ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ణీత్ రావుకు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రణీత్ రావుకు శుక్రవారం బెయిల్ లభించింది.;

Update: 2025-02-14 08:08 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుపతన్న తర్వాత ఒకరొకొరుగా నిందితులంతా బెయిల్‌పై బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న, ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన ప్రణీత్ రావుకు శుక్రవారం బెయిల్ లభించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని A2 నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఆయన పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ఈరోజు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చారు. కాగా, ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్న దుగ్యాల ప్రణీత్‌రావు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 11న ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివారెడ్డి గైర్హాజరు కావడంతో పీపీ వాదనల కోసం విచారణను నేటికి వాయిదా వేస్తూ జడ్జీ రమాకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గత విచారణ సందర్భంగా కేసులో ప్రణీత్‌రావు ఒక్కరే జైలులో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర రావు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఇదే కేసులో ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావు మాజీ డీసీపీ ప్రభాకర్ రావు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ హైకోర్టు జనవరి 31న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని మేజిస్ట్రేట్‌కు విన్నవించారు. మరోవైపు అదనపు ఎస్పీ తిరుపతన్న కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేసులో పూర్తి వాదనలు విన్న జడ్జీ రమాకాంత్ ప్రణీత్ రావుకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు.

Tags:    

Similar News