏమిటీ’’ అని ప్రశ్నించారు.
పరకాల.. నర్సంపేట్ పోటీ
మొదట్లో వరంగల్ ను అర్బన్, రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసిన తరువాత అర్బన్ ప్రాంతంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. కానీ రూరల్ ప్రాంతానికి సంబంధించిన కలెక్టరేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని విషయంలో పరకాల, నర్సంపేట్ ప్రాంతాల నాయకులు మాకు కావాలంటే మాకు కావాలని ఒత్తిడి చేశారు.
కొంతమంది నాయకులు ఉద్యమాలు చేశారు. దీనితో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీనివల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన వరంగల్ అర్బన్,రూరల్ పేర్లు తీసేసీ, హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేసింది. తరువాత వరంగల్ జిల్లా కలెక్టరేట్ ను హనుమకొండలోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
‘‘వరంగల్, హనుమకొండ ప్రాంతాల ప్రజలు మానసికంగా విడిపోయారు. ఎవరి పనుల్లో వారు గడుపుతున్నారు. జిల్లాలను కలపాలని ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు, ఉద్యమాలు లేవు, ఇది కేవలం కొంతమంది మేధావులు మాత్రమే కోరుతున్నారు’’ అని సీపీఐ రాష్ట్ర నాయకులు ఆదరి శ్రీనివాస్ ఫెడరల్ తో అన్నారు. జిల్లాలపై తమ పార్టీకి ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని ఈ సందర్భంగా చెప్పారు.
హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్రం నష్టం కలుగుతోంది. ముఖ్యంగా జిల్లా స్థాయి రిక్రూట్ మెంట్ లో చేసే పంచాయతీ సెక్రటరీలు ఇతర ఉద్యోగాలలో ఇక్కడ యువతకు కావాల్సినంత అవకాశాలు లభించలేదు. అసలు చాలా తక్కువ స్థాయిలో ఖాళీలు ఉంటున్నాయి. ఇప్పుడు రెండు జిల్లాలను కలిపితే హనుమకొండ జిల్లా నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది.
‘‘రెండు జిల్లాల ఏర్పాటు అవసరం లేదు. వరంగల్, హనుమకొండ, కాజీపేట పేరుకే వేరు కానీ, అంతా కలిసి ఒకటే మహనగరం. హైదరాబాద్ తరువాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం.
ఇక్కడ పారిశ్రామిక, విద్యారంగాలు అభివృద్ది చెందాయి. త్వరలోనే ఇక్కడ ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు జిల్లాల వలన ప్రజలకు కలిగిన మేలు ఏంటో ఎవరూ చెప్పలేరు. వాటిని కలపడమే ఉత్తమం’’ అని సామాజిక ఉద్యమకారుడు కండే రమేష్ ‘ది ఫెడరల్’తో చెప్పారు.
ఏదీ ఏమైన ఇప్పుడు మరోసారి జిల్లాల పునర్విభజన అంశం చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం సిద్ధిపేట్ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్ ప్రాంతాన్ని కూడా తిరిగి కరీంనగర్ లో కలపాలని లేదా కొత్తగా హుజూరాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నియోజవర్గం ఏకంగా మూడు జిల్లాల్లో కేంద్రీకృతమయింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు జిల్లా సమావేశాలకు హనుమకొండ, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలో కేంద్రీకృతం కావడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందింస్తుందో మాత్రం ఎవరీ అంచనాలకు అందడం లేదు.  


Tags:    

Similar News