బిసీ రిజర్వేషన్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత

మీడియా కథనాలపై పిటిషన్లు వేయొద్దని హైకోర్టు అగ్రహం

Update: 2025-09-24 11:09 GMT

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. బిసీలకు రిజర్వేషన్ చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ ఇద్దరు వ్యక్తులు హైకోర్టునాశ్రయించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్‌ దాఖలు చేశారు.

బీసీలకు 42% రిజర్వేషన్లతోపాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు తెలిపారు. ఈ చర్య వల్ల ఎన్నికల ప్రక్రియను, స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50 శాతం దాటే అవకాశముందని ,ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్లను కొట్టివేసింది.రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడమే గాక పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్‌ వేశారని నిలదీసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చిందా అని ప్రశ్నించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా పిటిషన్‌ వేస్తారని నిలదీసింది. మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News