సిగాచి సంస్థపై సర్కార్ సీరియన్.. కేసు నమోదు..
సిగాచి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని సీఎం తప్పుబట్టారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.;
పాశమైలారం సిగాచి సంస్థలో జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కంటతడి పెట్టించింది. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన కార్మికులు మాసం ముద్దలుగా మారారు. మరికొందరివైతే ఆ మాంసం ముద్దలు కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎంత అనేది మాత్రం తేలలేదు. కొందరు 50కి చేరిందంటే, మరికొందరు 42 మంది మరణించారని అంటున్నారు. ఘటన స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న కారణంగా కచ్ఛితమైన సంఖ్య చెప్పలేమని అధికారులు అంటున్నారు. కాగా ఈ ఘటనపై దృష్టి సారించిన ప్రభుత్వం సిగాచి సంస్థ యాజమాన్యంపై ఫుల్ సీరియస్ అయింది. కనీస భద్రతా సౌకర్యాలను ఎందుకు కల్పించలేదని నిలదీస్తోంది. తాజాగా సదరు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశఆల మేరకు ప్రత్యేక టీమ్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.
సిగాచి సంస్థలో భారీ పేలుడు సంభవించి రెండు రోజులు గడిచాయి. కానీ ఇప్పటి వరకు సంస్థ ఎండీ అక్కడకు చేరుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఖర్చు విషయంలో వెనకాడొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగానే సిగాచి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని సీఎం తప్పుబట్టారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రేవంత్ చెప్పిన 24 గంటల్లోనే సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు కావడం, ప్రత్యేక టీమ్ దర్యాప్తును టేకప్ చేయడం జరిగింది.