కవిత ఇంటి దగ్గర భారీ భద్రత
ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ఉండటం కోసం ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం, కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ఉండటం కోసం ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగ్రృతి కార్యకర్తల దాడి చేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే విధంగా కవితను ఉద్దేశించిన మల్లన్న చేసిన వ్యాఖ్యలను కూడా అంతా తప్పుబడుతున్నారు. మాండలికం అని సర్దిచెప్పుకున్నంత మాత్రాన తప్పు ఒప్పు కాదని అంటున్నవారు కూడా ఉన్నారు. ఇంతలోనే కవిత, మల్లన్న ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌కు ఫిర్యాదులు చేశారు. మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని కవిత డిమాండ్ చేయగా.. మల్లన్న కూడా కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని గుత్తు సుఖేందర్‌కు డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి హైటెన్షన్ వాతావరణ నెలకొనడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
కవిత ఇంటికి వెళ్లే ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమతి ఉన్న వారినే అనుమతిస్తున్నారు. కార్యాలయం పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, ఎలాంటి అసాధారణ చలనం ఉన్నా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను మోహరించారు. కవితపై ఇటీవల వచ్చిన ఆరోపణలు, తీన్మార్ మల్లన్నపై దాడికి సంబంధించిన పరిణామాలు, వాటిపై ఆమె అభిమానుల ఆందోళనలుఅన్నీ కలిపి పోలీసులు ఈ విధంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ, అక్కడి పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా, అప్రమత్తంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.