ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు
తెలంగాణలోని భూమిలేని రైతులకు సైతం ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.;
తెలంగాణలోని భూమిలేని రైతులకు సైతం ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని రూపొందించింది. దీనిని అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ పథకం కింది రాష్ట్రంలోని భూమిలేని రైతులకు ఏడాదికి రూ.12వేలు చెల్లించాలని నిర్ణయించింది. కాగా తాజాగా ఈ పథకంపై నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భూమిలేని రైతులకు రూ.12 వేలు చెల్లించాలని పథకం రూపొందించిన ప్రభుత్వం.. రైతు కులీలకు డబ్బులు ఇవ్వడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతు కూలీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం సరికాదని వారు వివరించారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, కేవలం గ్రామాల్లోనే ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నాని అన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ నాలుగు వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతకుమారికి ఆదేశాలు జారీ చేశారు.