పుష్పను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు..

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2024-12-13 07:06 GMT

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌కు కష్టాలు మొదలైనట్లేనా..? అంటే అవునన్న మాటే వినిపిస్తుంది. అందుకు ఈరోజు ఆయనను చిక్కడిపల్లి పోలీసులు అరెస్ట్ చేయడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. బాధ్యారాహిత్యంగా పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్.. బాధ్యతారాహిత్యమే కారణమని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‌‌లో అల్లు అర్జున్, ఆయన టీం, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్‌పై 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదయింది. అల్లు అర్జున్, థియేటర్ యాజమన్య నిర్లక్ష్య ధోరణి కారణంగానే పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు.

ఈ కేసుపై డీసీపీ ఏమన్నారంటే..

ఈ భద్రతా లోపాలకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ‘‘బుధవారం రాత్రి 9:90 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షోను.. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో వేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాను తిలకించడం కోసం సినిమాలోని కీలక నటులు థియేటర్‌కు వస్తారన్న సమాచారం పోలీసులకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. పైగా థియేటర్ యాజమాన్యం కూడా ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపు చేయడం కోసం థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌ో ఎటువంటి ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు. రాత్రి 9:40 గంటలకు తన వ్యక్తిగత భద్రతతో అల్లు అర్జున్.. థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించారు. వారికి అదుపు చేసే క్రమంలో భద్రతా సిబ్బంది వారిని నెట్టేయడం ప్రారంభించారు’’ అని తెలిపారు.

‘‘అప్పటికే థియేటర్ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలో తోపులాట మొదలైంది. అది కాస్తా క్షణాల వ్యవధిలోనే తొక్కిసలాటగా మారింది. ఈ క్రమంలోనే దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవంత్ కుటుంబం కిందపడిపోయింది. వారిని గమనించిన పోలీసులు.. వెంటనే వారిని బయటకు లాగారు. రేవతి కుమారుడు శ్రీతేజకు వెంటనే సీపీఆర్ చేసి.. దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. కాగా రేవతి అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో బాలుడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ వెల్లడించారు.

ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు..

సంధ్య థియేటర్ ఘటనపై న్యాయవాది రవి కుమార్.. జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.‘‘సంధ్య థియేటర్ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు పాటించకపోవడమే కాకుండా రద్దీని నియంత్రించడంలో కూడా విఫలమైంది. అల్లు అర్జున్‌ను చూడటం కోసం ఎగబడ్డ ప్రేక్షకులను కట్టడి చేయడంలో థియేటర్ యాజమాన్యం తీవ్రంగా ఫిలం కావడమే తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా. ఆమె కుమారుడు శ్రీతేజ.. ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులకు బాధ్యులు రూ.5కోట్ల పరిహారం అందించాలి. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఒక బాలుడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని న్యాయవాది రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌కు రిమాండ్..?

అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇప్పటికే ఆయనకు ఏడు రోజుల డిమాండ్ విధించారని, నాలుగు రోజుల రిమాండ్ విధించారంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అటువంటిదేమీ జరగలేదని, మరికాసేపట్లో అల్లు అర్జున్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. కానీ ఒకవేళ కోర్టు.. అల్లు అర్జున్‌కు రిమాండ్ విధిస్తే.. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించడం ఖాయం. ఒక స్టార్ హీరో.. సక్సెస్‌ స్ట్రీక్‌లో ఉన్న హీరోకు రిమాండ్ అంటే తీవ్ర దుమారానికి దారి తీయొచ్చని కొందరు చెప్తున్నారు. అదే జరిగితే పోలీసులు హైఅలెర్ట్ కావాల్సి వస్తుందని, సదరు హీరో అభిమానుల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా వారు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


అరెస్ట్‌కు అబ్జెక్ట్ చెప్పిన బన్నీ..

కాగా తనను అరెస్ట్ చేసిన విధానంపై అల్లు అర్జున్న అబ్జెక్షన్ చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అందులో తనను బెడ్‌రూమ్‌ నుంచి అరెస్ట్ చేశారని, అసలు బెడ్ రూమ్ వరకు ఎలా వస్తారని అల్లు అర్జున్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తాను అల్పాహారం తీసుకుంటున్నానని, ఒక పది నిమిషాల సమయం ఇస్తే.. అది పూర్తి చేసుకుని వస్తానని అంటుండటం మనకు వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోలో అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.


బన్నీకి 5-10 ఏళ్ల శిక్ష..!

ఇదిలా ఉంటే నటుడు అల్లు అర్జున్‌పై ఒక వ్యక్తి హత్యకు సంబంధించిన అన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే ఆయనకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసుల వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 


Tags:    

Similar News